musi colony people
-
మూసీ నిర్వాసితుల కోసం టవర్లు
సాక్షి, హైదరాబాద్: మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని.. నిర్వాసితులకు అక్కడే అద్భుతమైన టవర్లు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. నిర్వాసితులు సకల సౌకర్యా లతో ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భట్టి ప్రసంగించారు. మూసీ నిర్వాసితుల పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిర్వాసితులైన డ్వాక్రా మహిళల కు రూ.1,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని.. చిన్నతరహా పరిశ్రమలు ఏర్పా టు చేసి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. పరీవాహక ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కోసం 39 ఎస్టీపీలు మంజూరు చేశామని భట్టి చెప్పారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లకు బ్యాంకర్లతో ఉన్న సమస్యలపై త్వరలోనే ఎస్ఎల్బీసీ సమావేశం ఏర్పాటు చేసి స్పష్టత ఇస్తామని వివరించారు. గత ప్రభుత్వం తరహాలో అనుకూలంగా ఉన్న వాళ్లను దగ్గరికి తీసుకోవడం, లేని వాళ్లను దూరం పెట్టడం వంటి ఆలోచన తమకు లేదన్నారు.అద్భుతంగా ఫ్యూచర్ సిటీ..: హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిపై కొన్ని నెలలుగా కావాలనే కొందరు విష ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రోడ్డుతోపాటు 30 వేల ఎకరాల్లో అద్భుతంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి 30 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి చేరుకోవచ్చని.. అక్కడ ప్రపంచ స్థాయి యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం వంటివెన్నో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయాలన్న చిత్తశు ద్ధి, సంకల్పంతో ఉందన్నారు. నాటి పాలకులు బీహెచ్ఈఎల్, సీసీఎంబీ, హెచ్ఈ ఎల్ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారని.. ఫలితంగా వారి నివాసం కోసం కూకట్పల్లి, వెంగళరావునగర్, బర్కత్‌పుర వంటి హౌసింగ్ బోర్డులు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ. పది వేల కోట్లు కేటాయించామన్నారు. ఆ నిధులతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, డ్రైనేజీలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రపంచ డెవలపర్లను ఆకర్షిస్తామని చెప్పారు. -
‘మూసీ’ బాధితులకు గచ్చిబౌలిలో ఇళ్లు కట్టివ్వాలి
గజ్వేల్: ‘‘మల్లన్నసాగర్ నిర్వాసితులకు కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేనట్టుగా సకల సౌకర్యాలతో ఆర్అండ్ కాలనీ నిర్మించి ఇచ్చారు. మేం చేసిన దాంట్లో పదో వంతైనా మూసీ నిర్వాసితులకు న్యాయం చేయగలరా? బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలోకి నిర్వాసితులను పంపి, ఖర్చులకు రూ.25 వేలు ఇచ్చి తానేదో గొప్ప పనిచేసినట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించుకోవడం సిగ్గుచేటు’’అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు పాత ఇళ్లు కోల్పోయినందుకు పరిహారం కింద రూ.694 కోట్లు అందజేశామని హరీశ్‌రావు చెప్పారు. అదేవిధంగా ఇంటి యజమానికి రూ.7.5 లక్షలు, పెళ్లికాని యువతీయువకులకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ప్యాకేజీలు ఇచ్చామని.. ఇళ్లు కావాలన్న వారికి 250 గజాల స్థలంలో కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చామని గుర్తు చేశారు.పునరావాస కాలనీల్లో దేశంలో ఎక్కడాలేని విధంగా విశాలమైన రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మంచినీరు, గుడి, బడి, అంగన్వాడీ, రేషన్‌షాపులు వంటి సౌకర్యాలను సమకూర్చామని చెప్పారు. వ్యవసాయ భూములకు కూడా పరిహారం ఇచ్చామని వివరించారు. వీటన్నింటితోపాటు ఖర్చుల కింద రూ.30 వేల నుంచి రూ.50 వేలు అందించామని వివరించారు. రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇళ్లు కట్టివ్వాలి మల్లన్నసాగర్ నిర్వాసితులకు 2,270, కొండపోచమ్మసాగర్‌కు సంబంధించి 1,141 ఇళ్లు నిర్మించి ఇచ్చామని హరీశ్‌రావు వివరించారు. 2013 భూసేకరణ చట్టంలో చెప్పినదానికంటే మెరుగైన సహా య, పునరావాస కార్యక్రమాలను చేపట్టామన్నారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మల్లన్నసాగర్ నిర్వాసితుల తరహాలోనే మూసీ నిర్వాసితులకు గచ్చిబౌలిలోని 500 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇళ్లు ని ర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పలు సాంకేతిక కారణాలతో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిర్వాసితులకు పది శాతం ప్యాకేజీలు, పరిహారాలు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటికి వెంటనే నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాయం పెంచి ఇస్తే తానే స్వయంగా వచ్చి సీఎం రేవంత్‌కు పూలదండ వేసి సన్మానం చేస్తానని హరీశ్‌రావు చెప్పారు. నిర్వాసితులపై కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం ప్రేమ లేదని హరీశ్‌రావు మండిపడ్డారు.చీఫ్ మినిస్టర్ కాదు.. చీటింగ్ మ్యాన్ తిమ్మాపూర్: కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు ఏమయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘‘సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి, చీఫ్ మినిస్టర్ కాదు.. చీటింగ్ మ్యాన్’’అని విమర్శించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడారు. దేవుడి మీద ఒట్టుపెట్టి రాజకీయం చేసే నాయకుడిని తాను ఇప్పటివరకు చూడలేదని.. రేవంత్ చేసిన పాపాల నుంచి ప్రజల ను కాపాడాలంటూ తాను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళితే అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రె స్ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు మరో ఉద్యమం రావాలన్నారు. -
సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం!: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్:‘అధికారం కోల్పోయి నిస్పృహ, అసహనంతో మూసీ నది పునరుజ్జీవానికి కొంతమంది అడ్డుపడుతున్నారు. మూసీ సుందరీకరణ అనే డైలాగ్‌ను ప్రచారంలోకి తెచ్చారు. మేము అందాల కోసం పని చేయడం లేదు. అందాల భామలతో కలిసి పనిచేయడం లేదు. అలాంటి కొంతమంది.. మంత్రులు, ప్రజాప్రతినిధుల ముసుగులో పదేళ్లు రాష్ట్రాన్ని పట్టిపీడించి బందిపోటు దొంగలకంటే దుర్మార్గంగా పట్టపగలు దోపిడీ చేసి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మూసీ పునరుజ్జీవన ప్రయత్నాలపై విష ప్రచారంతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. మూసీ మురికిని మించి మెదడులో విషం నింపుకుని తెలంగాణ సమాజంపై దాడి చేస్తున్నారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం సచివాలయంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక్కొక్కరిని ఒప్పించి తరలిస్తాం ‘ఇది సుందరీకరణ కాదు.. దుబాయ్‌కి వెళ్లి నెత్తిమీద జుట్టును నాటు వేయించుకున్న విధానం కాదు. పునరుజ్జీవంతో మూసీని, మురికిలో కాలం వెళ్లదీస్తున్న ప్రజలను కాపాడి మంచి జీవనాన్ని ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, ప్రత్యామ్నాయ ఇళ్లను ఇవ్వాలనే ఆలోచన మాకు ఉంది. కానీ పేదరికం, కట్టుబానిసలు ఉండాలనే దొరలు, భూస్వాములు, జమీందారుల భావజాలం ఉన్నవారు దీనికి అడ్డుపడుతున్నారు. అక్కడి ప్రజల భవిష్యత్తుపై అపోహలు సృష్టిస్తున్నారు. నిజానికి 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించగల కార్యాచరణ ఇది. గత 10 నెలల పాటు అధికారులు 33 బృందాలుగా ఏర్పడి మూసీ దుర్గంధంలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతి ఇంటికీ వెళ్లి వారి కష్టాలు, వివరాలను తెలుసుకున్నారు. వారిని ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై మేం ఆలోచన చేస్తున్నాం. అక్కడి సమస్యలు పరిష్కరించి ఒక్కొక్కరిని ఒప్పించి తరలిస్తాం..’ అని సీఎం స్పష్టం చేశారు. సెక్యూరిటీ లేకుండా వస్తా..మీరూ రండి ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ భూసేకరణ కోసం వేములఘాట్ ప్రజలపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించి గుర్రాలతో తొక్కించినట్టుగా మేం చేయం. ఇక్కడికి వస్తావా? అక్కడికి వస్తావా? అని నన్ను అడుగుతున్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, గజ్వేల్‌లోని ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మకు నేను సెక్యూరిటీ లేకుండా వస్తా. బీఆర్ఎస్ నేతలూ రావాలి. రచ్చబండ నిర్వహించి పదేళ్లలో ఎన్ని దుర్మార్గాలు చేశారో ప్రజలను అడుగుదాం..’ అని రేవంత్ సవాల్ చేశారు. బఫర్ జోన్లో మరో 10 వేల గృహాలు ‘మూసీ గర్భంలో 1,690 ఇళ్లు ఉండగా వారికి దసరా పండుగ వేళ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు రూ.25 వేలు చొప్పున తోవ ఖర్చులకు ఇచ్చాం. అయితే హైడ్రా వస్తుంది..బుల్డోజర్లు పెడ్తున్నరు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీలో ప్రభుత్వం ఒక్క ఇల్లు కూలగొట్టలేదు. ఖాళీ చేసిన లబ్ధిదారులే తమ ఇళ్ల తలుపులు, కిటికీల కోసం కూలగొట్టుకున్నారు. అడ్డగోలుగా కట్టిన 10, 20 అంతస్తుల ఆకాశహర్మ్యాలను కూల్చడానికే బుల్డోజర్లు, హైడ్రా అవసరం. అయినా హైడ్రా ఏమైనా ఫామ్‌హౌస్‌లో నిద్రపోయే భూతమా? మీద పడడానికి? మరో 10 వేల ఇళ్లు బఫర్‌జోన్‌లో ఉన్నాయి వారికి ప్రత్యామ్నాయం కల్పించి, మంచి జీవితాలు ఇచ్చి మనస్సు గెలవాలని భావిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. అద్భుతాలు సృష్టించిన కంపెనీలతో కన్సార్టియం ‘ప్రపంచంలో అద్భుతాలను సృష్టించిన ఐదు కంపెనీలతో ఒక కన్సార్టియం ఏర్పాటు చేయించి రూ.141 కోట్లతో మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతలను టెండర్ల ద్వారా అప్పగించాం. డీపీఆర్ తయారీతో పాటు అంచనా వ్యయం, నిధులు, పెట్టుబడులు, రుణాల సమీకరణకు సంబంధించి కన్సార్టియం సహకారం అందిస్తుంది. 18 నెలల్లో డీపీఆర్ తయారు చేస్తారు. ఆ తర్వాత నాలుగైదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఆరున్నరేళ్ల పాటు కన్సార్టియం సేవలందిస్తుంది. ఈ కన్సార్టియంలో భాగమైన ‘మీన్‌హార్ట్’ కంపెనీకే ప్రధాని మోదీ గుజరాత్లో సర్దార్ పటేల్ విగ్రహం కట్టే బాధ్యత అప్పగించారు. అలాగే రాష్ట్రంలో కేసీఆర్, రామేశ్వర్రావు తమ కులగురువు చినజీయర్‌స్వామితో కలిసి సమతామూర్తి విగ్రహాన్ని కట్టే బాధ్యత అప్పగించారు. గత ప్రభుత్వం ఉప్పల్‌లో మూసీపై రూ.30 కోట్లతో పనులు ప్రారంభించి రూ.6 కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో ఉంది. కానీ వర్షం వచ్చి చేసిన పనికొట్టుకుపోయిందని అంటున్నారు. ఈ వ్యవహారంలో లోపల వేయవచ్చు. చర్లపల్లి జైల్లో వేస్తే తిండిదండగ అని మేం చూసీచూడనట్టుగా ఉంటే వారికి అలుసుగా ఉంది..’ అని రేవంత్ అన్నారు. ‘మూసీ’పై అసెంబ్లీలో చర్చకు సిద్ధం ‘మూసీ ఒడ్డున ఖాళీ చేసిన ఇళ్లల్లో హరీశ్, కేటీఆర్, ఈటల రాజేందర్ మూడు నెలలు ఉంటే ఈ ప్రాజెక్టును ఆపేస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. ప్రజలు అక్కడ ఉండడం అద్భుతం అనుకుంటే మీరూ ఉండండి. పునరుజ్జీవాన్ని అడ్డుకోవడం మాత్రం దేశద్రోహం. మంచి ప్రాజెక్టుగా భావిస్తే ప్రజలను తరలించడానికి ఏం చేయాలో సూచనలు చేయండి. దీనిపై అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధం. ఇళ్లు, ఉద్యోగం, ఉపాధి, ప్లాట్, నష్టపరిహారం ఇద్దామా? చెప్పండి. అనుమానాలుంటే నివృత్తి చేస్తాం ప్రత్యేక కేసుగా ఎంపీలను ఎంక్లోజర్లో పెట్టి శాసనసభలో మాట్లాడించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అసద్, కిషన్, కేసీఆర్ తమ అనుమానాలను శనివారంలోగా ప్రశ్నల రూపంలో తెలియజేస్తే రాతపూర్వకంగా సమాధానమిస్తాం. రాజకీయ సమ్మతి కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం..’ అని సీఎం తెలిపారు. దామగుండాన్ని వ్యతిరేకించేవాళ్లు కసబ్ లాంటోళ్లు ‘దేశ భద్రత కోసం ఏర్పాటు చేసే దామగుండం నేవీ రాడార్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేవాళ్లు కసబ్‌లాంటి వాళ్లు. కేటీఆర్ కసబ్‌లాగా మాట్లాడితే ఎవడో వచ్చి ఇవ్వాల్సిన సమాధానం ఇస్తాడు. ఏటా రూ.500 కోట్ల లంచం వచ్చే బతుకమ్మ చీరలను నిలుపుదల చేస్తే కడుపు మండి ఆరోపణలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో వరద బాధితులకు రూ.10 వేలు చొప్పున గత ప్రభుత్వం చేసిన రూ.600 కోట్ల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించాలా?..’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడటానికి ముందు.. ప్రస్తుతం మూసీ నది ఎలా ఉంది? పునరుజ్జీవం తర్వాత ఎలా ఉండబోతోంది తెలియజేస్తూ సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. -
హైడ్రా బాధితులతో బీఆర్ఎస్ బృందం ముఖాముఖి
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కూల్చివేతల ప్రాంతాల్లో బీఆర్ఎస్ బృందం ఆదివారం పర్యటించింది. బండ్లగూడ జాగీర్, హైదర్షాకోట్, గంధంగూడలో పర్యటించిన బీఆర్ఎస్ నేతలు.. మూసీ ప్రాంత వాసుల ధర్నాలో పాల్గొన్నారు. హడ్రా బాధితులతో మాజీ మంత్రులు హరీష్‌రావు, సబిత, తలసాని ముఖాముఖిగా మాట్లాడారు.తెలంగాణ భవన్ నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు బీఆర్ఎస్ బృందం బయలు దేరింది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మహమ్మద్ హాలీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందంలో ఎమ్మెల్యేలు, రాజశేఖర్ రెడ్డి, వివేక్ గౌడ్, కాలేరు వెంకటేష్ , మాధవరం కృష్ణారావు, సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు.ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు. తెలంగాణలో తుగ్లక్ పాలన సాగుతోందన్నారు. సీఎం రేవంత్ మూసీ సుందరీకరణ పేరిట రియల్ వ్యాపారం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘బలవంతంగా ఖాళీ చేయించం.. ఒప్పించి పంపిస్తాం’‘‘పేదల ఇళ్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం రక్షణ కవచంలా నిలబడతాం. పేదల ఇళ్లు కూల్చాలంటే ముందుగా మా ఎమ్మెల్యేలపై జేసీబీ, బుల్డోజర్లు వెళ్లాలి. దేశాన్ని కాపాడే సైనికులు సైతం తమ ఇంటిని కాపాడుకోలేకపోతున్నారు. కొడంగల్‌లో సర్వే నంబర్ 1138లో ముఖ్యమంత్రి ఇల్లే చెరువులో ఉంది. ముఖ్యమంత్రికి ఒక రూల్.. ఆయన సోదరుడికి ఒక రూల్.. గరీబోళ్లకు మరొక రూలా?. హైడ్రా బలిసినోళ్ల కోసమే పని చేస్తుంది. ఇందిరాగాంధీ పేదరికాన్ని పోగడతానంటే.. ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ పేదల బతుకులను కూల్చుతున్నాడు. బుల్డోజర్ రాజ్యం నడవదంటోన్న రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి’’ హరీష్‌రావు డిమాండ్ చేశారు.‘‘హస్తం గుర్తు స్థానంలో కాంగ్రెస్.. బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలి. హైడ్రా పుణ్యమాని మూడు ప్రాణాలు పోయాయి. లే అవుట్స్‌కు అప్రోవల్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో.. కాంగ్రెస్ తప్పిదాలకు పేదలు బలికావాలా ?. సీఎం రేవంత్ రెడ్డి పేదల ఉసురు పోసుకుంటున్నాడు. హామీలను అమలు చేయడానికి లేని డబ్బులు.. మూసీ సుందరీకరణకు నిధులెక్కడవి?. లక్ష కోట్లు డిపాజిట్ చేశాకనే మూసీ సుందరీకరణ చేయాలి. 1908లో మూసీకి వరదలు వస్తే.. నిజాం నవాబ్ గోడ నిర్మించాడు. ప్రభుత్వం చేసే తప్పులను అసెంబ్లీ లోపల, బయట ఎత్తిచూపుతునే ఉంటాం’’ అని హరీష్‌రావు చెప్పారు. -
Telangana: మూసీ ‘రెడ్ మార్క్’!
సాక్షి, హైదరాబాద్: మూసీ కట్టడాలపై రెడ్ మార్క్ పడింది. పరీవాహకంలోని నివాసితుల గుండెల్లో ఆవేదన రేపుతోంది. పునరావాసం కింద ఎక్కడో ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాకెందుకంటూ చాలా మంది గోడు వెళ్లబోసుకుంటున్నారు. కడుపుకట్టుకుని సొమ్ముదాచుకుని ఇళ్లు కట్టుకున్నామని, ఏళ్లకేళ్లుగా అక్కడే బతుకుతున్న తమను వెళ్లిపొమ్మంటే ఎలాగని ఆందోళన చెందుతున్నారు. పరీవాహకం వెంట సర్వే చేసి, ఇళ్లకు మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారుల బృందాలపై విరుచుకుపడుతున్నారు. దీంతో అధికారులు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి సర్వే చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా.. మొదటి విడతగా నదీ గర్భంలో ఉన్న కట్టడాల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. సుమారు 25 ప్రత్యేక బృందాలు గత నివేదికల ఆధారంగా ఇళ్లను గుర్తించి ‘ఆర్బీ–ఎక్స్’ పేరుతో ఎరుపు రంగులో మార్కింగ్ చేస్తున్నాయి. ఆయా ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాల సమగ్ర వివరాలను సేకరించి అక్కడికక్కడే ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నాయి. 12 వేల కట్టడాల గుర్తింపు హైదరాబాద్ నగరంలో సుమారు 55 కిలోమీటర్ల పొడవునా మూసీ పరీవాహక ప్రాంతంలో 12వేలకుపైగా కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల రెవెన్యూ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, పోలీసు, ఎన్ఫోర్స్మెంట్ విభాగం సంయుక్తంగా సర్వే నిర్వహించి.. నదీ గర్భంలో ఉన్న, బఫర్‌జోన్‌లో ఉన్న ఇళ్లు, నిర్మాణాలుగా వర్గీకరించారు. నది గర్భంలో 2,166 కట్టడాలు ఉండగా.. అందులో 288 భారీ నిర్మాణాలు ఉన్నాయి. నది సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్ల వరకు ఉన్న బఫర్‌జోన్ పరిధిలో 7,851 కట్టడాలు ఉండగా.. అందులో 1,032 భారీ నిర్మాణాలు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవానికి మొత్తంగా 30వేలకు పైగానే నివాసాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. చావనైనా చస్తాం.. కూల్చనివ్వం ‘‘ఎన్నో ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్నాం. కరెంటు, నీటి బిల్లులు కడుతున్నాం. ఇప్పుడు కూల్చుతామంటే ఎలా? చావనైనా చస్తాం కానీ ఇళ్లను కూల్చనివ్వం.. ఇంత విషం ఇచ్చి ఆ పుణ్యంకూడా మీరే కట్టుకోండి..’’ అంటూ మూసీ పరీవాహకం పరిధిలోని చైతన్యపురి వినాయకనగర్ కాలనీ నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ రివర్బెడ్, బఫర్జోన్లలోని ఇళ్లను మార్కింగ్ చేయడానికి వచ్చిన సర్వే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నుంచి రంగు డబ్బాలను లాక్కుని పారబోశారు. వేసిన మార్కింగ్స్‌ను తుడిపేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటూ మాయమాటలు చెప్తున్నారంటూ అధికారులు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సర్వే బృందాలు వెనక్కి తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ అధికారులకు ఇదే తరహా నిరసన ఎదురైంది.కడుపు కట్టుకుని కొనుక్కున్నాం.. ఇక్కడే సమాధి అవుతాం ‘‘మావి కబ్జా చేసుకుని కట్టుకున్న ఇళ్లు కావు.. కడుపు కాల్చుకుని దాచుకున్న డబ్బులతో కట్టుకున్న ఇళ్లు మావి. కరెంట్, నీటి, ఇంటి పన్నులు చెల్లిస్తున్నాం. స్థలాలు రిజిస్ట్రేషన్లు చేసుకుని ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నాం. వీటిని వదిలి వసతులేవీ లేనిచోట ఎక్కడో అడవులలో కట్టిన డబుల్ బెడ్రూమ్లను ఇస్తామంటే వెళ్లే ప్రసక్తే లేదు. ఇక్కడే ఉంటాం. ఇంట్లోనే సమాధి అవుతాం..’’ అంటూ అత్తాపూర్ డివిజన్ భరత్‌నగర్ వాసులు అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలు ఆక్రమించి విల్లాలు నిర్మించుకున్న బడాబాబుల ఫాంహౌస్‌లు కూల్చివేయకుండా సామాన్యులు, పేద, మధ్య తరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం ఏమిటంటూ మండిపడ్డారు.తొలివిడతగా నది గర్భంలో.. మూసీ ప్రాజెక్టులో భాగంగా తొలి విడతలో నది గర్భంలో ఉన్న నివాసాల తొలగింపుపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. అందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 1,595, మేడ్చల్–మల్కాజిగిరి పరిధిలో 239, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 కట్టడాలను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మూసీ పరీవాహకంలో ఇళ్లు తొలగిస్తున్న నేపథ్యంలో.. బాధితులకు పునరావాసం కోసం 15వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నది గర్భం, బఫర్ జోన్లలో నివాసం ఏర్పాటు చేసుకున్న అర్హులైన పేద కుటుంబాలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనున్నారు. బఫర్ జోన్లో తొలగించే ఇళ్లు, నిర్మాణాలకు సంబంధించి.. పునరావాస చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని, దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నష్టపరిహారం చెల్లించి, భూసేకరణ చేపడతామని వివరిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లోనే నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలు కూడా అందజేస్తామని అంటున్నారు.ఎక్కడో దూరంగా ఇళ్లు ఇస్తుండటంపై.. మూసీ పరీవాహకంలో తొలి విడతగా ఇళ్ల తొలగింపుతో రెండు వేలకుపైగా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్, మున్సిపల్, రెవెన్యూ ఉన్నతాధికారులు సైదాబాద్, వనస్థలిపురం ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాలను పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాల్లో గతంలో కొందరు మూసీ నిర్వాసితులకు ఇళ్లు కేటాయించినా.. తిరిగి వెనక్కి వచ్చినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. దూర ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని అంటున్నాయి. నదీ గర్భం నుంచి తరలింపు ప్రారంభం మూసీ పరీవాహకంలోని కొత్తపేట భవానీనగర్ రోడ్డు నంబర్ 10లో నివాసం ఉంటున్న పదకొండు కుటుంబాలను అధికారులను తరలించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి వారితో ఆ కుటుంబాలతో మాట్లాడారు. వారి సమ్మతితోనే వనస్థలిపురం, ప్రతాపసింగారం, తిమ్మాయి గూడలలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వ ఖర్చులతో డీసీఎంలలో సామగ్రిని తరలించారు. -
కళ్లు ‘మూసీ’కి పోయాయి
సమస్యలపై అధికారులు, పాలకుల సాక్షి టీవీ జనపథంలో వినాయక్‌నగర్ మూసీకాలనీవాసుల స్పందన తమ గోడు వినే దిక్కులేదని ఆవేదన నల్లాలో వచ్చే కలుషిత నీరు తాగలేక.. డబ్బులు పెట్టి మంచినీరు కొనుక్కోలేక అల్లాడిపోతున్నాం. కలుషిత నీరు తాగి రోగాలొస్తే దవాఖానాల చుట్టూ తిరిగి కూలి చేసుకోగా వచ్చిన కాసిన డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నాం... హైటెన్షన్ వైర్లతో కాలనీలో కరెంటు ఎప్పుడు ఉంటదో.. ఎప్పుడు ఉండదో అర్థంకాక సతమవుతున్నాం... నల్లా కనెక్షన్ కోసం అధికారులు రూ. 10 వేలు అడుగుతున్నారు... మా సమస్యలను అధికారులకు చెప్పుకుందామంటే మా ఫోన్లు వాళ్లు ఎత్తడం లేదు... ఇదీ భాగ్యనగరం నడిబొడ్డున... మూసీ నది ఒడ్డున జీవనపోరాటం చేస్తున్న ఓ కాలనీ కన్నీటి క(వ్య)థ. ఇవన్నీ మలక్‌పేట నియోజకవర్గంలోని వినాయక్‌నగర్ మూసీకాలనీవాసుల వేదన. ఈ కాలనీలో సుమారు 500 ఇళ్లున్నాయి. సుమారు రెండు వేల మంది నివసిస్తున్నారు. పేరుకి నగరం నడిబొడ్డునే ఉన్నా కనీస మౌలిక వసతులకు కూడా నోచుకోలేక... తమ బాధలు చెప్పుకుందామంటే ఆలకించి పరిష్కరించేవారు లేక అల్లాడిపోతున్నారు. ఈ కాలనీవాసుల సమస్యలను గుర్తించిన ‘సాక్షి టీవీ’ జనపథంలో భాగంగా మూసీకాలనీలో పర్యటించి వారి కష్టాలను తెలుసుకుని ప్రజా ప్రతినిధుల దృష్టికి తెచ్చింది. సాక్షి ప్రతినిధులు అధికారులకే ఫోన్ చేసి స్థానిక సమస్యలపై ఫిర్యాదు చేసి పరిష్కారానికి కృషి చేశారు. సాక్షి టీవీ: కాలనీలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? కాలనీకి మంచినీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నాం. మంచినీటి నల్లాల్లో కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయి. ఈ నీళ్లు తాగి రోగాల బారిన పడి దవాఖానాల చుట్టూగ తిరగాల్సి వస్తుంది. మా సమస్యలను చెప్పుకుందామంటే అధికారులు మా ఫోన్లు వాళ్లు ఎత్తడం లేదు. - మజీద్ వెంటనే స్పందించిన సాక్షి టీవీ ప్రతినిధి అధికారికి ఫోన్ చేయగా... మహేశ్ (వాటర్ వర్క్స్ అధికారి): మాకు ఫిర్యాదు అందలేదు. ఇకపై కలుషిత జలాలు సరఫరా కాకుండా చూస్తాం. నల్లా నీళ్లతో దుర్వాసన... సాక్షి టీవీ: రోజూ నీళ్లు వస్తున్నాయా? రెండు రోజులకోసారి వస్తాయి. నల్లా నీళ్లు నల్లగా ఉంటున్నాయి. దుర్వాసన కూడా వస్తున్నాయి. ట్యాంకర్ నీళ్లలో పురుగులుంటున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నీళ్లనే తాగాల్సి వస్తుంది. దీంతో కొన్ని రోజులుగా తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్నాం. మా సమస్యలను పట్టించుకునేవారే లేకుండా పోయారు. - స్వప్నబాయి, మూసీకాలనీ చెత్తను ఇక్కడే పడేస్తున్నారు... మూసీ పక్కనే ఉండటంతో దోమల బెడద తీవ్రంగా ఉంది. నగరంలో సేకరించిన చెత్తచెదారం తీసుకోచ్చి ఇక్కడే పడేస్తున్నారు. కూలి డబ్బులన్నీ దవాఖానాలకే పెట్టాల్సి వస్తోంది. -రాజమ్మ హైటెన్షన్ వైర్లను వెంటనే తొలగించాలి... సాక్షి టీవీ: కాలనీలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? హైటెన్షన్ వైర్లతో నిత్యం టెన్షన్‌గా గడపాల్సిన పరిస్థితి. హైటెన్షన్ వైర్లు ఉన్నాయని కరెంటు ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తున్నారు. కరెంటు ఎప్పుడు ఉంటదో ఎప్పుడు పోతదో ఎవరికీ తెలియదు. హైటెన్షన్ వైర్లను వెంటనే తొలగించాలి. - మహ్మద్ బేగ్ నల్లా కనెక్షన్ కోసం రూ. 10 వేలు అడుగుతున్నారు... కాలనీలో నల్లా కనెక్షన్ల కోసం అధికారులు తిప్పలు పెడుతున్నారు. ఒక్కో నల్లా కనెక్షన్ కోసం రూ. 10 వేలు అడుగుతున్నారు. డబ్బులు ఎక్కువగా ఇచ్చిన వారికి రెండు మూడు కనెక్షన్లు కూడా ఇస్తున్నారు. సామాన్యుడికి ఒక కనెక్షన్ అందడం కూడా గగనమైంది. -మహ్మద్ సర్వర్