Vizianagaram Muncipality
-
ఎంపికైతే ఏం చేస్తారు?
సాక్షి, విజయనగరం : ఏ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వచ్చారు? ఎంపికైతే ఏమి చేస్తారు? నగరంలోని మీ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ బాగులేకుంటే ఎవరికి ఫిర్యాదు చేస్తారు?.. అంటూ వలంటీర్ల ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హజరైన అభ్యర్థులకు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ ప్రశ్నించారు. కొందరు కమిషనర్ అడిగిన ప్రశ్నలకు తడబడితే.. మరికొందరు ప్రజలకు ప్రభుత్వ సేవలందిస్తామని చెప్పారు. వార్డు వలంటీర్ల ఇంటర్వ్యూలను మంగళవారం కమిషనర్ వర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా 148 మంది అభ్యర్ధులకు రియల్ టైమ్ గవర్నింగ్ సిస్టమ్‌తో పాటు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సమాచారం అందించారు. వారిలో 75 శాతం మందిని ఇంటర్వ్యూలకు హాజరు కాగా.. 8 ప్యానల్స్లోని 24 మంది అధికారుల బృందం ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ సందర్బంగా కమిషనర్ ఎస్ఎస్ వర్మ మాట్లాడుతూ మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఎంపిక ప్రక్రియలో వారి వ్యక్తిగత సామర్థ్యానికి అనుగుణంగా మార్కులు కేటాయించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రోస్టర్ పద్ధతిలో ఎంపికైన వలంటీర్లను ఆగస్టు మొదటి వారంలో ప్రకటిస్తామని, వారికి శిక్షణ అందించిన అనంతరం అదే నెల 15 నుంచి వార్డు విధులను అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కె.కనకమహాలక్ష్మి, డీఈఈ అప్పారావు, ఎంహెచ్ డాక్టర్ ప్రణీత, మేనేజర్ ప్రసాదరావు, టీపీఓ కనకారావు తదితరులు పాల్గొన్నారు. 15 పంచాయతీల్లో.. విజయనగరం రూరల్: మండల పరిధిలోని 15 గ్రామ పంచాయతీల్లో గ్రామ వలంటీర్ల ఉద్యోగాలకు నిర్వహించిన ఇంటర్యూలకు మంగళవారం 79 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మలిచర్ల పంచాయతీ నుంచి నలుగురు, నారాయణపురం పంచాయతీ నుంచి 89 మంది, జొన్నవలస పంచాయతీ నుంచి 27 మందిని మంగళవారం ఇంటర్వ్యూలకు పిలవగా వీరిలో 42 మంది గైర్హాజరవగా 79 మంది హాజరయ్యారు. మండలశాఖ అధికారులు రెండు ప్యానల్స్‌గా ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవికుమార్, ఎంపీడీఓ కార్యాలయ సూపరిండెండెంట్ చైన్లు పాల్గొన్నారు. -
పడగొట్టినా.. కడుతున్నారేంటి !
సాక్షి, విజయనగరం : మున్సిపాలిటీ పరిధిలోని రింగ్‌రోడ్ ఐస్‌ఫ్యాక్టరీ జంక్షన్ నుంచి ధర్మపురికి వెళ్లే ప్రధాన రోడ్డులో పద్మావతినగర్ మొదటి లైన్ వద్ద సర్వే నంబర్ 109/6లోని 16 సెంట్ల స్థలంలో నాలుగేళ్లుగా జరుగుతున్న అక్రమ భవన నిర్మాణానికి మున్సిపల్ అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. 2011 సంవత్సరంలో మున్సిపాలిటీ నుంచి పొందిన అనుమతి పత్రంతో 2015 సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇచ్చే భవన నిర్మాణ అనమతులు మూడేళ్ల వరకే వర్తిస్తాయి. కానీ అప్పటికే నాలుగేళ్లు గడిచిన అనుమతి పత్రాలతో నిర్మాణ పనులు చేపట్టారు. వాస్తవ పరిస్థితి సంబంధిత అధికారులకు తెలిసినా మున్సిపల్ పాలకవర్గంలోని పెద్ద తలకాయ సదరు భవన నిర్మాణదారునికి అండగా ఉండటంతో చర్యకు వెనుకంజ వేస్తున్నారు. వాస్తవ పత్రాలను సైతం మార్చేసి ఆ స్థలాన్ని జిరాయితీ కింద మార్చేశారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇలా స్థలంతో పాటు అందులో నిర్మిస్తున్న భవనంపై వస్తున్న ఆరోపణలపై అటు రెవెన్యూ యంత్రాంగం, ఇటు మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ విభాగం జాప్యం చేయటం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. అక్రమ భవన నిర్మాణాన్ని నిలిపి వేయాలని అప్పట్లో పలువురు లోకాయుక్తను ఆశ్రయించినప్పటికీ నిర్మాణ పనులు ఆగకపోవటంతో గమనార్హం. పాలకవర్గ సభ్యుల అండదండలు పద్మావతినగర్ రోడ్డులో జరుగుతున్న అక్రమ భవన నిర్మాణం వెనుక మున్సిపల్ పాలకవర్గంలోని కీలక సభ్యులు అండదండలున్నాయన్న అనుమానాలు మొదటి నుంచి వ్యక్తమవుతున్నాయి. స్వయానా మున్సిపల్ చైర్మన్ ఇందుకు వత్తాసు పలుకుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే సరైన ధ్రువపత్రాలు లేకున్నా, ప్రభుత్వ భూమిని అక్రమించుకుని నిర్మిస్తున్నా అధికారులు ఆ వైపు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ఆ భవన నిర్మాణంపై ఫిర్యాదు చేసిన సమయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు వారి సిబ్బందితో కలిసి వెళ్లి నిర్మించిన గోడలను కూలదోసి వచ్చేస్తారు. కొద్ది రోజులు గడిచాక మళ్లీ భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఇలా నాలుగేళ్లుగా జరుగుతున్న తంతును నీతి, నిజాయితీ, నిప్పు లాంటి పాలన అంటూ గొప్పలు చెప్పుకొనే టీడీపీ పాలకవర్గ సభ్యులు ప్రోత్సహించటం విశేషం. మరికొద్ది రోజుల్లో కౌన్సిల్ పదవీ కాలం ముగియనుండటంతో ఈ లోపే భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకునేందుకు నిర్మాణదారుడు తొందర పడుతున్నట్టు సమాచారం. -
ఏసీబీ వలలో ఇద్దరు మున్సిపల్ అధికారులు
విజయనగరం: విజయనగరం మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు అధికారులు గురువారం ఏసీబీకి చిక్కారు. కొత్త ఇంటికి పన్ను విధించేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా గాజులరేగ రైల్వేగేటు సమీపంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక కేఎల్‌పురంలో కె.శ్రీనివాసరావు బంధువులు ఇల్లు నిర్మించుకున్నారు. ఆ కొత్త ఇంటికి పన్ను విధించాలని బంధువుల తరఫున శ్రీనివాసరావు జూన్ 3న దరఖాస్తు చేసుకున్నారు. రూ.10 వేలు లంచం ఇస్తే పన్ను తక్కువ విధిస్తామని మున్సిపల్ ఆర్ఐ పి.ఈశ్వరరావు, బిల్లు కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు చెప్పారు. దీంతో శ్రీనివాసరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం గాజులరేగ సమీపంలో విధినిర్వహణలో ఉన్న ఆర్ఐ ఈశ్వరరావు సూచనల మేరకు బిల్లు కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదు స్వాధీనంచేసుకుని వారిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు.