కేసీఆర్ నిర్మించిన ఇళ్లలోకి పంపి.. రేవంత్ గొప్పలు చెప్పుకుంటారా?: హరీశ్‌రావు
మల్లన్నసాగర్ నిర్వాసితులకు విశాలమైన ఇళ్లు నిర్మించి ఇచ్చాం..
పునరావాస కాలనీల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాం
మేం చేసిన తరహాలో ‘మూసీ’ నిర్వాసితులకు సాయం చేయగలరా? అని ప్రశ్న
గజ్వేల్: ‘‘మల్లన్నసాగర్ నిర్వాసితులకు కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేనట్టుగా సకల సౌకర్యాలతో ఆర్‌అండ్ కాలనీ నిర్మించి ఇచ్చారు. మేం చేసిన దాంట్లో పదో వంతైనా మూసీ నిర్వాసితులకు న్యాయం చేయగలరా? బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలోకి నిర్వాసితులను పంపి, ఖర్చులకు రూ.25 వేలు ఇచ్చి తానేదో గొప్ప పనిచేసినట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించుకోవడం సిగ్గుచేటు’’అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
ఆదివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు పాత ఇళ్లు కోల్పోయినందుకు పరిహారం కింద రూ.694 కోట్లు అందజేశామని హరీశ్‌రావు చెప్పారు. అదేవిధంగా ఇంటి యజమానికి రూ.7.5 లక్షలు, పెళ్లికాని యువతీయువకులకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ప్యాకేజీలు ఇచ్చామని.. ఇళ్లు కావాలన్న వారికి 250 గజాల స్థలంలో కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చామని గుర్తు చేశారు.
పునరావాస కాలనీల్లో దేశంలో ఎక్కడాలేని విధంగా విశాలమైన రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మంచినీరు, గుడి, బడి, అంగన్‌వాడీ, రేషన్‌షాపులు వంటి సౌకర్యాలను సమకూర్చామని చెప్పారు. వ్యవసాయ భూములకు కూడా పరిహారం ఇచ్చామని వివరించారు. వీటన్నింటితోపాటు ఖర్చుల కింద రూ.30 వేల నుంచి రూ.50 వేలు అందించామని వివరించారు.
రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇళ్లు కట్టివ్వాలి
మల్లన్నసాగర్ నిర్వాసితులకు 2,270, కొండపోచమ్మసాగర్‌కు సంబంధించి 1,141 ఇళ్లు నిర్మించి ఇచ్చామని హరీశ్‌రావు వివరించారు. 2013 భూసేకరణ చట్టంలో చెప్పినదానికంటే మెరుగైన సహా య, పునరావాస కార్యక్రమాలను చేపట్టామన్నారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మల్లన్నసాగర్ నిర్వాసితుల తరహాలోనే మూసీ నిర్వాసితులకు గచ్చిబౌలిలోని 500 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇళ్లు ని ర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పలు సాంకేతిక కారణాలతో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిర్వాసితులకు పది శాతం ప్యాకేజీలు, పరిహారాలు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటికి వెంటనే నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాయం పెంచి ఇస్తే తానే స్వయంగా వచ్చి సీఎం రేవంత్‌కు పూలదండ వేసి సన్మానం చేస్తానని హరీశ్‌రావు చెప్పారు. నిర్వాసితులపై కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం ప్రేమ లేదని హరీశ్‌రావు మండిపడ్డారు.
చీఫ్ మినిస్టర్ కాదు.. చీటింగ్ మ్యాన్
తిమ్మాపూర్: కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు ఏమయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘‘సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి, చీఫ్ మినిస్టర్ కాదు.. చీటింగ్ మ్యాన్’’అని విమర్శించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో ఆదివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడారు.
దేవుడి మీద ఒట్టుపెట్టి రాజకీయం చేసే నాయకుడిని తాను ఇప్పటివరకు చూడలేదని.. రేవంత్ చేసిన పాపాల నుంచి ప్రజల ను కాపాడాలంటూ తాను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళితే అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రె స్ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు మరో ఉద్యమం రావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment