Telangana: మూసీ ‘రెడ్‌ మార్క్‌’! | House Holds Protests continue for survey teams along Musi river | Sakshi
Sakshi News home page

Telangana: మూసీ ‘రెడ్‌ మార్క్‌’!

Published Fri, Sep 27 2024 3:59 AM | Last Updated on Fri, Sep 27 2024 3:59 AM

House Holds Protests continue for survey teams along Musi river

గూడు వదిలేది లేదంటున్న బాధితులు

మూసీ నది వెంట సర్వే బృందాలకు నిరసన సెగలు.. 

ఎక్కడో ఇచ్చే డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు మాకు ఎందుకంటూ మండిపాటు

నదీ గర్భంలోని కట్టడాల కూల్చివేతకు సర్కారు మార్కింగ్‌ 

పాత సర్వే ప్రకారం వివరాల సేకరణ.. యాప్‌లో నమోదు 

అర్హులైన నిర్వాసితులకు డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల హామీ 

రెండు మూడు రోజుల్లోనే లబ్ధిదారులకు పట్టాలు అందజేసేందుకు ఏర్పాట్లు.. ఏరియాల వారీగా కుటుంబాల తరలింపు ప్రక్రియ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: మూసీ కట్టడాలపై రెడ్‌ మార్క్‌ పడింది. పరీవాహకంలోని నివాసితుల గుండెల్లో ఆవేదన రేపుతోంది. పునరావాసం కింద ఎక్కడో ఇచ్చే డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు మాకెందుకంటూ చాలా మంది గోడు వెళ్లబోసుకుంటున్నారు. కడుపుకట్టుకుని సొమ్ముదాచుకుని ఇళ్లు కట్టుకున్నామని, ఏళ్లకేళ్లుగా అక్కడే బతుకుతున్న తమను వెళ్లిపొమ్మంటే ఎలాగని ఆందోళన చెందుతున్నారు. 

పరీవాహకం వెంట సర్వే చేసి, ఇళ్లకు మార్కింగ్‌ చేసేందుకు వచ్చిన అధికారుల బృందాలపై విరుచుకుపడుతున్నారు. దీంతో అధికారులు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి సర్వే చేస్తున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా.. మొదటి విడతగా నదీ గర్భంలో ఉన్న కట్టడాల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. సుమారు 25 ప్రత్యేక బృందాలు గత నివేదికల ఆధారంగా ఇళ్లను గుర్తించి ‘ఆర్‌బీ–ఎక్స్‌’ పేరుతో ఎరుపు రంగులో మార్కింగ్‌ చేస్తున్నాయి. ఆయా ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాల సమగ్ర వివరాలను సేకరించి అక్కడికక్కడే ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నాయి. 

12 వేల కట్టడాల గుర్తింపు 
హైదరాబాద్‌ నగరంలో సుమారు 55 కిలోమీటర్ల పొడవునా మూసీ పరీవాహక ప్రాంతంలో 12వేలకుపైగా కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, పోలీసు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం సంయుక్తంగా సర్వే నిర్వహించి.. నదీ గర్భంలో ఉన్న, బఫర్‌జోన్‌లో ఉన్న ఇళ్లు, నిర్మాణాలుగా వర్గీకరించారు. 

నది గర్భంలో 2,166 కట్టడాలు ఉండగా.. అందులో 288 భారీ నిర్మాణాలు ఉన్నాయి. నది సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్ల వరకు ఉన్న బఫర్‌జోన్‌ పరిధిలో 7,851 కట్టడాలు ఉండగా.. అందులో 1,032 భారీ నిర్మాణాలు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవానికి మొత్తంగా 30వేలకు పైగానే నివాసాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. 

చావనైనా చస్తాం.. కూల్చనివ్వం 
‘‘ఎన్నో ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్నాం. కరెంటు, నీటి బిల్లులు కడుతున్నాం. ఇప్పుడు కూల్చుతామంటే ఎలా? చావనైనా చస్తాం కానీ ఇళ్లను కూల్చనివ్వం.. ఇంత విషం ఇచ్చి ఆ పుణ్యంకూడా మీరే కట్టుకోండి..’’ అంటూ మూసీ పరీవాహకం పరిధిలోని చైతన్యపురి వినాయకనగర్‌ కాలనీ నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ రివర్‌బెడ్, బఫర్‌జోన్లలోని ఇళ్లను మార్కింగ్‌ చేయడానికి వచ్చిన సర్వే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వారి నుంచి రంగు డబ్బాలను లాక్కుని పారబోశారు. వేసిన మార్కింగ్స్‌ను తుడిపేశారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటూ మాయమాటలు చెప్తున్నారంటూ అధికారులు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సర్వే బృందాలు వెనక్కి తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ అధికారులకు ఇదే తరహా నిరసన ఎదురైంది.

కడుపు కట్టుకుని కొనుక్కున్నాం.. ఇక్కడే సమాధి అవుతాం 
‘‘మావి కబ్జా చేసుకుని కట్టుకున్న ఇళ్లు కావు.. కడుపు కాల్చుకుని దాచుకున్న డబ్బులతో కట్టుకున్న ఇళ్లు మావి. కరెంట్, నీటి, ఇంటి పన్నులు చెల్లిస్తున్నాం. స్థలాలు రిజిస్ట్రేషన్లు చేసుకుని ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నాం. వీటిని వదిలి వసతులేవీ లేనిచోట ఎక్కడో అడవులలో కట్టిన డబుల్‌ బెడ్రూమ్‌లను ఇస్తామంటే వెళ్లే ప్రసక్తే లేదు. 

ఇక్కడే ఉంటాం. ఇంట్లోనే సమాధి అవుతాం..’’ అంటూ అత్తాపూర్‌ డివిజన్‌ భరత్‌నగర్‌ వాసులు అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలు ఆక్రమించి విల్లాలు నిర్మించుకున్న బడాబాబుల ఫాంహౌస్‌లు కూల్చివేయకుండా సామాన్యులు, పేద, మధ్య తరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం ఏమిటంటూ మండిపడ్డారు.

తొలివిడతగా నది గర్భంలో.. 
మూసీ ప్రాజెక్టులో భాగంగా తొలి విడతలో నది గర్భంలో ఉన్న నివాసాల తొలగింపుపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. అందులో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 1,595, మేడ్చల్‌–మల్కాజిగిరి పరిధిలో 239, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 కట్టడాలను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

పునరావాసం కింద డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు 
మూసీ పరీవాహకంలో ఇళ్లు తొలగిస్తున్న నేపథ్యంలో.. బాధితులకు పునరావాసం కోసం 15వేల డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నది గర్భం, బఫర్‌ జోన్లలో నివాసం ఏర్పాటు చేసుకున్న అర్హులైన పేద కుటుంబాలకు ఈ డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను కేటాయించనున్నారు. 

బఫర్‌ జోన్‌లో తొలగించే ఇళ్లు, నిర్మాణాలకు సంబంధించి.. పునరావాస చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని, దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నష్టపరిహారం చెల్లించి, భూసేకరణ చేపడతామని వివరిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లోనే నిర్వాసితులకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల పట్టాలు కూడా అందజేస్తామని అంటున్నారు.

ఎక్కడో దూరంగా ఇళ్లు ఇస్తుండటంపై.. 
మూసీ పరీవాహకంలో తొలి విడతగా ఇళ్ల తొలగింపుతో రెండు వేలకుపైగా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్, మున్సిపల్, రెవెన్యూ ఉన్నతాధికారులు సైదాబాద్, వనస్థలిపురం ప్రాంతాల్లోని డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల సముదాయాలను పరిశీలించారు. 

ఈ రెండు ప్రాంతాల్లో గతంలో కొందరు మూసీ నిర్వాసితులకు ఇళ్లు కేటాయించినా.. తిరిగి వెనక్కి వచ్చినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. దూర ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని అంటున్నాయి. 

నదీ గర్భం నుంచి తరలింపు ప్రారంభం 
మూసీ పరీవాహకంలోని కొత్తపేట భవానీనగర్‌ రోడ్డు నంబర్‌ 10లో నివాసం ఉంటున్న పదకొండు కుటుంబాలను అధికారులను తరలించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి వారితో ఆ కుటుంబాలతో మాట్లాడారు. వారి సమ్మతితోనే వనస్థలిపురం, ప్రతాపసింగారం, తిమ్మాయి గూడలలోని డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లకు ప్రభుత్వ ఖర్చులతో డీసీఎంలలో సామగ్రిని తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement