అసలు నిర్మాణమే లేకుండా.. ఓ డిజైన్‌ను చూపించి బీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేశారు.
తీగలాగితే డొంకంతా కదిలినట్లు.. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కార్యవర్గం అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అసలు నిర్మాణమే లేకుండా.. ఓ డిజైన్‌ను చూపించి బీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేశారు. ఎఫ్‌ఎన్‌సీసీలో ఆదివారం ఉదయం పోర్టిగో నిర్మాణం కుప్పకూలడంతో.. అనేక కొత్త విషయాలు బయట పడుతున్నాయి.
ఎక్కడైనా అక్రమ నిర్మాణాన్ని సక్రమంగా చేసుకోవాలంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీంలో దరఖాస్తు చేసుకోవాలి. అది కూడా 2015 అక్టోబర్ 28వ తేదీలోపు భవనాలు అయితేనే బీఆర్‌ఎస్ వర్తిస్తుంది. ఎఫ్‌ఎన్‌సీసీలో మాత్రం నిబంధనలకు పూర్తిగా పాతరా వేశారు. ఇక్కడ నిర్మాణం లేకుండానే పోర్టిగో ఉన్నట్లుగా ఊహాచిత్రాన్ని చూపించి బీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసుకున్న రెండు నెలలుకు ఇక్కడ పోర్టిగో నిర్మాణం చేపట్టారు.
జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులను లోబర్చుకొని వాళ్లకు గౌరవసభ్యత్వాలు ఇచ్చి 2015 అక్టోబర్ 28వ తేదీలోపు పోర్టిగో నిర్మించినట్లు దరఖాస్తు అందజేశారు. అయితే దురదృష్టవశాత్తు ఈ పోర్టిగో కుప్పకూలడంతో బీఆర్‌ఎస్ వ్యవహారం అంతా బట్టబయలైంది. సోమవారం ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ సర్కిల్-10(బి) కార్యాలయంలో దీనికి సంబంధించిన దరఖాస్తులను వెలికితీయగా ఎప్పుడో బీఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది.
అంతేకాదు జీహెచ్‌ఎంసీ అనుమతి లేకుండానే ఇక్కడ నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను కూడా బీఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేశారు. ఈ ఫంక్షన్‌హాల్‌ను మంత్రి కేటీఆర్‌తో ప్రారంభోత్సవం చేయించారు. ఇక ప్రధాన భవనాన్ని కూడా బీఆర్‌ఎస్‌లోనే చేర్చారు. బీఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేయడం, 10 శాతం ఫీజు చెల్లించడం, మిగతా ఫీజును ఎగ్గొట్టడం ఈ దుర్వినియోగం అంతా సోమవారం అధికారులకు కళ్లకు కట్టింది.