ఆర్యసమాజ్ వద్ద పేరుకుపోయిన చెత్త
వినాయక్‌నగర్ : స్వచ్ఛసర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు గత కొన్ని నెలలుగా నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి పకడ్బందీగా చెత్త తరలించినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారింది. ఎప్పటికప్పుడు చెత్త తరలించకపోవడంతో కూడళ్లలో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో నగరానికి 178వ ర్యాంకు రాగా ఈ ఏడాది మరింత మెరుగైన ర్యాంకుకు నగర పాలకసంస్థ అధికారులు, సిబ్బంది చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. కాగా సోమవారం స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం నగరంలో పర్యటించి పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, పారిశుధ్యానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. కాగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో చెత్త పాయింట్ల వద్ద భారీ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల చెత్త వేస్తే రూ.500 జరిమానా అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన చోట చెత్త పేరుకుపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
ప్రారంభంకాని అద్దెవాహనాలు
చెత్త సేకరణ కోసం కార్పొరేషన్‌కు మొత్తం 64 వాహనాలుండగా అందులో 16 వాహనాలు అద్దెప్రాతిపదికన నడుపుతున్నారు. ఇందులో 10ట్రాక్టర్లు, 6లారీలు ఉన్నాయి. అద్దె చెల్లించడం లేదని వాహనాల యజమానులు తమ వాహనాలను నిలిపివేశారు. వాహనాల అద్దె బకాయిలు మొత్తం రూ.64 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఈ విషయంలో అధికారులు చొరవ చూపలేదు. దీంతో చెత్త సేకరణ అంశం మళ్లీ మొదటికి వచ్చింది. తమ కాలనీల్లో చెత్త తొలగించడం లేదని ఆయా కాలనీల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నగర పాలక సంస్థ అధికారులు స్పందించి తమ కాలనీల్లో నుంచి ఎప్పటికప్పుడు చెత్త తరలించాలని కోరుతున్నారు.
కేంద్రబృందం సభ్యుడి పర్యటన
స్వచ్ఛ సర్వేక్షణ్–2018లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ బృంద సభ్యుడు జోసెఫ్ పర్యటించారు. గతంలో నగర పాలక సంస్థలో డాక్యుమెంటేషన్‌ను పరిశీలించిన ఆయన సోమవారం నగరంలో పర్యటించారు. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ తీరును, పారిశుధ్య నిర్వహణపై ఆరా తీశారు. కాగా నగరంలో పలుచోట్ల చెత్త పేరుకుపోయి ఉండటంతో మెరుగైన ర్యాంకుపై ప్రభావం పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment