అద్దె భవనాలే ముద్దు
► కార్యాలయూలకు సొంత భవనాలు కరువు
► భవన నిర్మాణాలకు స్థలాలివ్వని రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు
► కీలక శాఖలన్నీ బాడుగ భవనాల్లోనే..
► నగరంలోని విలువైన స్థలాలు అధికార పార్టీ నేతలకు ధారాదత్తం
► నోరు మెదపని ఉన్నతాధికారులు
జిల్లాలో ప్రభుత్వ కార్యాలయూలకు సొంత భవనాలు కరువయ్యూరుు. ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే మగ్గుతున్నారుు. నెలనెలా వివిధ ప్రభుత్వ శాఖలు లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని బాడుగల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. భవనాలు నిర్మించుకునేందుకు స్థలాన్ని అడిగినా.. రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు స్థలాలు చూపించే పరిస్థితి లేదు. దీంతో చేసేదేమి లేక అద్దె భవనాల్లోనే కార్యాలయాలను నడుపుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఖాళీస్థలాల్ని అక్రమార్కులు కబ్జా చేస్తున్నా అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తోంది. జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల విలువైన అధికార పార్టీ నేతలకు అప్పనంగా కట్టబెడుతున్న అధికారులు ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం స్థలాలు చూపించకపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :
జిల్లా కేంద్రంలో ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల్లేవ్.. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండే ఎక్సైజ్ ఒంగోలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయానికీ సొంత భవనం లేదు. దీంతో పాటు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి సైతం సొంత భవనం లేదు. ఈ మూడు భవనాలకే నెలకు రూ.50 వేలకుపైనే బాడుగ చెల్లిస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, తూనికలు, కొలతలు, రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు సైతం సొంత భవనాల్లేక అద్దె భవనాల్లో నడిపిస్తున్నారు. కమర్షియల్ ట్యాక్స్-1, 2 కార్యాలయాలకు సొంత భవనాల్లేవు. ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయాలూ అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. ఏపీఎంఐడీ కార్యాలయం పరిస్థితీ అదే. ఇక పురావస్తు శాఖ, కార్మికశాఖ, నె్రహూ యువ కేంద్రం, పరిశ్రమల ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలు సైతం అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.
నెలకు రూ.లక్షల్లో అద్దె చెల్లింపు..
ఒక్కొక్క ప్రభుత్వ కార్యాలయానికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలకు తగ్గకుండా అద్దెలు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన జిల్లా కేంద్రంలోని అద్దె భవనాల్లో నడుస్తున్న కార్యాలయాలకే నెలకు రూ.లక్షల్లోనే అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. ఆర్థిక ఇబ్బందులు లేని చాలా శాఖలకు ప్రభుత్వం స్థలమిస్తే సొంత భవనాలను నిర్మించుకునే పరిస్థితి ఉంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది కాబట్టి నగర పరిధిలోనే ప్రధాన కార్యాలయాలకుస్థలాలివ్వాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి జిల్లా కార్యాలయంతో పాటు మండల కార్యాలయాలకు సైతం ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిశోర్‌బాబు ఇటీవల ప్రకటించారు. కానీ, ప్రభుత్వ కార్యాలయూలకు స్థలాల కేటారుుంపు ఊసెత్తలేదు.
ఒంగోలు నగరంలోని విలువైన స్థలాలను రెవెన్యూ, ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలకు ఇవ్వకుండా అధికార పార్టీ ముఖ్యనేతలకు ధారాదత్తం చేస్తున్నారు. ఇప్పటికే రూ.10 కోట్లు విలువైన బిలాల్‌నగర్ స్థలాన్ని నగరానికి చెందిన ముఖ్యనేత అనుచరులకు కట్టబెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గతంలో ఈ స్థలాన్ని ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ కోసం అధికారులు అడిగారు. అప్పట్లో ఈ స్థలం ఓ సొసైటీకి పట్టా ఇచ్చి ఉండటంతో అధికారులు ససేమిరా అన్నారు. ఆ తర్వాత సొసైటీకి ఇచ్చిన పట్టాను రద్దు చేసి తాజాగా ఆ స్థలాన్ని నగరానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత అనుచరులకు కట్టబెట్టేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
ఇక అద్దంకి బస్టాండ్‌లో ఉన్న విలువైన స్థలాన్ని సైతం కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయిన పచ్చనేతకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. సదరు నేత స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు సైతం చేపట్టారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ సుజాతశర్మ స్పందించి ఆ స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడారు.
దిబ్బలరోడ్డు ప్రాంతంలో ప్రభుత్వ స్థలాన్ని ఓ నేత తనదంటూ ఏకంగా అధికారులకు భారీగా ముడుపులు అప్పగించి ఎన్‌ఓసీలు తెచ్చుకొని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ అవినీతి బయటపడటంతో జిల్లా కలెక్టర్ పలువురు రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ స్థలాన్ని సైతం నగర ముఖ్యనేత తన సమీప బంధువు హాస్పిటల్ కోసం స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
తాజాగా గద్దలగుంటలోనూ ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ నేత ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా నగరంలోని విలువైన స్థలాలను పచ్చనేతలు వరుసపెట్టి కబ్జా చేసేస్తున్నారు. అందిన కాడికి దండుకొని కొందరు రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు వారికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని విలువైన స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా చూడటంతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు కేటాయించాల్సి ఉంది.