మూడో రోజు కొనసాగుతున్నకూల్చివేతలు
హైదరాబాద్: నగరంలోని నాలాలపై గల అక్రమ కట్టడాల కూల్చివేతలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రామాంతపూర్, గచ్చబౌలి, కొండాపూర్, గోకుల్‌ప్లాట్స్, ఇందిరానగర్, మంజీరారోడ్, మాతృశ్రీనగర్, సురక్ష కాలనీలో గల అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. ఇప్పటికే రెండు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో అక్రమ కూల్చివేతలు కొనసాగుతుండగా.. ఈ రోజు మరిన్ని భవనాలు కూల్చేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు యత్నిస్తున్నారు. కుషాయి గూడలో జరుగుతున్న కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. అదేవిధంగా చర్లపల్లిలో కూల్చివేతలను కూడా స్థానికులు అడ్డుకుని, మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కూకట్ పల్లి వివేకానంద నగర్ లో నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. కేపీహెచ్బీ రోడ్ నెం2 లో కూడా కూల్చివేతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈ భవనాలపై జీహెచ్ఎంసీకి పలు ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా పీవీ ఎక్స్ ప్రెస్ హైవేను ఆనుకుని ఉన్న అక్రమ కట్టడాలపై కూడా జీహెచ్ ఎంసీ దృష్టి సారించింది. మరో వైపు మూడు రోజు జరగుతున్న నిర్మాణాల తొలగింపుపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.