సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం!: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy fires On BRS and BJP Leaders in media meeting | Sakshi
Sakshi News home page

సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం!: సీఎం రేవంత్‌

Published Fri, Oct 18 2024 12:40 AM | Last Updated on Fri, Oct 18 2024 7:15 AM

CM Revanth Reddy fires On BRS and BJP Leaders in media meeting

కొందరు మూసీ సుందరీకరణ అనే డైలాగ్‌ను ప్రచారంలోకి తెచ్చారు

అధికారం కోల్పోయి నిస్పృహతో నది పునరుజ్జీవానికి అడ్డుపడుతున్నారు

మీడియా భేటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫైర్‌

మేం అందాల కోసం పనిచేయడం లేదు..అందాల భామలతో కలిసి పనిచేయడం లేదు 

మంత్రులు, ప్రజా ప్రతినిధుల ముసుగులో కొందరు రాష్ట్రాన్ని పట్టి పీడించారు 

బందిపోటు దొంగల్లా పట్టపగలు దోపిడీ చేసి స్వేచ్ఛగా తిరుగుతున్నారు 

కేటీఆర్, హరీశ్, ఈటల మూసీ తీరంలో మూడు నెలలుంటే ప్రాజెక్టును ఆపేస్తానన్న సీఎం 

రూ.141 కోట్లతో కన్సార్టియంకు ప్రాజెక్టు డీపీఆర్‌ తయారీ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడి

సాక్షి,హైదరాబాద్‌:‘అధికారం కోల్పోయి నిస్పృహ, అసహనంతో మూసీ నది పునరుజ్జీవానికి కొంతమంది అడ్డుపడుతున్నారు. మూసీ సుందరీకరణ అనే డైలాగ్‌ను ప్రచారంలోకి తెచ్చారు. మేము అందాల కోసం పని చేయడం లేదు. అందాల భామలతో కలిసి పనిచేయడం లేదు. అలాంటి కొంతమంది.. మంత్రులు, ప్రజాప్రతినిధుల ముసుగులో పదేళ్లు రాష్ట్రాన్ని పట్టిపీడించి బందిపోటు దొంగలకంటే దుర్మార్గంగా పట్టపగలు దోపిడీ చేసి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. 

మూసీ పునరుజ్జీవన ప్రయత్నాలపై విష ప్రచారంతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. మూసీ మురికిని మించి మెదడులో విషం నింపుకుని తెలంగాణ సమాజంపై దాడి చేస్తున్నారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం సచివాలయంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  

ఒక్కొక్కరిని ఒప్పించి తరలిస్తాం 
‘ఇది సుందరీకరణ కాదు.. దుబాయ్‌కి వెళ్లి నెత్తిమీద జుట్టును నాటు వేయించుకున్న విధానం కాదు. పునరుజ్జీవంతో మూసీని, మురికిలో కాలం వెళ్లదీస్తున్న ప్రజలను కాపాడి మంచి జీవనాన్ని ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, ప్రత్యామ్నాయ ఇళ్లను ఇవ్వాలనే ఆలోచన మాకు ఉంది. కానీ పేదరికం, కట్టుబానిసలు ఉండాలనే దొరలు, భూస్వాములు, జమీందారుల భావజాలం ఉన్నవారు దీనికి అడ్డుపడుతున్నారు. అక్కడి ప్రజల భవిష్యత్తుపై అపోహలు సృష్టిస్తున్నారు. 

నిజానికి 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించగల కార్యాచరణ ఇది. గత 10 నెలల పాటు అధికారులు 33 బృందాలుగా ఏర్పడి మూసీ దుర్గంధంలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతి ఇంటికీ వెళ్లి వారి కష్టాలు, వివరాలను తెలుసుకున్నారు. వారిని ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై మేం ఆలోచన చేస్తున్నాం. అక్కడి సమస్యలు పరిష్కరించి ఒక్కొక్కరిని ఒప్పించి తరలిస్తాం..’ అని సీఎం స్పష్టం చేశారు.  

సెక్యూరిటీ లేకుండా వస్తా..మీరూ రండి 
‘గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మల్లన్నసాగర్‌ భూసేకరణ కోసం వేములఘాట్‌ ప్రజలపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించి గుర్రాలతో తొక్కించినట్టుగా మేం చేయం. ఇక్కడికి వస్తావా? అక్కడికి వస్తావా? అని నన్ను అడుగుతున్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, గజ్వేల్‌లోని ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మకు నేను సెక్యూరిటీ లేకుండా వస్తా. బీఆర్‌ఎస్‌ నేతలూ రావాలి. రచ్చబండ నిర్వహించి పదేళ్లలో ఎన్ని దుర్మార్గాలు చేశారో ప్రజలను అడుగుదాం..’ అని రేవంత్‌ సవాల్‌ చేశారు.  

బఫర్‌ జోన్‌లో మరో 10 వేల గృహాలు 
‘మూసీ గర్భంలో 1,690 ఇళ్లు ఉండగా వారికి దసరా పండుగ వేళ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లతో పాటు రూ.25 వేలు చొప్పున తోవ ఖర్చులకు ఇచ్చాం. అయితే హైడ్రా వస్తుంది..బుల్డోజర్లు పెడ్తున్నరు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీలో ప్రభుత్వం ఒక్క ఇల్లు కూలగొట్టలేదు. ఖాళీ చేసిన లబ్ధిదారులే తమ ఇళ్ల తలుపులు, కిటికీల కోసం కూలగొట్టుకున్నారు. 

అడ్డగోలుగా కట్టిన 10, 20 అంతస్తుల ఆకాశహర్మ్యాలను కూల్చడానికే బుల్డోజర్లు, హైడ్రా అవసరం. అయినా హైడ్రా ఏమైనా ఫామ్‌హౌస్‌లో నిద్రపోయే భూత­మా? మీద పడడానికి? మరో 10 వేల ఇళ్లు బఫర్‌జోన్‌లో ఉన్నాయి వారికి ప్రత్యామ్నాయం కల్పించి, మంచి జీవితాలు ఇచ్చి మనస్సు గెలవాలని భావిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.  

అద్భుతాలు సృష్టించిన కంపెనీలతో కన్సార్టియం 
‘ప్రపంచంలో అద్భుతాలను సృష్టించిన ఐదు కంపెనీలతో ఒక కన్సార్టియం ఏర్పాటు చేయించి రూ.141 కోట్లతో మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు డీపీఆర్‌ తయారీ బాధ్యతలను టెండర్ల ద్వారా అప్పగించాం. డీపీఆర్‌ తయారీతో పాటు అంచనా వ్యయం, నిధులు, పెట్టుబడులు, రుణాల సమీకరణకు సంబంధించి కన్సార్టియం సహకారం అందిస్తుంది. 18 నెలల్లో డీపీఆర్‌ తయారు చేస్తారు. ఆ తర్వాత నాలుగైదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తాం. 

ఆరున్నరేళ్ల పాటు కన్సార్టియం సేవలందిస్తుంది. ఈ కన్సార్టియంలో భాగమైన ‘మీన్‌హార్ట్‌’ కంపెనీకే ప్రధాని మోదీ గుజరాత్‌లో సర్దార్‌ పటేల్‌ విగ్రహం కట్టే బాధ్యత అప్పగించారు. అలాగే రాష్ట్రంలో కేసీఆర్, రామేశ్వర్‌రావు తమ కులగురువు చినజీయర్‌స్వామితో కలిసి సమతామూర్తి విగ్రహాన్ని కట్టే బాధ్యత అప్పగించారు. 

గత ప్రభుత్వం ఉప్పల్‌లో మూసీపై రూ.30 కోట్లతో పనులు ప్రారంభించి రూ.6 కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో ఉంది. కానీ వర్షం వచ్చి చేసిన పనికొట్టుకుపోయిందని అంటున్నారు. ఈ వ్యవహారంలో లోపల వేయవచ్చు. చర్లపల్లి జైల్లో వేస్తే తిండిదండగ అని మేం చూసీచూడనట్టుగా ఉంటే వారికి అలుసుగా ఉంది..’ అని రేవంత్‌ అన్నారు. 
 


‘మూసీ’పై అసెంబ్లీలో చర్చకు సిద్ధం 
‘మూసీ ఒడ్డున ఖాళీ చేసిన ఇళ్లల్లో హరీశ్, కేటీఆర్, ఈటల రాజేందర్‌ మూడు నెలలు ఉంటే ఈ ప్రాజెక్టును ఆపేస్తానంటూ ఓపెన్‌ ఆఫర్‌ ఇస్తున్నా. ప్రజలు అక్కడ ఉండడం అద్భుతం అనుకుంటే మీరూ ఉండండి. పునరుజ్జీవాన్ని అడ్డుకోవడం మాత్రం దేశద్రోహం. మంచి ప్రాజెక్టుగా భావిస్తే ప్రజలను తరలించడానికి ఏం చేయాలో సూచనలు చేయండి. దీనిపై అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధం. ఇళ్లు, ఉద్యోగం, ఉపాధి, ప్లాట్, నష్టపరిహారం ఇద్దామా? చెప్పండి. 

అనుమానాలుంటే నివృత్తి చేస్తాం 
ప్రత్యేక కేసుగా ఎంపీలను ఎంక్లోజర్‌లో పెట్టి శాసనసభలో మాట్లాడించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. ఎంఐఎం, బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు అసద్, కిషన్, కేసీఆర్‌ తమ అనుమానాలను శనివారంలోగా ప్రశ్నల రూపంలో తెలియజేస్తే రాతపూర్వకంగా సమాధానమిస్తాం. రాజకీయ సమ్మతి కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేస్తాం..’ అని సీఎం తెలిపారు.  

దామగుండాన్ని వ్యతిరేకించేవాళ్లు కసబ్‌ లాంటోళ్లు 
‘దేశ భద్రత కోసం ఏర్పాటు చేసే దామగుండం నేవీ రాడార్‌ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేవాళ్లు కసబ్‌లాంటి వాళ్లు. కేటీఆర్‌ కసబ్‌లాగా మాట్లాడితే ఎవడో వచ్చి ఇవ్వాల్సిన సమాధానం ఇస్తాడు. ఏటా రూ.500 కోట్ల లంచం వచ్చే బతుకమ్మ చీరలను నిలుపుదల చేస్తే కడుపు మండి ఆరోపణలు చేస్తున్నారు. 

జీహెచ్‌ఎంసీలో వరద బాధితులకు రూ.10 వేలు చొప్పున గత ప్రభుత్వం చేసిన రూ.600 కోట్ల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించాలా?..’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌ ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడటానికి ముందు.. ప్రస్తుతం మూసీ నది ఎలా ఉంది? పునరుజ్జీవం తర్వాత ఎలా ఉండబోతోంది తెలియజేస్తూ సీఎం ప్రెజెంటేషన్‌ ఇచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement