వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : ‘మీరు ధైర్యంగా ముందుకు సాగండి. అడవి దొంగలు దాడి చేస్తే చంపేయండి. నేను మీ వెనక కాదు.. ముందుంటా. అటవీ సంపద రక్షణకు కలసికట్టుగా కృషి చేద్దాం’ అని అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు బాబూరావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. భూ ఆక్రమణదారుల చేతిలో హత్యకు గురైన ఎఫ్‌ఆర్‌ఓ గంగయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగయ్యను అతికిరాతకంగా హత్య చేసిన వారిని అక్కడే చంపేయాల్సిందన్నారు. కానీ సిబ్బంది తక్కువగా ఉండడం, ఆయుధాలు లేకపోవడంతో దుండగుల ఆటలు సాగుతున్నాయన్నారు.
దుండగులు గంగయ్య కంట్లో కారం చల్లి, దాడికి పాల్పడ్డారని పేర్కొన్నా రు. ఇకపై ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిం చాలని సూచించారు. సిబ్బందికి ఆయుధాలు కావాలని ఉన్నతాధికారులతో పేర్కొన్నానన్నారు. రెండు రోజుల్లో రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి ఆయుధాల విషయం చర్చిస్తానన్నారు. రేంజ్‌కు ఆరు ఆయుధాల చొప్పున తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. వీటి వినియోగంపై అటవీశాఖలోని యువ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తానని పేర్కొన్నారు. సిబ్బందిలో మనోధైర్యం నింపడానికి యత్నించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేస్తానని, 24 గంటలు సిబ్బందికి అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అవసరమైతే పోలీసు రక్షణ తీసుకోవాలని టెరిటరియల్ డీఎఫ్‌ఓ భీమ సూచించారు. కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఓ వేణుబాబు, టెరిటోరియల్ సబ్ డీఎఫ్‌ఓ గోపాల్‌రావు, నిజామాబాద్ రేంజ్ ఎఫ్‌ఆర్‌ఓ గంగాధర్, నిజామాబాద్ డివిజన్‌లోని అటవీ ఉద్యోగులు పాల్గొన్నారు.
దాడి చేస్తే చంపేయండి
Published Mon, Nov 11 2013 3:56 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement