కళ్లు ‘మూసీ’కి పోయాయి
సమస్యలపై అధికారులు, పాలకుల
సాక్షి టీవీ జనపథంలో వినాయక్‌నగర్ మూసీకాలనీవాసుల స్పందన
తమ గోడు వినే దిక్కులేదని ఆవేదన
నల్లాలో వచ్చే కలుషిత నీరు తాగలేక.. డబ్బులు పెట్టి మంచినీరు కొనుక్కోలేక అల్లాడిపోతున్నాం. కలుషిత నీరు తాగి రోగాలొస్తే దవాఖానాల చుట్టూ తిరిగి కూలి చేసుకోగా వచ్చిన కాసిన డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నాం... హైటెన్షన్ వైర్లతో కాలనీలో కరెంటు ఎప్పుడు ఉంటదో.. ఎప్పుడు ఉండదో అర్థంకాక సతమవుతున్నాం... నల్లా కనెక్షన్ కోసం అధికారులు రూ. 10 వేలు అడుగుతున్నారు... మా సమస్యలను అధికారులకు చెప్పుకుందామంటే మా ఫోన్లు వాళ్లు ఎత్తడం లేదు...
ఇదీ భాగ్యనగరం నడిబొడ్డున... మూసీ నది ఒడ్డున జీవనపోరాటం చేస్తున్న ఓ కాలనీ కన్నీటి క(వ్య)థ. ఇవన్నీ మలక్‌పేట నియోజకవర్గంలోని వినాయక్‌నగర్ మూసీకాలనీవాసుల వేదన. ఈ కాలనీలో సుమారు 500 ఇళ్లున్నాయి. సుమారు రెండు వేల మంది నివసిస్తున్నారు. పేరుకి నగరం నడిబొడ్డునే ఉన్నా కనీస మౌలిక వసతులకు కూడా నోచుకోలేక... తమ బాధలు చెప్పుకుందామంటే ఆలకించి పరిష్కరించేవారు లేక అల్లాడిపోతున్నారు.
ఈ కాలనీవాసుల సమస్యలను గుర్తించిన ‘సాక్షి టీవీ’ జనపథంలో భాగంగా మూసీకాలనీలో పర్యటించి వారి కష్టాలను తెలుసుకుని ప్రజా ప్రతినిధుల దృష్టికి తెచ్చింది. సాక్షి ప్రతినిధులు అధికారులకే ఫోన్ చేసి స్థానిక సమస్యలపై ఫిర్యాదు చేసి పరిష్కారానికి కృషి చేశారు.
సాక్షి టీవీ: కాలనీలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు?
కాలనీకి మంచినీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నాం. మంచినీటి నల్లాల్లో కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయి. ఈ నీళ్లు తాగి రోగాల బారిన పడి దవాఖానాల చుట్టూగ తిరగాల్సి వస్తుంది. మా సమస్యలను చెప్పుకుందామంటే అధికారులు మా ఫోన్లు వాళ్లు ఎత్తడం లేదు. - మజీద్
వెంటనే స్పందించిన సాక్షి టీవీ ప్రతినిధి అధికారికి ఫోన్ చేయగా...
మహేశ్ (వాటర్ వర్క్స్ అధికారి): మాకు ఫిర్యాదు అందలేదు. ఇకపై కలుషిత జలాలు సరఫరా కాకుండా చూస్తాం.
నల్లా నీళ్లతో దుర్వాసన...
సాక్షి టీవీ: రోజూ నీళ్లు వస్తున్నాయా?
రెండు రోజులకోసారి వస్తాయి. నల్లా నీళ్లు నల్లగా ఉంటున్నాయి. దుర్వాసన కూడా వస్తున్నాయి. ట్యాంకర్ నీళ్లలో పురుగులుంటున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నీళ్లనే తాగాల్సి వస్తుంది. దీంతో కొన్ని రోజులుగా తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్నాం. మా సమస్యలను పట్టించుకునేవారే లేకుండా పోయారు. - స్వప్నబాయి, మూసీకాలనీ
చెత్తను ఇక్కడే పడేస్తున్నారు...
మూసీ పక్కనే ఉండటంతో దోమల బెడద తీవ్రంగా ఉంది. నగరంలో సేకరించిన చెత్తచెదారం తీసుకోచ్చి ఇక్కడే పడేస్తున్నారు. కూలి డబ్బులన్నీ దవాఖానాలకే పెట్టాల్సి వస్తోంది. -రాజమ్మ
హైటెన్షన్ వైర్లను వెంటనే తొలగించాలి...
సాక్షి టీవీ: కాలనీలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి?
హైటెన్షన్ వైర్లతో నిత్యం టెన్షన్‌గా గడపాల్సిన పరిస్థితి. హైటెన్షన్ వైర్లు ఉన్నాయని కరెంటు ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తున్నారు. కరెంటు ఎప్పుడు ఉంటదో ఎప్పుడు పోతదో ఎవరికీ తెలియదు. హైటెన్షన్ వైర్లను వెంటనే తొలగించాలి. - మహ్మద్ బేగ్
నల్లా కనెక్షన్ కోసం రూ. 10 వేలు అడుగుతున్నారు...
కాలనీలో నల్లా కనెక్షన్ల కోసం అధికారులు తిప్పలు పెడుతున్నారు. ఒక్కో నల్లా కనెక్షన్ కోసం రూ. 10 వేలు అడుగుతున్నారు. డబ్బులు ఎక్కువగా ఇచ్చిన వారికి రెండు మూడు కనెక్షన్లు కూడా ఇస్తున్నారు. సామాన్యుడికి ఒక కనెక్షన్ అందడం కూడా గగనమైంది. -మహ్మద్ సర్వర్