సాక్షి, గుంటూరు: పేరుకు రాజధాని నగరం.. మచ్చుకైనా కనిపించని అభివృద్ధి.. నిధులు ఇవ్వరు.. కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగే ప్రాజెక్ట్‌లు ముందుకు సాగనివ్వరు.. యూజీడీ పనులు ప్రారంభించి మూడేళ్లు దాటుతున్నా సగం పనులు కూడా పూర్తికాని స్థితి... రోడ్లన్నీ తవ్వి వదిలేసిన వైనం.. గుంతలమయంగా నగరంలోని రహదారులు... రోడ్ల విస్తరణను పట్టించుకోని అధికారులు.. పాలకవర్గం లేకపోవడంతో అధికారుల్లో లోపించిన జవాబుదారీతనం.. ఎన్నికలు జరగక తొమ్మిదేళ్లుగా అధికారుల పాలనలో తారస్థాయికి చేరిన అవినీతి.. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏడుగురు కమిషనర్‌ల బదిలీలు.. నగరంపై పట్టు సాధించేలోపు రాజకీయ కారణాలతో బదిలీ.. టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన అంతర్యుద్ధంతో నగరాభివృద్ధిని పక్కన పడేసిన వైనం.. సమర్ధవంతమైన ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమిస్తేనే పాలన గాడిలో పడే అవకాశం. ఇదీ ఐదేళ్ల టీడీపీ పాలనలో గుంటూరు నగరం పరిస్థితి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
గుంటూరు నగరాన్ని రాజధాని నగరంగా సుందరంగా తీర్చిదిద్దుతామంటూ అధికారంలోకి వచ్చిన కొత్తలో టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రగల్భాలు పలికారు. అయితే ఐదేళ్ల పాలనలో గుంటూరు నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యం. నగరాభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోని గత ప్రభుత్వ పెద్దలు కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభమైన ప్రాజెక్ట్‌లనూ పూర్తి చేయలేక చేతులెత్తేశారు. నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్ల వరకూ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం ప్రారంభమైన యూజీడీ పనులు ఇప్పటివరకూ సగం కూడా పూర్తి కాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నగరంలోని రోడ్లన్నీ తవ్వి వదిలేయడంతో గుంతల రోడ్లలో నడవలేక నగర ప్రజలు నరకయాతన పడుతున్నారు. దుమ్ము, ధూళితో అనారోగ్యానికి గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో హౌసింగ్ ఫర్ ఆల్ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న గృహాలు కూడా పూర్తికాక, న్యాయపరమైన చిక్కులను సైతం గత ప్రభుత్వం పరిష్కరించలేక పోవడంతో పేదలకు సొంతింటి కల కలగానే మిగిలి పోయింది.
ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏడుగురు కమిషనర్‌లు
టీడీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో గుంటూరు నగర పాలకసంస్థకు ఏడుగురు కమిషనర్‌లు మారారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు నగరపాలకసంస్థ కమిషనర్‌గా ఉన్న నాగవేణిని బదిలీచేసి అప్పటి జేసీ శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత కర్నూలు జేసీగా ఉన్న కన్నబాబును కమిషనర్‌గా నియమించారు. ఎనిమిది నెలలు తిరగకుండానే ఆయన్ను బదిలీ చేసి మున్నిపల్ ఆర్జేడీగా ఉన్న అనురాధను కమిషనర్‌గా నియమించారు. ఈమెను కూడా ఎనిమిది నెలలు తిరగకుండానే బదిలీ చేసి ఐఏఎస్ అధికారి నాగలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చారు. ఏడాదిన్నర గడవకముందే ఆమెను బదిలీ చేసి మళ్లీ అనురాధను నియమించారు. ప్రస్తుతం ఐఏఎస్ అధికారి శ్రీకేష్ లఠ్కర్ కమిషనర్‌గా ఉన్నారు.
తారస్థాయికి చేరిన అధికారుల అవినీతి
గుంటూరు నగరపాలకసంస్థలో టీడీపీ పాలనలో అన్ని విభాగాల్లో అధికారుల అవినీతి తారస్థాయికి చేరింది. ప్రతిపనికీ ఓ రేటు నిర్ణయించి ప్రజల జేబులు గుల్ల చేశారు. పాలక వర్గం కూడా లేకపోవడంతో ప్రశ్నించే నాథుడే లేకుండా పోవడం అవినీతి పెరగడానికి, పాలన అస్తవ్యస్థంగా మారడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అవినీతిపై సీఎం వైఎస్ జగన్ సీరియస్‌గా దృష్టి సారించడంతోపాటు సమర్ధులైన అధికారులకు కీలక పోస్టింగ్‌లు ఇస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్‌గా సమర్ధుడైన ఐఏఎస్ అధికారిని నియమిస్తే నగరపాలకసంస్థ పాలన గాడిలో పడే అవకాశం ఉంది. నగరపాలకసంస్థ ఎన్నికలు నిర్వహిస్తే ప్రతి డివిజన్‌కూ ఓ కార్పొరేటర్ ఎన్నికై ప్రజలు వారి సమస్యలు చెప్పుకునే వీలు కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment