అధికారులకు స్పష్టం చేసిన హైకోర్టు
సుప్రీం మార్గదర్శకాల ప్రకారం ఆక్రమణదారులకు నోటీసులిచ్చి తదుపరి చర్యలు చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: మూసీ నది పరీవాహకంతోపాటు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్‌లో కబ్జాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై పూర్తి సర్వే నిర్వహించాలని సూచించింది. ఇందుకు పిటిషనర్లు, ఆక్రమణదారులు సహకరించాలని చెప్పింది. అవసరమైతే అధికారులకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. హైదరాబాద్ కొత్తపేట్‌లోని న్యూ మారుతీనగర్‌వాసులు దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ మేరకు విచారణను ముగించింది.
అధికారులు తమ ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ న్యూ మారుతీనగర్‌కు చెందిన చింతపల్లి సుబ్రమణ్యం సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీహెచ్‌ఎంసీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే లేఅవుట్ వేసి ఇళ్లు కట్టుకున్నామని.. ఆస్తిపన్ను, నల్లా పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని పిటిషనర్లు పేర్కొన్నారు. అందువల్ల తమ ఇళ్లను కూల్చకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి.. అధికారులకు, పిటిషనర్లకు పలు సూచనలు చేస్తూ తీర్పు వెలువరించారు.
హైకోర్టు సూచనలివీ...
– ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, రివర్ బెడ్ జోన్‌లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆక్రమణదారులకు చట్టప్రకారం నోటీసులు ఇచ్చి ఆక్రమించినట్లు తేలితే వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలి.
– మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన వ్యక్తులకు సమగ్ర సామాజిక–ఆర్థిక సర్వే నిర్వహించి ప్రభుత్వం నిర్దేశించిన విధానాల ప్రకారం అనువైన ప్రదేశాల్లో అధికారులు వసతి కల్పించాలి.
– పట్టణాభివృద్ధి శాఖ 2012లో జారీ చేసిన జీవో 168 ప్రకారం ఇచ్చిన బిల్డింగ్ రూల్స్‌ను కచ్చితంగా పాటించాలి.
– మూసీలోని ఎఫ్‌టీఎల్, రివర్ బెడ్ జోన్‌లోని కేసుల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలోమినా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం జారీ చేసిన మార్గదర్శకాలతోపాటు 2023 నవంబర్ 8న ఆక్రమణలపై జారీ చేసిన సర్క్యులర్‌లోని సూచనలను మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ట్రయల్ కోర్టులు పాటించాలి.
– మూసీ బఫర్ జోన్, రివర్ బెడ్ జోన్ సరిహద్దుల స్థిరీకరణ కోసం అధికారులు చేపట్టే సర్వేలను పిటిషనర్లు, ఆక్రమణదారులు అడ్డుకోవద్దు.
– సర్వే కోసం వెళ్లే నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖల అధికారులకు పోలీసులు అవసరమైన భద్రతను కల్పించాలి.
– తెలంగాణ నీటిపారుదల చట్టం–1357 ఫస్లీ, వాల్టా చట్టం 2002లోని నిబంధనల ప్రకారం నదులు, నీటివనరులు, చెరువులు, సరస్సుల విధ్వంసానికి పాల్పడిన ఆక్రమణదారులు, భూ కబ్జాదారులపై అధికారులు తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment