వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : నిజామాబాద్ ఎంపీగా గెలిచి ఉంటే పార్లమెంట్‌కు వెళ్లేవాడినని బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఓడిపోయినందున స్థానికంగా ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతానని, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజలు నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కావాలని కోరుకున్నారన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఉంటే దృఢమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండేది కాదన్నారు.
ఇప్పుడు మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దృఢమైన నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత విస్పష్టమైన తీర్పు ఇచ్చిన, బీజేపీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నల్లధనాన్ని వెలికి తీయడం, అవినీతి రహిత దేశాన్ని నిర్మించడం, ఉగ్రవాదాన్ని నియంత్రించడం, సమర్థ పాలన అందించడం మోడీతోనే సాధ్యమని ప్రజలు నమ్మారని, శుక్రవారం నాటి ఫలితాలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లాలో ఆశించిన ఫలితాలు రాకపోయినా ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.
పునర్నిర్మాణంలో భాగమవుతాం
తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపి, బిల్లు పాసవడానికి బీజేపీ ఎంతగానో కృషి చేసిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర పునర్నిర్మాణానికీ కృషి చేస్తామన్నారు. పార్టీకి ఓటేసినవారికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో పార్టీ ఘన విజయం సాధించినందుకు మిఠాయిలు పంచా రు. సమావేశంలో పార్టీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు టక్కర్ హన్మంత్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ బాపురెడ్డి, నగర అధ్యక్షులు గజం ఎల్లప్ప, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి కల్పన గణేశ్‌కుమార్, పార్టీ నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, న్యాలం రాజు, గణేశ్, ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గెలిస్తే లోక్‌సభకు వెళ్లే వాడిని
Published Sat, May 17 2014 2:38 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement