ఇంటర్వ్యూ చేస్తున్న కమిషనర్ వర్మ
సాక్షి, విజయనగరం : ఏ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వచ్చారు? ఎంపికైతే ఏమి చేస్తారు? నగరంలోని మీ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ బాగులేకుంటే ఎవరికి ఫిర్యాదు చేస్తారు?.. అంటూ వలంటీర్ల ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హజరైన అభ్యర్థులకు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్‌ఎస్ వర్మ ప్రశ్నించారు. కొందరు కమిషనర్ అడిగిన ప్రశ్నలకు తడబడితే.. మరికొందరు ప్రజలకు ప్రభుత్వ సేవలందిస్తామని చెప్పారు. వార్డు వలంటీర్ల ఇంటర్వ్యూలను మంగళవారం కమిషనర్ వర్మ నిర్వహించారు.
ఈ సందర్భంగా 148 మంది అభ్యర్ధులకు రియల్ టైమ్ గవర్నింగ్ సిస్టమ్‌తో పాటు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సమాచారం అందించారు. వారిలో 75 శాతం మందిని ఇంటర్వ్యూలకు హాజరు కాగా.. 8 ప్యానల్స్‌లోని 24 మంది అధికారుల బృందం ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ సందర్బంగా కమిషనర్ ఎస్‌ఎస్ వర్మ మాట్లాడుతూ మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఎంపిక ప్రక్రియలో వారి వ్యక్తిగత సామర్థ్యానికి అనుగుణంగా మార్కులు కేటాయించనున్నట్టు తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రోస్టర్ పద్ధతిలో ఎంపికైన వలంటీర్లను ఆగస్టు మొదటి వారంలో ప్రకటిస్తామని, వారికి శిక్షణ అందించిన అనంతరం అదే నెల 15 నుంచి వార్డు విధులను అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కె.కనకమహాలక్ష్మి, డీఈఈ అప్పారావు, ఎంహెచ్ డాక్టర్ ప్రణీత, మేనేజర్ ప్రసాదరావు, టీపీఓ కనకారావు తదితరులు పాల్గొన్నారు.
15 పంచాయతీల్లో..
విజయనగరం రూరల్: మండల పరిధిలోని 15 గ్రామ పంచాయతీల్లో గ్రామ వలంటీర్ల ఉద్యోగాలకు నిర్వహించిన ఇంటర్యూలకు మంగళవారం 79 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మలిచర్ల పంచాయతీ నుంచి నలుగురు, నారాయణపురం పంచాయతీ నుంచి 89 మంది, జొన్నవలస పంచాయతీ నుంచి 27 మందిని మంగళవారం ఇంటర్వ్యూలకు పిలవగా వీరిలో 42 మంది గైర్హాజరవగా 79 మంది హాజరయ్యారు. మండలశాఖ అధికారులు రెండు ప్యానల్స్‌గా ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవికుమార్, ఎంపీడీఓ కార్యాలయ సూపరిండెండెంట్ చైన్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment