వెనకడుగు వేసేది లేదు.. | no back step | Sakshi
Sakshi News home page

వెనకడుగు వేసేది లేదు..

Published Sat, Oct 1 2016 12:30 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

వడ్డేపల్లి నాలాలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

వడ్డేపల్లి నాలాలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

  • బడా నిర్మాణాలనూ కూల్చివేస్తాం
  • పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు
  • ఆక్రమణపై సమగ్ర సర్వే చేపడతాం
  • మేయర్‌ నన్నపునేని నరేందర్‌
  •  
    సాక్షి, హన్మకొండ : గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో నాలాలు, చెరువులపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో వెనకడుగు వేసే ప్రశ్నే లేదని గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ పాలకవర్గం, అధికారులు స్పష్టం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని ఈ సందర్భంగా మేయర్‌ నన్నపునేని నరేందర్‌ తేల్చిచెప్పారు. అయితే, పేదలకు డబుల్‌ ఇళ్లు మంజూరు చేసిన తర్వాతే పేదల ఇళ్లు కూల్చివేస్తామని హామీ ఇచ్చారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో భాగంగా మూడో రోజైనశుక్రవారం బొందివాగు, వడ్డేపల్లి నాలాలపై  28 కట్టడాలను కూల్చివేశారు.
     
    ముందుగా వడ్డేపల్లి, బొందివాగులు
    అక్రమ కట్టడాల కూల్చివేత మూడో రోజు శుక్రవారం హంటర్‌రోడ్డు దగ్గర రైల్వే బ్రిడ్జి కింద నుంచి ప్రవహిస్తున్న బొందివాగు నాలాపై ఉన్న అక్రమణలను కూల్చివేతను మేయర్‌ నన్నపునేని నరేందర్‌ స్వయంగా పరిశీలించారు. బొందివాగు, వడ్డేపల్లి నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల కారణంగానే నగరంలో 60 శాతం ప్రాంతం ముంపుకు గురైయిందని తెలిపారు. ఈ నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.  ఈ రెండు నాలాల తర్వాత నగరంలో ఉన్న మిగిలిన నాలాలు, మురుగు కాల్వలు, చెరువుల ఫుల్‌ టాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్‌ ఏరియాలో ఉన్న నిర్మాణాలను గుర్తించి తొలగిస్తామన్నారు. నాలాల అక్రమణల తొలగింపుతో పెద్దవారి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నామని మేయర్‌ నన్నపునేని నరేందర్‌ తెలిపారు.
     
    పునరావాసం 
    పేదల నిర్మాణాలను కూల్చక తప్పని పరిస్థితి నెలకొంటే, ప్రత్యామ్నాయ పునరావాసం కల్పిస్తామని మేయర్‌ నరేందర్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రెండు పడక గదుల ఇళ్లను కేటాయించడంతో పాటు  ప్రభుత్వపరంగా ఇతర సహాయం అందేలా చూస్తామని అన్నారు. కూల్చివేతల సందర్భంగా తమ నిర్మాణాలు కూల్చివేయెుద్దంటూ ఎన్టీఆర్‌ కాలనీలో పేదలు మేయర్‌కు మొర పెట్టుకోగా ప్రస్తుతానికి క్లియర్‌ కట్‌గా ఉన్న అక్రమణ కట్టడాలనే కూల్చివేస్తున్నామని ఆయన బదులిచ్చారు. పేద ప్రజలకు భవిష్యత్తులో వరద వల్ల ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఒకవేళ తప్పనిసరిగా కూల్చివేయాల్సి వస్తే నష్టపోయిన పేదలకు ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తామని మేయర్‌ అన్నారు. అలాంటి వారికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు  కేటాయిస్తామన్నారు.
     
    మూడో రోజు
    మూడో రోజు బొందివాగు, వడ్డేపల్లి నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హంటరు దగ్గర బొందివాగు వెంట 23 నిర్మాణాలను కూల్చివేయగా ఇందులో 12 ప్రహరీలు, పది టాయిలెట్లు, ఒక పునాది నిర్మాణం ఉంది. ఇక వడ్డేపల్లి నాలాను అక్రమిస్తూ నిర్మించిన ఐదు ప్రహారి గోడలను కూల్చివేశారు. మూడు రోజుల వ్యవధిలో ఇప్పటి వరకు 79 అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతలపై యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించేందుకు శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ వాకాటి కరుణ, నగర పోలీసు కమిషనర్‌ జి.సుధీర్‌బాబు, మేయర్‌ నన్నపునేని నరేందర్, గ్రేటర్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, సాగునీటి శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయగా... చివరి నిమిషంలో ఈ సమావేశం రద్దయ్యింది.
     
    ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు
    – మేయర్‌ æనన్నపునేని నరేందర్‌
    ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు చందాలు ఇవ్వనందుకే తమ నిర్మాణాలను కూల్చివేశారంటూ చైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ సి.పురుషోత్తంరెడ్డి చేసిన అరోపణలు పస లేనివని మేయర్‌ నరేందర్‌ కొట్టిపారేశారు. వడ్డేపల్లి నాలాపై చైతన్య విద్యాసంస్థలకు చెందిన సిబ్బంది భవనాలు ఉండడం వల్లే కూల్చివేశామన్నారు. దాస్యం వినయ్‌భాస్కర్‌ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని.. గత నాలుగేళ్లుగా ఆయన చందాలు కోసం వేధిస్తుంటే ఆ విషయాన్ని పురుషోత్తంరెడ్డి ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. నాలాలు, చెరువులు భూ కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదని మేయర్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement