గత కమిషనర్ నాగలక్ష్మి (ఐఏఎస్)
సాధారణంగా రాజధాని నగరమైన గుంటూరుకు వచ్చేందుకు అధికారులు పోటీపడాలి...కాని గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పోస్టు విషయంలో మాత్రం సీన్ రివర్స్... కమిషనర్‌గా రావాలంటేనే వామ్మో...గుంటూరా... అనే పరిస్థితి ఏర్పడింది. గత నాలుగేళ్లలో ఆరుగురు కమిషనర్లు మారడం ఇందుకు నిదర్శనం. పైగా కింది స్థాయి అధికారులు చేసిన తప్పిదాలకు ఇద్దరు మహిళా కమిషనర్లు మూల్యం చెల్లించుకుని నిర్బంధ బదిలీ కావడం గమనార్హం.
సాక్షి,గుంటూరు: గుంటూరు నగరంలో అధికార పార్టీలో ఉన్న ఆధిపత్య పోరు.. ప్రతి విషయంలో అధికార పార్టీ నేతల జోక్యం... ఎన్నో ఏళ్లుగా పలు విభాగాల్లో పాతుకుపోయిన అధికారులు ముక్కుసూటిగా పనిచేసే అధికారులను ఎక్కువ కాలం ఉంచేందుకు ఇష్టపడని పరిస్థితి. ఇవన్నీ ఇక్కడకు కమిషనర్‌గా రావడానికి అధికారులకు హర్డిల్స్‌గా పరిణమిస్తున్నాయి. కమిషనర్‌లు వస్తుంటారు.. పోతుంటారు.. చంటిగాడు లోకల్ అన్న చందంగా ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తుంటారు. గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు చేసిన తప్పుకు యువ ఐఏఎస్ అధికారిణి నాగలక్ష్మి బలై ఇక్కడి నుంచి బదిలీ కావలసివచ్చింది. తాజాగా గ్రూప్–1 అధికారిణి చల్లా అనూరాధ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు చేసిన తప్పుకు బలై బదిలీ అయ్యారు. ఈ రెండు సంఘటనల్లోనూ ఆయా విభాగాల అధిపతులపై మాత్రం చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
గుంటూరు నగరపాలక సంస్థ ఏర్పడి 150 ఏళ్లు దాటిన సందర్భంగా ఇటీవల వేడుకలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వేడుకలను సైతం రద్దు చేసింది. రాజధాని అమరావతి జిల్లా కేంద్రమైన గుంటూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామంటూ హామీలు గుప్పించిన ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసింది. నగరాభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో నగరపాలక సంస్థ కమిషనర్‌లను ఇష్టం వచ్చినట్టు మారుస్తూ వచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 45 నెలలు కావస్తుండగా, ఇప్పటికి ఆరుగురు కమిషనర్‌లు (వారిలో ముగ్గురు ఐఏఎస్‌లు) బదిలీ అయి ఏడో కమిషనర్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. కలుషిత నీరు తాగి 20 మంది మృతి చెందిన ఘటనకు బాధ్యురాలిని చేస్తూ ప్రస్తుత కమిషనర్ అనూరాధను బదిలీ చేసిన ప్రభుత్వం విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
లఠ్కర్ ... బీ అలర్ట్
గుంటూరు నగరపాలక సంస్థలోని ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, ప్రజారోగ్య విభాగం, రెవెన్యూ వంటి కీలక విభాగాల్లో ఏళ్ల తరబడి అనేక మంది అధికారులు, సిబ్బంది పాతుకుపోయి ఉన్నారు. కార్పొరేషన్‌లో వ్యవహారమంతా వీరి చేతులపైనే నడుస్తుంది. దీన్ని కట్టడి చేసి అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడే అధికారులను గుర్తించి కఠినంగా వ్యవహరించకపోతే గత కమిషనర్‌లు నాగలక్ష్మి, అనురాధలాగానే బలయ్యే ప్రమాదం ఉంది. గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు చేసిన తప్పుకు ఓ భవనం పునాదులు కూలి ఏడుగురు దుర్మరణం పాలైన సంఘటనతో పాటు, అనధికారిక నిర్మాణం చేపడుతున్న ఓ వైద్యుడి వద్ద భారీ మొత్తంలో డబ్బు పుచ్చుకుని అధికారులు వదిలేయడంతో హైకోర్టు దీనిపై సీరియస్ అయి కమిషనర్ నాగలక్ష్మికి నెలరోజుల జైలు శిక్ష కూడా విధించింది. ఆ తరువాత ఆమెకు పదోన్నతి రావడంతో ప్రకాశం జిల్లా జేసీగా బదిలీ చేశారు. తాజాగా గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి 20 మందికి పైగా మృతిచెందిన ఘటన ఇంజినీరింగ్ అధికారుల తప్పిదం వల్లే జరిగినట్టు స్పష్టంగా తేలినా సంబంధిత విభాగాధిపతులపై చర్యలు తీసుకోకుండా కమిషనర్‌ను బలిపశువును చేశారు.
కమిషనర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే...
అనధికారిక నిర్మాణాలు, నాణ్యతాలోపంతో పనులు జరుగుతున్నా ఆయా విభాగాల ఉన్నతాధికారులు చూస్తూ ఊరుకోవడమే కాకుండా, వాటిని గుర్తించి కమిషనర్‌లు చర్యలకు ఉపక్రమించే తరుణంలో మంత్రులు, ఎంపీలతో ఒత్తిళ్లు చేయించి వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడతారు. అప్పటికీ వినకపోతే కోర్టుకు వెళ్లమంటూ వీరే ఉచిత సలహాలు ఇస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నగర కమిషనర్‌కు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చి తోకాడించే అధికారులు, సిబ్బందిపై కఠినంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment