ఏటా రూ.కోటి ఎగనామం..!
► గుంటూరు నగరపాలక సంస్థఆదాయానికి భారీ గండి
► ప్రైవేట్ వ్యక్తులకు పరిపాలనాచార్జీల వసూలు బాధ్యత
► ఏడాదికి రూ. 3.78 లక్షలచెల్లింపుతో సరిపెడుతున్న వైనం
► బకాయిల సొమ్ము రూ.1.60కోట్లకు సైతం ఎసరు
► అందినకాడికి జేబులునింపుకొంటున్న ఘనులు
► ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కార్పొరేషన్ అధికారులు
సాక్షి, గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ అధికారుల పనితీరు...కంచే చేను మేసిన చందంగా ఉంది. కార్పొరేషన్ ఆదాయాన్ని దారి మళ్లించి ప్రైవేట్ వ్యక్తుల జేబులు నింపుతున్నారు. ఫలితంగా ఏటా రూ. కోటికిపైగా ఆదాయానికి గండిపడుతోంది. అలాగే నగరపాలక సంస్థకు రావాల్సిన బకాయిలు రూ. 1.60 కోట్లు సైతం వారికే అప్పగించారు. నగరంలోని వాణిజ్య సముదాయాల నుంచి వచ్చే చెత్త సేకరణకు గత ఏడాది అధికారులు టెండర్లు నిర్వహించారు. దీని కోసం నగరాన్ని మూడు జోన్లుగా విభజించి నెలకు ఒక్కొక్కరు రూ. 10,500 చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. చెత్త సేకరించే ప్రైవేట్ వ్యక్తులు వాణిజ్య సముదాయాలు, టీ షాపులు, టిఫిన్ బండ్ల నుంచి నెలకు రూ.60 వసూలు చేసుకొనేలా గజిట్ రూపొందించారు.
అయితే నగరంలోని విద్యాసంస్థల హాస్టళ్లు, ప్రైవేటు వసతి గృహాల నుంచి నగర పాలక సంస్థ ప్రతి సంవత్సరం పరిపాలనా చార్జీలను వసూలు చేస్తోంది. వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల వల్ల కొంత పారిశుధ్య సమస్య ఏర్పడుతుంది. దీనికోసం ప్రతి విద్యార్థి నుంచి రూ. 150 చొప్పున నగరపాలక సంస్థ పరిపాలనా చార్జీలను వసూలు చేస్తుంది. తద్వారా నగర పాలక సంస్థకు ఏటా రూ.కోటికిపైగా ఆదాయం వస్తుంది.
అయితే వాణిజ్య సముదాయాలతో పాటు పరిపాలనా చార్జీలను వసూలు చేసుకొనే హక్కును సైతం ప్రైవేటు వ్యక్తులకే అప్పగించారు. అయితే నగరపాలక సంస్థకు మూడు జోన్‌లకు కలిపి నెలకు రూ. 31,500 చొప్పున ఏడాదికి రూ. 3.78 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. పరిపాలనా చార్జీల పరంగాా నగరపాలక సంస్థకు రావాల్సిన రూ.కోటి ఆదాయం ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి చేరుతుంది. దీంతో పాటు అంతకు ముందు హాస్టళ్ల నుంచి రావాల్సిన రూ. 1.60 కోట్లు బకాయిలను సైతం వదిలేయడంతో ప్రైవేటు వ్యక్తులే వసూలు చేసుకుని భారీగా లబ్ధి పొందుతున్నారు.
ఉన్నతాధికారుల ఉదాసీనవైఖరి
పరిపాలనా చార్జీల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు ఉన్నతాధికారులకు తెలియంది కాదు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా కమిషనర్ స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
బకాయిల సంగతేంటి...
పరిపాలనా చార్జీల విషయంలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో కార్పొరేషన్‌కు రావాల్సిన బకాయిలను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. 2011లో రూ.9.90 లక్షలు, 2012లో రూ. 44.27 లక్షలు, 2013లో రూ. 51 లక్షలు, 2014లో రూ. 67.42 లక్షలు బకాయిలు రావాల్సి ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి పరిపాలనా చార్జీలను యూజర్ చార్జీలుగా బదలాయించి ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారు. అయితే వీరు నగరపాలక సంస్థకు ఎంత చెల్లిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.