సతివాడ మీ సేవ కేంద్రంలో వలంటీర్ల పోస్ట్‌లకు దరఖాస్తులు చేసుకుంటున్న యువత
సాక్షి, నెల్లిమర్ల (విజయనగరం): నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ సక్రమంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వలంటీర్ల పోస్ట్‌లకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నిరుద్యోగుల కోసం యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో 4లక్షల గ్రామ వలంటీర్ల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మండలం లోని 26 పంచాయతీల్లో ఈ గ్రామ వలంటీర్ల పోస్ట్‌ల కోసం దరఖాస్తులు వెల్లువులా వచ్చి పడుతున్నాయి.
ప్రతి పల్లెలోనూ 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఒక్క రోజే సమయం ఉంది. ఈ నేపథ్యంలో మండలంలో ఆయా గ్రామాల్లో నిరుద్యోగులు వలంటీర్ల పోస్ట్‌లకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం కావడంతో తహసీల్దార్ కార్యాలయానికి నిరుద్యోగులు పోటెత్తారు.
266 గ్రామ వలంటీర్ల పోస్ట్‌లు...
మండలంలో 26 పంచాయతీలకు గానూ సుమారు 266 గ్రామ వలంటీర్ల పోస్ట్‌లు ఉన్నాయి. గురువారం నాటికి 1384 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ అక్కారావు తెలిపారు. వీటిలో మొత్తం 77 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని, వచ్చిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులు ఏ రోజుకు ఆ రోజు గ్రామ స్థాయిలో పరిశీలించి దరఖాస్తుదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందు పరుస్తున్నారని తెలిపారు. శుక్రవారం ఒక్క రోజే సమయం ఉండడంతో దరఖాస్తులు మరింత పెరిగే అవకాశం ఉన్నాయి. ఒక్కో గ్రామంలోనూ నివాసముంటున్న కుటుంబ సభ్యుల వివరాలను ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment