vinayak nagar
-
మెరుగైన ర్యాంకు సాధ్యమేనా?
వినాయక్‌నగర్ : స్వచ్ఛసర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు గత కొన్ని నెలలుగా నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి పకడ్బందీగా చెత్త తరలించినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారింది. ఎప్పటికప్పుడు చెత్త తరలించకపోవడంతో కూడళ్లలో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో నగరానికి 178వ ర్యాంకు రాగా ఈ ఏడాది మరింత మెరుగైన ర్యాంకుకు నగర పాలకసంస్థ అధికారులు, సిబ్బంది చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. కాగా సోమవారం స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం నగరంలో పర్యటించి పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, పారిశుధ్యానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. కాగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో చెత్త పాయింట్ల వద్ద భారీ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల చెత్త వేస్తే రూ.500 జరిమానా అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన చోట చెత్త పేరుకుపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రారంభంకాని అద్దెవాహనాలు చెత్త సేకరణ కోసం కార్పొరేషన్‌కు మొత్తం 64 వాహనాలుండగా అందులో 16 వాహనాలు అద్దెప్రాతిపదికన నడుపుతున్నారు. ఇందులో 10ట్రాక్టర్లు, 6లారీలు ఉన్నాయి. అద్దె చెల్లించడం లేదని వాహనాల యజమానులు తమ వాహనాలను నిలిపివేశారు. వాహనాల అద్దె బకాయిలు మొత్తం రూ.64 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఈ విషయంలో అధికారులు చొరవ చూపలేదు. దీంతో చెత్త సేకరణ అంశం మళ్లీ మొదటికి వచ్చింది. తమ కాలనీల్లో చెత్త తొలగించడం లేదని ఆయా కాలనీల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నగర పాలక సంస్థ అధికారులు స్పందించి తమ కాలనీల్లో నుంచి ఎప్పటికప్పుడు చెత్త తరలించాలని కోరుతున్నారు. కేంద్రబృందం సభ్యుడి పర్యటన స్వచ్ఛ సర్వేక్షణ్–2018లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ బృంద సభ్యుడు జోసెఫ్ పర్యటించారు. గతంలో నగర పాలక సంస్థలో డాక్యుమెంటేషన్‌ను పరిశీలించిన ఆయన సోమవారం నగరంలో పర్యటించారు. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ తీరును, పారిశుధ్య నిర్వహణపై ఆరా తీశారు. కాగా నగరంలో పలుచోట్ల చెత్త పేరుకుపోయి ఉండటంతో మెరుగైన ర్యాంకుపై ప్రభావం పడే అవకాశం ఉంది. -
వృద్ధదంపతులపై దాడి.. బంగారం చోరీ
నల్గొండ : నల్గొండ జిల్లా ఆత్మకూరు ఎం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధ దంపతులు లోడి సోమయ్య, రాములమ్మపై దాడి చేసి... బంగారు గొలుసు తెంచుకెళ్లారు. దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా... దొంగలు ఇంట్లో ప్రవేశించి.. రాములమ్మ మెడలోని 3 తులాల బంగారు గొలుసు లాగాడు. దీంతో వారు మెల్కొని ప్రతిఘటించారు. వారిపై కత్తితో దాడి చేసిన దొంగలు గొలుసు తీసుకుని అక్కడి నుంచి పరారైయ్యారు. ఆ తర్వాత దంపతులు బిగ్గరగా అరవడంతో స్థానికులు వెంటనే స్పందించి...వారిని ఎల్బీ నగరులోని కామినేని ఆసుపత్రికి తరలించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా దంపతులను చోరీపై పలు ప్రశ్నలు అడిగారు. -
కళ్లు ‘మూసీ’కి పోయాయి
సమస్యలపై అధికారులు, పాలకుల సాక్షి టీవీ జనపథంలో వినాయక్‌నగర్ మూసీకాలనీవాసుల స్పందన తమ గోడు వినే దిక్కులేదని ఆవేదన నల్లాలో వచ్చే కలుషిత నీరు తాగలేక.. డబ్బులు పెట్టి మంచినీరు కొనుక్కోలేక అల్లాడిపోతున్నాం. కలుషిత నీరు తాగి రోగాలొస్తే దవాఖానాల చుట్టూ తిరిగి కూలి చేసుకోగా వచ్చిన కాసిన డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నాం... హైటెన్షన్ వైర్లతో కాలనీలో కరెంటు ఎప్పుడు ఉంటదో.. ఎప్పుడు ఉండదో అర్థంకాక సతమవుతున్నాం... నల్లా కనెక్షన్ కోసం అధికారులు రూ. 10 వేలు అడుగుతున్నారు... మా సమస్యలను అధికారులకు చెప్పుకుందామంటే మా ఫోన్లు వాళ్లు ఎత్తడం లేదు... ఇదీ భాగ్యనగరం నడిబొడ్డున... మూసీ నది ఒడ్డున జీవనపోరాటం చేస్తున్న ఓ కాలనీ కన్నీటి క(వ్య)థ. ఇవన్నీ మలక్‌పేట నియోజకవర్గంలోని వినాయక్‌నగర్ మూసీకాలనీవాసుల వేదన. ఈ కాలనీలో సుమారు 500 ఇళ్లున్నాయి. సుమారు రెండు వేల మంది నివసిస్తున్నారు. పేరుకి నగరం నడిబొడ్డునే ఉన్నా కనీస మౌలిక వసతులకు కూడా నోచుకోలేక... తమ బాధలు చెప్పుకుందామంటే ఆలకించి పరిష్కరించేవారు లేక అల్లాడిపోతున్నారు. ఈ కాలనీవాసుల సమస్యలను గుర్తించిన ‘సాక్షి టీవీ’ జనపథంలో భాగంగా మూసీకాలనీలో పర్యటించి వారి కష్టాలను తెలుసుకుని ప్రజా ప్రతినిధుల దృష్టికి తెచ్చింది. సాక్షి ప్రతినిధులు అధికారులకే ఫోన్ చేసి స్థానిక సమస్యలపై ఫిర్యాదు చేసి పరిష్కారానికి కృషి చేశారు. సాక్షి టీవీ: కాలనీలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? కాలనీకి మంచినీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నాం. మంచినీటి నల్లాల్లో కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయి. ఈ నీళ్లు తాగి రోగాల బారిన పడి దవాఖానాల చుట్టూగ తిరగాల్సి వస్తుంది. మా సమస్యలను చెప్పుకుందామంటే అధికారులు మా ఫోన్లు వాళ్లు ఎత్తడం లేదు. - మజీద్ వెంటనే స్పందించిన సాక్షి టీవీ ప్రతినిధి అధికారికి ఫోన్ చేయగా... మహేశ్ (వాటర్ వర్క్స్ అధికారి): మాకు ఫిర్యాదు అందలేదు. ఇకపై కలుషిత జలాలు సరఫరా కాకుండా చూస్తాం. నల్లా నీళ్లతో దుర్వాసన... సాక్షి టీవీ: రోజూ నీళ్లు వస్తున్నాయా? రెండు రోజులకోసారి వస్తాయి. నల్లా నీళ్లు నల్లగా ఉంటున్నాయి. దుర్వాసన కూడా వస్తున్నాయి. ట్యాంకర్ నీళ్లలో పురుగులుంటున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నీళ్లనే తాగాల్సి వస్తుంది. దీంతో కొన్ని రోజులుగా తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్నాం. మా సమస్యలను పట్టించుకునేవారే లేకుండా పోయారు. - స్వప్నబాయి, మూసీకాలనీ చెత్తను ఇక్కడే పడేస్తున్నారు... మూసీ పక్కనే ఉండటంతో దోమల బెడద తీవ్రంగా ఉంది. నగరంలో సేకరించిన చెత్తచెదారం తీసుకోచ్చి ఇక్కడే పడేస్తున్నారు. కూలి డబ్బులన్నీ దవాఖానాలకే పెట్టాల్సి వస్తోంది. -రాజమ్మ హైటెన్షన్ వైర్లను వెంటనే తొలగించాలి... సాక్షి టీవీ: కాలనీలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? హైటెన్షన్ వైర్లతో నిత్యం టెన్షన్‌గా గడపాల్సిన పరిస్థితి. హైటెన్షన్ వైర్లు ఉన్నాయని కరెంటు ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తున్నారు. కరెంటు ఎప్పుడు ఉంటదో ఎప్పుడు పోతదో ఎవరికీ తెలియదు. హైటెన్షన్ వైర్లను వెంటనే తొలగించాలి. - మహ్మద్ బేగ్ నల్లా కనెక్షన్ కోసం రూ. 10 వేలు అడుగుతున్నారు... కాలనీలో నల్లా కనెక్షన్ల కోసం అధికారులు తిప్పలు పెడుతున్నారు. ఒక్కో నల్లా కనెక్షన్ కోసం రూ. 10 వేలు అడుగుతున్నారు. డబ్బులు ఎక్కువగా ఇచ్చిన వారికి రెండు మూడు కనెక్షన్లు కూడా ఇస్తున్నారు. సామాన్యుడికి ఒక కనెక్షన్ అందడం కూడా గగనమైంది. -మహ్మద్ సర్వర్ -
చిక్కుముడి వీడని రాణి హత్యకేసు
* జాగ్రత్త పడిన నిందితులు * ఆధారాల కోసం పోలీసుల అన్వేషణ * ముంబయిలోని ల్యాబ్‌కు అవయవాలు నిజామాబాద్ క్రైం : గతనెల 28న జిల్లాకేంద్రంలోని శ్రీనగర్‌కాలనీ (వినాయక్‌నగర్)లో తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెందిన రాస రాణి(35) హత్యకేసు చిక్కుముడి వీడటం లేదు. హత్య జరిగి దాదాపు 20 రోజులు కావస్తోంది. అయినా నేటికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీనిని బట్టి హంతకులు రాణిని హత్య చేసేముందు ఎతంటి జాగ్రత్తలు తీసుకున్నారో అర్థమవుతుంది. రాణి హత్యకు గురైన రోజు నిందితులను పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీం బృందాన్ని రప్పించారు. కాని ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. క్లూస్‌టీం బృందం వేలిముద్రలు సేకరించారు. ఈ వేలిముద్రలు గతంలో హంతకుల వేలిముద్రలతో పోల్చి చూశారు. కాని ఫలితం లేకుండా పోయింది. గుర్తు తెలియని వ్యక్తులు రాస రాణిని పట్టపగలే తన ఇంట్లోనే హత్య చేసి వెళ ్లటం అప్పట్లో స్థానికంగా సంచలనం సృష్టించింది. రాణి శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవటంతో ఆమెను ఎలా చంపారో ప్రశ్నార్థకంగా మారింది. రాణి ఎలా చనిపోయిందో పోస్టుమార్టం నివేదికలు వచ్చాక తెలుస్తాయని అంతా భావించారు. కాని పోస్టుమార్టం నివేదికలో సైతం ఆమె ఎలా చనిపోయిందో వివరాలు తెలియరాలేదు.దీంతో పోలీసులకు హత్య కేసు సవాలుగా మారింది. రాణి వినియోగించే సెల్ఫోన్లో కాల్ డాటాతో అయినా కేసును ఛేదించే దిశగా పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాల్ డాటాలో కూడా ఎలాంటి ఆధారాలు లభించక పోవటం గమనార్హం. రాణి మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవటం, ఆమె శరీరం లోనుంచి చుక్క రక్తపు బొట్టు బయటకు రాకపోవటంతో ఊపిరి ఆడకుండా చేసి చంపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు ఈ దిశగా కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు.రాణిని ఊపిరీ ఆడకుండా చేయాలంటే అది ఒక్కరితో అయ్యే పనికాదు. కనీసం ఇద్దరు వ్యక్తులు ఈ కేసులో ప్రమేయం ఉండచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం హంతకులు ఆమెను హత్య చేస్తుంటే ఎలాంటి కేకలు వినిపించక పోవటంతో కిందనున్న వారికి అనుమానం రాలేదు. అసలు రాణి ఇంటికి ఆ రోజు ఎవరు వచ్చిందో కూడా తెలియకుండా పోయింది. నివేదికలకు మూడు నెలలు ... రాణిని హంతకులు ఏ విధంగా హతమార్చారో తెలుసుకునేందుకు పోలీసులు అన్నికోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఆమె మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించినప్పటికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు రాణి హత్యకేసును ఛేదించేందుకు ఆమె శరీర భాగాలలో కొన్నింటిని పరీక్షల నిమిత్తం ముంబ యిలోని ల్యాబ్‌కు పంపారు. అక్కడి నుంచి నివేదికలు రావాలంటే మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ముంబ యి ల్యాబ్ నుంచి నివేదికలు వస్తేగాని హత్య ఎలా జరిగిందో బయటపడే అవకాశంలేదు. ఆ నివేదికల ప్రకారం కేసు చేధించే అవకాశం ఉంటుందని పోలీస్ వర్గాలు తెలిపాయి. -
‘కార్తె’ వచ్చింది..పండుగ తెచ్చింది
నిజామాబాద్‌కల్చరల్/నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్ : మృగశిర కర్తె రాకతో వర్షాకాలం ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని ప్రజలు ‘మిరుగు’గా జరుపుకున్నారు. ఆదివారం కలిసి రావడంతో జిల్లా అంతటా పండుగ వాతావరణం నెలకొంది. మామిడిపండ్ల పానకం, పూరీలు, ఆట్లు, చేపల కర్రీలు చేసుకున్నారు. మిరుగు సందర్భంగా చేపలు తినాలన్న ఆచారం ఉండడంతో.. మార్కెట్ కళకళలాడింది. డిమాండ్ ఉండడంతో చేపల ధరలు పెరిగాయి. నగరంలోని నెహ్రూ పార్క్ చౌరస్తాలో గల హమ్దర్ద్ దవాఖానా వద్ద చేప మందు పంపిణీ చేశారు. మందు కోసం అస్తమా బాధితులు ఉదయం నుంచే బారులు తీరారు. జిల్లావాసులతోపాటు ఆదిలాబాద్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచీ ప్రజలు తరలివచ్చారు. భారీగా పెరిగిన ధర మృగశిర కార్తెను జిల్లా ప్రజలు మిరుగుగా జరుపుకుంటారు. ఈ రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రజలు భావిస్తారు. దీంతో చేపల కొనుగోలుదారులతో వీక్లీ మార్కెట్, హైమద్‌పురా మార్కెట్, కంఠేశ్వర్‌లోని ఆర్మూర్ రోడ్డు, వినాయక్‌నగర్, హమల్‌వాడి,న్యాల్కల్ రోడ్డు, వర్ని చౌరస్తా తదితర ప్రాంతాలు కళకళలాడాయి. గిరాకీని ముందే ఊహించిన వ్యాపారులు.. భారీగా చేపలను దిగుమతి చేసుకున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో సాధారణంగా కిలో రూ. 400 పలికే మొట్ట చేపలను ఆదివారం రూ. 550 వరకు విక్రయించారు. రూ. 80కి విక్రయించే రవ్వటలను రూ. 120 కి కిలో అమ్మారు. -
అటవీ సంపదను కాపాడండి
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : అటవీ ప్రాంతంలోకి భారీ వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, ఇతరులు అడవిలోకి ప్రవేశించి వంట చెరుకుకూడా తీసుకెళ్లకూడదని నిజామాబాద్ రేంజ్ అధికారి రవిమోహన్‌భట్ చెప్పారు. శుక్రవార నిజామాబాద్ రేంజ్ కార్యాలయంలో అటవీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో రవి మాట్లాడారు. అడవి సంపదను అడ్డ దారిన దోచుకునే స్మగర్లకు అడ్డుకట్ట వేసేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. సాసర్‌పిట్స్‌లో నీటిని శుభ్రంగా ఉంచాలన్నారు. వన్యప్రానులు, వేటాగాళ్లపై ప్రత్యేకదృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. వంటచెరుకును అక్రమంగాతరలిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అడవి సంపదను కాపాడటం తమ బాధ్యత అని, ఇందుకు ఉన్నతాధికారులు డీఎఫ్ఓ భీమానాయక్, సబ్ డీఎఫ్ఓ గోపాలరావు సూచనల మేరకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రవి పేర్కొన్నారు. అటవీ భూమిని అక్రమించినా, చెట్లు నరికినా అటవీ శాఖ యాక్ట్ ప్రకా రం కేసులు నమోదు చేస్తామన్నారు. వన్య ప్రాణులను వేటాడి చంపితే వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసులు చెస్తామన్నారు. అటవీ సంపద కాపాటడం మన అందరి బాధ్యత అని అన్నారు. సమావేశంలో సెక్షన్ అధికారులు వెంకట్రాం, ఫయాజ్ ఎల్‌హఖ్, బాల్‌రాజ్‌గౌడ్, బీట్ ఆఫీసర్లు సుబ్బారావు, ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు. -
అంతరిస్తున్న అటవీ సంపద
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్: కలప వ్యాపారుల స్వార్థానికి పచ్చని చెట్లు బలవుతున్నాయి. కలప స్మగ్లర్లు చెట్ల ను యథేచ్ఛగా నరికివేయడంతో రోజురోజు కూ అటవీ సంపద అంతరించి పోతోంది. పెద్ద పెద్ద వృక్షాలు సైతం కనుమరుగవుతున్నాయి. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. అయినా సంబంధిత అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరి స్తున్నారు. అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందితో చేతు లు కలిపి కలప స్మగ్లర్లు టేకు, జిట్రేగి, వేప, తుమ్మ వంటి చెట్లను విచ్చలవిడిగా నరికి ప్రతి నిత్యం నగరానికి చేరవేస్తున్నారు. ‘దొరికితే దొంగలు లేకపోతే దొరలు’ అన్నట్టుగా మారింది పరిస్థితి. అటవీ శాఖ అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి కలపను పట్టుకున్నా, స్మగ్లర్లు మాత్రం పారి పోవడం పరిపాటుగా మారింది. పలుమార్లు రిక్షాలు,సైకిళ్లు, ఆటో లు, లారీలు అక్రమ కలపతో పట్టుబడ్డాయి. విచిత్రం గా నిందితులు మాత్రం దొరకలేదు. నగరంలో చా లా చోట్ల అక్రమంగా నిలువ ఉంచిన టేకు దుంగలు, కలప సైజులు దొరికాయి. అయినా అటవీ చట్టం కిం ద నమోదైన కేసులు మాత్రం నామమాత్రమే. అటవీ సంపదను దోచుకుంటున్న స్మగ్లర్లు అక్రమంగా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలోని ముజాహిద్నగర్లో ఓపాత ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన రూ. 80 వేల విలువ చేసే 22 టేకు దుంగలను పక్కా సమాచారంతో పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటనలు చేశారు. కర్ర ఎవరిది, ఇల్లు ఎవరిదనే అంశాలను మాత్రం విస్మరించారు. గత డిసెంబరులో బోమ్మన్నాగు ప్రాంతంలో 190 అక్రమ టేకు నిల్వలను ఫ్లయింగ్స్క్వడ్ అధికారులు పట్టుకున్నారు. గోదాము ఎవరిదో తేలినా, యజమానిపై కేసు మాత్రం నమోదు చేయక పోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. సరిహద్దులోని యంచ చెక్‌పోస్టు వద్ద అక్రమంగా డీసీఎం వ్యానులో తరలిస్తున్న 5 లక్షల విలువ చేసే 90 టేకు దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. {పతి నిత్యం నగరానికి కాల్పోల్ గ్రామం వైపు నుంచి రిక్షాలలో, ఆటోలలో వస్తుంది. క్షేత్రస్థాయి సిబ్బంది అనుగ్రహం లేనిదే ఈ దందా నడవదనే ఆరోపణలు ఉన్నా యి. బడాపహాడ్, లక్ష్మాపూర్ శివారు నుంచి టేకు సైజులు నగరంలోని బబస్సాహెబ్ పహాడ్, ధర్మపురి హిల్స్, మాలపల్లి, ముజాహిద్‌నగర్‌కు వస్తున్నట్లు సమాచారం. మల్కాపుర్, మల్లారం అటవీ ప్రాంతం నుంచి కూడా అక్రమ కలప నగరానికి చేరుతుందని సమాచారం. నిఘా పటిష్టంగా ఉందని సంబంధిత శాఖ అధికారులు చె బుతున్నా, స్మగ్లర్లు మాత్రం దర్జాగా కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. మల్లారం గండి అటవీ ప్రాంతం నుంచి రోజూ తెల్లవారు జామున సైకిళ్లపై చాలా మంది వంట చెఱుకు, టేకుసైజులు తెస్తుంటారు. 2014 మార్చి ఒకటవ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ముదక్పల్లి, మల్లారం, నవీపేట సెక్షన్ మంచిప్ప ప్రాంతాలలో నాగారం, పూలాంగ్ తదితర ప్రాంతాలలో నాలుగు 4 లక్షల రూపాయల విలువ చేసే టేకు దుంగలను పట్టుకున్నారు. 13 కేసులను నమోదు చేశారు. 23 నాన్‌టేకు కేసులు నమోదు చేసి 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాపైనే అధారపడి జీవిస్తున్న కుటుంబాలు నగరంలో వందల సంఖ్యలో ఉన్నాయంటే, పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అటవీదొంగల చేతులలో అడవి క్రమంగా కనుమరుగవుతున్నా ఎవ్వరికీ పట్టడం లేదు. -
గెలిస్తే లోక్‌సభకు వెళ్లే వాడిని
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : నిజామాబాద్ ఎంపీగా గెలిచి ఉంటే పార్లమెంట్‌కు వెళ్లేవాడినని బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఓడిపోయినందున స్థానికంగా ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతానని, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజలు నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కావాలని కోరుకున్నారన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఉంటే దృఢమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండేది కాదన్నారు. ఇప్పుడు మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దృఢమైన నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత విస్పష్టమైన తీర్పు ఇచ్చిన, బీజేపీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నల్లధనాన్ని వెలికి తీయడం, అవినీతి రహిత దేశాన్ని నిర్మించడం, ఉగ్రవాదాన్ని నియంత్రించడం, సమర్థ పాలన అందించడం మోడీతోనే సాధ్యమని ప్రజలు నమ్మారని, శుక్రవారం నాటి ఫలితాలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లాలో ఆశించిన ఫలితాలు రాకపోయినా ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. పునర్నిర్మాణంలో భాగమవుతాం తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపి, బిల్లు పాసవడానికి బీజేపీ ఎంతగానో కృషి చేసిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర పునర్నిర్మాణానికీ కృషి చేస్తామన్నారు. పార్టీకి ఓటేసినవారికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో పార్టీ ఘన విజయం సాధించినందుకు మిఠాయిలు పంచా రు. సమావేశంలో పార్టీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు టక్కర్ హన్మంత్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ బాపురెడ్డి, నగర అధ్యక్షులు గజం ఎల్లప్ప, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి కల్పన గణేశ్‌కుమార్, పార్టీ నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, న్యాలం రాజు, గణేశ్, ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బడాబాబుల సంగతేమిటో
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్: పొట్టకూటి కోసం చెట్లు నరుకుతున్న వారిపై ప్రతాపం చూపుతున్న అటవీ శాఖాధికారులు కలప స్మగ్లింగ్‌తో కోట్లు గడిస్తున్నవారిపై మాత్రం కనిక రం చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బడాబాబులను వదిలేసి బడుగుజీవులకు జరిమానాలు విధించి తమ టార్గెట్లు నింపుకుంటున్నారనే వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జిల్లాలో ఉన్న కొద్దిపాటి అటవీ సంపద రోజు రోజుకూ అంతరించిపోతోంది. నిజామాబాద్ డివిజన్ పరిధిలో బాన్సువాడ, నిజామాబాద్, కమ్మర్పల్లి రేంజ్‌లున్నాయి. సుమారు 12వేల హెక్టార్ల అటవీ సంపద ఉండేది. అది రాను రాను ఐస్‌ముక్క లా కరిగిపోతోంది. పలువురు స్మగ్లర్లు కూలీల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా చెట్లను నరికిస్తున్నారు. వాటిని రాత్రి వేళల్లో వాహనాలలో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిని తరలించేందుకు ఐదుగురిని నియమించి వారికి రూ. 10 వేల వరకు ఇచ్చి టాటాసుమో, స్కార్పీయో వాహనాలలో కోరిన చోటకు పంపిస్తున్నారని సమాచారం. ప్రధానంగా బాన్సువాడ రేంజ్‌లోని బడాపహాడ్, లకా్ష్మపూర్, జలాల్పూర్, అటవీ ప్రాంతాల నుంచి విలువైన టేకు దుంగలను తరలిస్తున్నారు. వీటిని నగరంలోని రహస్య ప్రదేశాలలో నిలువ ఉంచి అవసరం ఉన్న వారికి అక్కడి నుంచి చేరవేస్తున్నట్లు తెలిసింది. నిజామాబాద్ మండలంలోని మంచిప్ప, కులాస్పూర్, బాడ్సీ, మోపాల్, మల్లారం ప్రాంతాల నుంచి కూడా ప్రతి రోజు వివిధ వాహనాలలో, సైకిళ్లపై, ఆటోల్లో వీటిని నగరానికి చేరవేస్తారు. ఇలా చేర వేసిన వాటిని వంటచెరుకుగా నగరంలోని వివిధ వారికి విక్రయిస్తారు. పట్టించుకోని అధికారులు తమ కళ్ల ఎదుటే ఉన్న అడవి సంపద తరలి పోతున్నా సంబంధిత అటవీశాఖాధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. పెట్రోలింగ్ చేసే సమయంలో వారి కంటికి కనిపించిన వారినే నామ మాత్రంగా జరిమానాలు విధుస్తున్నారు. అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించి చెట్లను నరకకుండా పర్యవేక్షించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టుకున్న కలప వివరాలు ఇలా ఉన్నాయి 2013 జనవరి నుంచి 2014 జనవరి వరకు అధికారులు పట్టుకున్న కలప విలువ సుమారు రూ. 22 లక్షలుంటుంది. ప్రతి నెల 20న నిజామాబాద్ డివిజన్ కార్యాలయంలో వీటిని వేలం వేస్తారు. ఇందులో నుంచి సుమారు రూ. 12 లక్షల విలువ చేసే కలపను విక్రయించి ప్రభుత్వ ఖజానాలో జమ చేశారు. -
దాడి చేస్తే చంపేయండి
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : ‘మీరు ధైర్యంగా ముందుకు సాగండి. అడవి దొంగలు దాడి చేస్తే చంపేయండి. నేను మీ వెనక కాదు.. ముందుంటా. అటవీ సంపద రక్షణకు కలసికట్టుగా కృషి చేద్దాం’ అని అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు బాబూరావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. భూ ఆక్రమణదారుల చేతిలో హత్యకు గురైన ఎఫ్ఆర్ఓ గంగయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగయ్యను అతికిరాతకంగా హత్య చేసిన వారిని అక్కడే చంపేయాల్సిందన్నారు. కానీ సిబ్బంది తక్కువగా ఉండడం, ఆయుధాలు లేకపోవడంతో దుండగుల ఆటలు సాగుతున్నాయన్నారు. దుండగులు గంగయ్య కంట్లో కారం చల్లి, దాడికి పాల్పడ్డారని పేర్కొన్నా రు. ఇకపై ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిం చాలని సూచించారు. సిబ్బందికి ఆయుధాలు కావాలని ఉన్నతాధికారులతో పేర్కొన్నానన్నారు. రెండు రోజుల్లో రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి ఆయుధాల విషయం చర్చిస్తానన్నారు. రేంజ్‌కు ఆరు ఆయుధాల చొప్పున తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. వీటి వినియోగంపై అటవీశాఖలోని యువ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తానని పేర్కొన్నారు. సిబ్బందిలో మనోధైర్యం నింపడానికి యత్నించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేస్తానని, 24 గంటలు సిబ్బందికి అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అవసరమైతే పోలీసు రక్షణ తీసుకోవాలని టెరిటరియల్ డీఎఫ్ఓ భీమ సూచించారు. కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ వేణుబాబు, టెరిటోరియల్ సబ్ డీఎఫ్ఓ గోపాల్‌రావు, నిజామాబాద్ రేంజ్ ఎఫ్ఆర్ఓ గంగాధర్, నిజామాబాద్ డివిజన్లోని అటవీ ఉద్యోగులు పాల్గొన్నారు.