దుందుడుకు చర్యలను అడ్డుకుంటూ హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అవుతుంటే మినహా కూల్చడానికి వీల్లేదు
అతిక్రమణలు స్వల్పం, సాధారణం, అప్రధానం అయినప్పుడు కూల్చరాదు
విచక్షణ, అధికారాన్ని ఉపయోగించేటప్పుడు నిష్పాక్షికంగా ఉండాలి
ఏ నిర్ణయం తీసుకున్నా చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి
వివరణలు, అదనపు వివరణలు, డాక్యుమెంట్లు తీసుకుని విచారించండి
అవసరమైనప్పుడల్లా వైఎస్సార్‌సీపీ వాదనలు వినాలి
రికార్డులు, సంబంధిత భవనాలను పరిశీలించండి
మొత్తం ప్రక్రియ ముగిసే వరకు కార్యాలయాలపై ఎలాంటి కఠిన చర్యలొద్దు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కార్యాలయాల కూల్చివేతలే లక్ష్యంగా కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి హైకోర్టు ముకుతాడు వేసింది. అధికారుల దుందుడుకు చర్యలను అడ్డుకునే దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అవుతుంటే మినహా కార్యాలయాలను కూల్చడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి అతిక్రమణలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, ప్రజల భద్రతకు ప్రమాదకారిగా మారినప్పుడు మాత్రమే కూల్చివేతలు చేపట్టవచ్చని, అయితే అతిక్రమణలు స్వల్పం, సాధారణం, అప్రధానం అయినప్పుడు అధికారులు ఎంత మాత్రం భవనాల కూల్చివేతలకు దిగరాదని హైకోర్టు ఆదేశించింది.
అధికారులు తమ విచక్షణ, అధికారాన్ని వినియోగించే సమయంలో నిష్పాక్షికంగా, వాస్తవ దృక్పథంతో చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది. పార్టీ కార్యాలయాల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది చట్టానికి లోబడే ఉండాలని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం తమకున్న ప్రత్యామ్నాయాలన్నింటినీ వైఎస్సార్‌సీపీ వర్గాలు సంబంధిత అధికారుల వద్ద ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. చట్ట ప్రకారం వ్యవహరించేందుకు వీలుగా నేటి నుంచి రెండు వారాల్లోపు పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన ఆధారాలు, అదనపు డాక్యుమెంట్లు, వివరణ, అదనపు వివరణలను అధికారులకు సమర్పించవచ్చని పేర్కొంది.
రెండు వారాల గడువు ముగిసిన తరువాత వైఎస్సార్ సీపీ సమర్పించిన ఆధారాలు, అదనపు వివరణలు, డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకుని విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. వైఎస్సార్‌సీపీ వాదనను కూడా వినాలని ఆదేశించింది. అంతేకాకుండా రికార్డులు, సంబంధిత భవనాలను పరిశీలించిన తరువాతే పూర్వాపరాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని అధికారులకు తేల్చి చెప్పింది.
ప్రతి దశలోనూ వైఎస్సార్‌సీపీ వాదనలు వినాలని, ముఖ్యంగా మునిసిపల్ కార్పొరేషన్ చట్టం, మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్ట నిబంధనల కింద అవసరమైనప్పుడల్లా వారి వాదనను వినాల్సిందేనని తెలిపింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు వైఎస్సార్ సీపీ కార్యాలయాల విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికి వీల్లేదని అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలతో పార్టీ కార్యాలయాల కూల్చివేతలపై వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన వ్యాజ్యాలన్నింటినీ పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గురువారం తీర్పు వెలువరించారు.
కూల్చివేతల నోటీసులపై పిటిషన్లు..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తమ పార్టీ కార్యాలయాల కూల్చివేత నిమిత్తం పురపాలక శాఖ అధికారులు జారీ చేసిన షోకాజ్ నోటీసులు, ప్రాథమిక ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్సార్ సీపీ, పార్టీ నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. కూల్చివేతలకు పాల్పడకుండా అధికారులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అనుబంధ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై గత గురువారం వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
నిర్మాణ సమయంలో అధికారులు సందర్శించలేదు..
‘రాష్ట్ర విధానంలో భాగంగా అన్ని జిల్లాల్లో రాజకీయ పార్టీ కార్యాలయాల నిర్మాణం నిమిత్తం భూముల కేటాయింపు జరిగింది. భూములను స్వాధీనం కూడా చేశారు. ఆ ఖాళీ స్థలాలకు ఆస్తి పన్నులు కూడా చెల్లించారు. భవన నిర్మాణాలకు అనుమతి కోరుతూ దరఖాస్తులు సమర్పించారు. కొన్ని చోట్ల బిల్డింగ్ పర్మిట్‌లు కూడా వచ్చాయి.
అత్యధిక చోట్ల భవన నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. అధికారులు ఎప్పుడూ నిర్మాణ సమయంలో భవనాలను సందర్శించ లేదు. ఇప్పుడు అత్రికమణలు ఉన్నాయంటూ కూల్చివేతలకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ కాలం తరువాత కూల్చివేతల కోసం నోటీసులు జారీ చేశారు’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు
భవన నిర్మాణాల్లో ఎలాంటి అతిక్రమణలు లేవని, చట్ట నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు చేపట్టామన్న వైఎస్సార్ సీపీ తరఫు సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనను న్యాయమూర్తి పరిగణలోకి తీసుకున్నారు. చట్ట ప్రకారం పెనాల్టీ విధించి నిర్మాణాలను క్రమబద్ధీకరించే అధికారం కమిషనర్లకు ఉందన్న వాదనను కూడా పరిగణలోకి తీసుకున్నారు.
భవనాల కూల్చివేత వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏమీ లేదని, తమకు మాత్రం ఆర్థికంగా తీవ్ర నష్టం కలుగుతుందని, అధికారులు ప్రస్తావించిన అతిక్రమణలు సైతం సరిచేసేందుకు అవకాశం ఉన్నవేనన్న వాదనను కూడా న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment