Guntur Municipal Corporation
-
కాంట్రాక్టర్ల కోసం కాదు..ప్రజల కోసం పనిచేస్తాం : బొత్స
గుంటూరు నగరం .. చిన్నపాటి చినుకు పడితే చాలు.. నగర వాసులు వణికిపోవాల్సిందే.. షెడ్డులోకి చేరిన బైక్ బయటికి రావాలంటే ముందు చక్రాలకు బురద బంధనాలు అడ్డుపడుతుంటాయి. ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు పెట్టాలంటే యూజీడీ పనులతో తవ్వేసిన గోతులు వెక్కిరిస్తుంటాయి. పిల్లలు బ్యాగులు భుజానపెట్టి స్కూల్‌కు బయలుదేరితే అడుగడుగునా గుంతలు భయపెడుతుంటాయి. ఇవన్నీ గత టీడీపీ అస్తవ్యస్త పాలనకు నిదర్శనంగా కనిపిస్తుంటాయి. శనివారం జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతో కలిసి గుంటూరులో పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వీటన్నింటినీ చూసి చలించిపోయారు. వెంటనే ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని అధికారులను ఆదేశించారు. యూజీడీ పనులను పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తామని, ఇతర అభివృద్ధి పనులు చేపడతామని ప్రకటించారు. సాక్షి, అమరావతి బ్యూరో/నెహ్రూనగర్: గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, లోపాలను సరిదిద్ది గుంటూరు నగర సమగ్ర అభివృధ్ధే ధ్యేయంగా పనిచేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు మొహమ్మద్ ముస్తఫా, అంబటి రాంబాబు, కిలారి రోశయ్య, వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రగిరి ఏసురత్నం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లాల్పురం రాము, కావటి మనోహర్‌నాయుడుతో కలిసి గుంటూరు నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. ప్రధానంగా వాసవి నగర్, బీఆర్ స్టేడియం, యాదవ హైస్కూల్ రోడ్డు, సుద్దపల్లి డొంక, లాంచెస్టర్ రోడ్డు, పీవీకే నాయుడు మార్కెట్ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. యూజీడీ పనులపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుద్దపల్లి డొంకలో మానవమాత్రులు ఉండే పరిస్థితి లేదని, ఆ పరిస్థితి చూసి నాకే బాధతో సిగ్గేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూజీడీ పనులు చేసిన చోట రోడ్లను వెంటనే రెస్టోరేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. సుద్దపల్లి డొంకకు ఇరువైపులా డ్రెయిన్లు విస్తరణ చేసి అక్కడ పరిస్థితిని చక్కదిద్దాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించలేదనడం అవాస్తవం నగరంలో యూజీడీ పనులు రూ.855 కోట్లతో, 9.8 శాతం ఎక్సెస్ చేపట్టారని, ఇందులో కేవలం 50 శాతం పనులు పూర్తికాగా, రూ.390 కోట్లు కాంట్రాక్టర్‌కు చెల్లించామని మంత్రి బొత్స తెలియజేశారు. అంటే కాంట్రాక్టు ఏజెన్సీ అదనంగా పెట్టిన పెట్టుబడులు ఏమీ లేవన్నారు. 80 శాతం పనులు పూర్తయ్యానని, కాంట్రాక్టు సంస్థకు బిల్లులు చెల్లించక ఆగిపోయాయంటూ చేసే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నగరంలో 457.62 కి.మీ మేర యూజీడీ పనులు జరగగా, అందులో 156.62 కి.మీ మేర పనులు రెస్టోరేషన్ చేసినట్లు కాగితాల్లో ఉన్నా క్షేత్ర స్థాయిలో ఆమేరకు పనులు జరగలేదన్నారు. బీటీ, సీసీ, డబ్ల్యూబీఎం రోడ్లు వేయాల్సి ఉందన్నారు. ఆర్ అండ్‌బీ రోడ్లకు సంబంధించి 15.6 కి.మీ మేర, రోడ్డు పనులను పునరుద్ధరించాల్సి ఉందన్నారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధికి... బీఆర్ స్టేడియం అభివృద్ధికి సంబంధిత మంత్రి, శాప్ అధికారులతో చర్చించి కృషి చేస్తామన్నారు. స్టేడియం పక్కన ఉన్న డంపింగ్ యార్డును తక్షణమే తొలగించాలని ఆదేశించారు. పీవీకే కూరగాయల మార్కెట్‌కు సంబంధించి మున్సిపల్ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు అక్కడి వ్యాపారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాంట్రాక్టుల కోసం కాకుండా, ప్రజల కోసం అవసరమైన మేరకు పనులు చేసేలా కృషి చేస్తామన్నారు. నగరంలో పరిపాలనా సౌలభ్యంకోసం అవసరమైన గ్రామాలను విలీనం చేస్తామన్నారు. నగరంలో స్టామ్ వాటర్ డ్రైన్లు లేకపోవటం వలనే ఇబ్బంది తలెత్తుతోందన్నారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నగరాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామని చెప్పారు. మంత్రి మోపిదేవి వెంకట రమణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం యూజీడీ పనులను ఒక ప్రణాళిక ప్రకారం కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో చేయడం వలనే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ మాట్లాడుతూ నగరం లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసు కుంటు న్నట్టు తెలిపారు. నగరంలో ప్రధానంగా ఏడు రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, నందివెలుగు రోడ్డు, పలకలూరు రోడ్డు పనులు చేస్తున్నామని మున్పిపల్ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. సుద్దపల్లిడొంక, పీకలవాగు, డిస్పోజల్ కు చర్యలు తీసుకుంటామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో యూజీడీ పనులు చేసిన పట్టాభిపురం, అమరావతి రోడ్డులో యూజీడీ పనులకు తవ్వి, వాటిని అలాగే వదిలివేయడం వలన అవి సొరంగాల్లా తయారయ్యాయని వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం అన్నారు. యాదవ స్కూల్ రోడ్డును పరిశీలిస్తున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్యే ముస్తఫా, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, జీఎంసీ కమిషనర్ అనురాధ కాంట్రాక్టర్ల కోసం కాదు..ప్రజల కోసం పనిచేస్తాం : బొత్స సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు నగర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, కాంట్రాక్టర్ల కోసం కాకుండా, ప్రజలకు అవసరమైన మేరకు పనులు చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫాతో కలిసి శనివారం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ నగరం విస్తరించిన దృష్ట్యా అమరావతి రోడ్డు, విజయవాడ రోడ్డు, నల్లపాడు వైపు రైతు బజారులు ఏర్పాటు చేస్తామని, అందుకనుగుణంగా అధికారులు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. పీవీకే నాయుడు మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ రూ.1800 కోట్లతో నగరాభివృద్ధికి ప్రత్యేక డీపీఆర్ తయారు చేయించినట్లు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కిలారి వెంకటరోశయ్య, గుంటూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, వైఎస్సార్ సీపీ నాయకుడు కావటి పాల్గొన్నారు. -
గాడిన పడేదెలా..?
సాక్షి, గుంటూరు: పేరుకు రాజధాని నగరం.. మచ్చుకైనా కనిపించని అభివృద్ధి.. నిధులు ఇవ్వరు.. కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగే ప్రాజెక్ట్‌లు ముందుకు సాగనివ్వరు.. యూజీడీ పనులు ప్రారంభించి మూడేళ్లు దాటుతున్నా సగం పనులు కూడా పూర్తికాని స్థితి... రోడ్లన్నీ తవ్వి వదిలేసిన వైనం.. గుంతలమయంగా నగరంలోని రహదారులు... రోడ్ల విస్తరణను పట్టించుకోని అధికారులు.. పాలకవర్గం లేకపోవడంతో అధికారుల్లో లోపించిన జవాబుదారీతనం.. ఎన్నికలు జరగక తొమ్మిదేళ్లుగా అధికారుల పాలనలో తారస్థాయికి చేరిన అవినీతి.. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏడుగురు కమిషనర్ల బదిలీలు.. నగరంపై పట్టు సాధించేలోపు రాజకీయ కారణాలతో బదిలీ.. టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన అంతర్యుద్ధంతో నగరాభివృద్ధిని పక్కన పడేసిన వైనం.. సమర్ధవంతమైన ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమిస్తేనే పాలన గాడిలో పడే అవకాశం. ఇదీ ఐదేళ్ల టీడీపీ పాలనలో గుంటూరు నగరం పరిస్థితి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... గుంటూరు నగరాన్ని రాజధాని నగరంగా సుందరంగా తీర్చిదిద్దుతామంటూ అధికారంలోకి వచ్చిన కొత్తలో టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రగల్భాలు పలికారు. అయితే ఐదేళ్ల పాలనలో గుంటూరు నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యం. నగరాభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోని గత ప్రభుత్వ పెద్దలు కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభమైన ప్రాజెక్ట్‌లనూ పూర్తి చేయలేక చేతులెత్తేశారు. నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్ల వరకూ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం ప్రారంభమైన యూజీడీ పనులు ఇప్పటివరకూ సగం కూడా పూర్తి కాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నగరంలోని రోడ్లన్నీ తవ్వి వదిలేయడంతో గుంతల రోడ్లలో నడవలేక నగర ప్రజలు నరకయాతన పడుతున్నారు. దుమ్ము, ధూళితో అనారోగ్యానికి గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో హౌసింగ్ ఫర్ ఆల్ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న గృహాలు కూడా పూర్తికాక, న్యాయపరమైన చిక్కులను సైతం గత ప్రభుత్వం పరిష్కరించలేక పోవడంతో పేదలకు సొంతింటి కల కలగానే మిగిలి పోయింది. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏడుగురు కమిషనర్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో గుంటూరు నగర పాలకసంస్థకు ఏడుగురు కమిషనర్లు మారారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు నగరపాలకసంస్థ కమిషనర్‌గా ఉన్న నాగవేణిని బదిలీచేసి అప్పటి జేసీ శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత కర్నూలు జేసీగా ఉన్న కన్నబాబును కమిషనర్‌గా నియమించారు. ఎనిమిది నెలలు తిరగకుండానే ఆయన్ను బదిలీ చేసి మున్నిపల్ ఆర్జేడీగా ఉన్న అనురాధను కమిషనర్‌గా నియమించారు. ఈమెను కూడా ఎనిమిది నెలలు తిరగకుండానే బదిలీ చేసి ఐఏఎస్ అధికారి నాగలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చారు. ఏడాదిన్నర గడవకముందే ఆమెను బదిలీ చేసి మళ్లీ అనురాధను నియమించారు. ప్రస్తుతం ఐఏఎస్ అధికారి శ్రీకేష్ లఠ్కర్ కమిషనర్‌గా ఉన్నారు. తారస్థాయికి చేరిన అధికారుల అవినీతి గుంటూరు నగరపాలకసంస్థలో టీడీపీ పాలనలో అన్ని విభాగాల్లో అధికారుల అవినీతి తారస్థాయికి చేరింది. ప్రతిపనికీ ఓ రేటు నిర్ణయించి ప్రజల జేబులు గుల్ల చేశారు. పాలక వర్గం కూడా లేకపోవడంతో ప్రశ్నించే నాథుడే లేకుండా పోవడం అవినీతి పెరగడానికి, పాలన అస్తవ్యస్థంగా మారడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అవినీతిపై సీఎం వైఎస్ జగన్ సీరియస్‌గా దృష్టి సారించడంతోపాటు సమర్ధులైన అధికారులకు కీలక పోస్టింగ్‌లు ఇస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్‌గా సమర్ధుడైన ఐఏఎస్ అధికారిని నియమిస్తే నగరపాలకసంస్థ పాలన గాడిలో పడే అవకాశం ఉంది. నగరపాలకసంస్థ ఎన్నికలు నిర్వహిస్తే ప్రతి డివిజన్‌కూ ఓ కార్పొరేటర్ ఎన్నికై ప్రజలు వారి సమస్యలు చెప్పుకునే వీలు కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కమిషనర్ వర్సెస్ కాంట్రాక్టర్లు
సాక్షి, గుంటూరు: ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ ఉందన్న సామెతకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు అద్దం పడుతున్నాయి. నిధులు ఉన్నా కార్పొరేషన్ కమిషనర్, కాంట్రాక్టర్ల మధ్య విభేదాలతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. బిల్లులు ఇస్తేనే చేస్తామంటూ కాంట్రాక్టర్లు.. ఇంజినీరింగ్ అధికారులతో కుమ్మక్కై ఇష్టానుసారం చేస్తుండటం వల్లే ఇవ్వకుండా తిప్పుతున్నామంటూ కమిషనర్ భీష్మించి కూర్చోవడంతో నగరంలో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పనుల దగ్గరకు రాకుండానే ఆరోపణలు ఎలా చేస్తారంటూ కాంట్రాక్టర్లు కమిషనర్‌పై మండిపడుతున్నారు. బిల్లులు చెల్లించాలంటూ వెళ్లిన తమపై కమిషనర్ అవమానకరంగా ప్రవర్తించారంటూ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కోన శశిధర్‌తోపాటు, సీఎస్‌ను కలసి ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం అవుతుండటంతో వివాదం ముదిరి పాకాన పడింది. దీనికి తోడు ప్రభుత్వం కార్పొరేషన్ నిధుల్ని సైతం పసుపుకుంకుమ వంటి పథకాలకు మళ్లించడంతో ఖజానా ఖాళీ అయి కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే కమిషనర్ బిల్లులు పెట్టడం లేదనే వాదనలు ఉన్నాయి. ఏదేమైనా కమిషనర్ వర్సెస్ కాంట్రాక్టర్స్ పోరు నగర ప్రజలకు శాపంగా మారిందని చెప్పవచ్చు. ఆచితూచి వ్యవహరిస్తున్న కమిషనర్ గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా శ్రీకేష్ లఠ్కర్ ఏడాది కిందట బాధ్యతలు చేపట్టారు. ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే గత కమిషనర్‌పై వేటు పడిందనే విషయం తెలుసుకున్న ఆయన మొదటి నుంచి ఇంజినీరింగ్ అధికారులు పెట్టే బిల్లులపై కొర్రీలు వేస్తూ వస్తున్నారు. కొందరు కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై అడ్డగోలుగా పనులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు రావడంతో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. గత డిసెంబరు నుంచి బిల్లులన్నీ పెండింగ్‌లో పెట్టడంతో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా వారు పనుల్ని నాసిరకంగా నిర్వహించారనే అనుమానం వస్తే క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు చేపట్టడం, బాగా చేసిన వారికి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించడం చేస్తే ఇబ్బందులు లేకుండా ఉండేవని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కాని అందరినీ ఒకే విధంగా భావించి నిలిపివేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్ తీరుపై మండిపడుతున్న కాంట్రాక్టర్లు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు సుమారు రూ. 100 కోట్ల వరకు బకాయిలు ఉండటంతో బుధవారం అసోసియేషన్ నాయకులు కమిషనర్‌ను కలసి బిల్లులు చెల్లించాలని కోరేందుకు వెళ్లారు. అయితే, ఆ సమయంలో సైతం తమను అవమానకరంగా మాట్లాడారంటూ అసోసియేషన్ నేతలు మండి పడుతున్నారు. కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న కమిషనర్‌పై కలెక్టర్, సీఎస్‌లకు ఫిర్యాదు చేసేందుకు కాంట్రాక్టర్ల అసోసియేషన్ నాయకులు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా 14వ ఆర్థిక సంఘం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో పూర్తిచేసిన పనులకు సైతం సుమారుగా రూ. 25 కోట్ల వరకు బిల్లులు చెల్లించకుండా కమిషనర్ నిలిపివేయడంపై కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. ఇంజినీరింగ్ అధికారులు పనుల్ని పరిశీలించి బిల్లులు చెల్లించాలంటూ పంపిన 80 ఫైళ్లను ఒకేసారి వెనక్కు పంపడం చూస్తుంటే కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లపై ఏస్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతోంది. నిలిచిపోయిన అభివృద్ధి పనులు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్, కాంట్రాక్టర్ల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఎఫెక్ట్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పడింది. కొంత మేర పనులు నిర్వహించినప్పటికీ బిల్లులు చెల్లించకుండా కమిషనర్ ఇబ్బందులు పెడుతున్నారంటూ కాంట్రాక్టర్లు నిలిపివేశారు. ముఖ్యంగా లాల్పురం రోడ్డు విస్తరణ, డ్రెయిన్ నిర్మాణ పనులు చేపట్టేందుకు రూ. 6 కోట్లు మంజూరయ్యాయి. కొంత మేర పూర్తయినప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ నిలిపివేశారు. పొన్నూరు రోడ్డు, విజయవాడ రోడ్లలో డివైడర్ నిర్మాణంతోపాటు, సెంట్రల్ లైటింగ్ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లకు సైతం పార్ట్ బిల్లులు చెల్లించకపోవడంతో నిలిపివేశారు. రింగ్‌రోడ్డు రోడ్డు విస్తరణ పనులు సైతం మధ్యలోనే ఆగిపోయాయి. అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య జరుగుతున్న గొడవలు నగరంలో పనులు నిలిచిపోయే స్థాయికి వెళ్లడం నగర ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. -
వామ్మో... గుంటూరా..!
సాధారణంగా రాజధాని నగరమైన గుంటూరుకు వచ్చేందుకు అధికారులు పోటీపడాలి...కాని గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పోస్టు విషయంలో మాత్రం సీన్ రివర్స్... కమిషనర్‌గా రావాలంటేనే వామ్మో...గుంటూరా... అనే పరిస్థితి ఏర్పడింది. గత నాలుగేళ్లలో ఆరుగురు కమిషనర్లు మారడం ఇందుకు నిదర్శనం. పైగా కింది స్థాయి అధికారులు చేసిన తప్పిదాలకు ఇద్దరు మహిళా కమిషనర్లు మూల్యం చెల్లించుకుని నిర్బంధ బదిలీ కావడం గమనార్హం. సాక్షి,గుంటూరు: గుంటూరు నగరంలో అధికార పార్టీలో ఉన్న ఆధిపత్య పోరు.. ప్రతి విషయంలో అధికార పార్టీ నేతల జోక్యం... ఎన్నో ఏళ్లుగా పలు విభాగాల్లో పాతుకుపోయిన అధికారులు ముక్కుసూటిగా పనిచేసే అధికారులను ఎక్కువ కాలం ఉంచేందుకు ఇష్టపడని పరిస్థితి. ఇవన్నీ ఇక్కడకు కమిషనర్‌గా రావడానికి అధికారులకు హర్డిల్స్గా పరిణమిస్తున్నాయి. కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు.. చంటిగాడు లోకల్ అన్న చందంగా ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తుంటారు. గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు చేసిన తప్పుకు యువ ఐఏఎస్ అధికారిణి నాగలక్ష్మి బలై ఇక్కడి నుంచి బదిలీ కావలసివచ్చింది. తాజాగా గ్రూప్–1 అధికారిణి చల్లా అనూరాధ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు చేసిన తప్పుకు బలై బదిలీ అయ్యారు. ఈ రెండు సంఘటనల్లోనూ ఆయా విభాగాల అధిపతులపై మాత్రం చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... గుంటూరు నగరపాలక సంస్థ ఏర్పడి 150 ఏళ్లు దాటిన సందర్భంగా ఇటీవల వేడుకలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వేడుకలను సైతం రద్దు చేసింది. రాజధాని అమరావతి జిల్లా కేంద్రమైన గుంటూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామంటూ హామీలు గుప్పించిన ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసింది. నగరాభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో నగరపాలక సంస్థ కమిషనర్లను ఇష్టం వచ్చినట్టు మారుస్తూ వచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 45 నెలలు కావస్తుండగా, ఇప్పటికి ఆరుగురు కమిషనర్లు (వారిలో ముగ్గురు ఐఏఎస్‌లు) బదిలీ అయి ఏడో కమిషనర్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. కలుషిత నీరు తాగి 20 మంది మృతి చెందిన ఘటనకు బాధ్యురాలిని చేస్తూ ప్రస్తుత కమిషనర్ అనూరాధను బదిలీ చేసిన ప్రభుత్వం విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. లఠ్కర్ ... బీ అలర్ట్ గుంటూరు నగరపాలక సంస్థలోని ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, ప్రజారోగ్య విభాగం, రెవెన్యూ వంటి కీలక విభాగాల్లో ఏళ్ల తరబడి అనేక మంది అధికారులు, సిబ్బంది పాతుకుపోయి ఉన్నారు. కార్పొరేషన్లో వ్యవహారమంతా వీరి చేతులపైనే నడుస్తుంది. దీన్ని కట్టడి చేసి అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడే అధికారులను గుర్తించి కఠినంగా వ్యవహరించకపోతే గత కమిషనర్లు నాగలక్ష్మి, అనురాధలాగానే బలయ్యే ప్రమాదం ఉంది. గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు చేసిన తప్పుకు ఓ భవనం పునాదులు కూలి ఏడుగురు దుర్మరణం పాలైన సంఘటనతో పాటు, అనధికారిక నిర్మాణం చేపడుతున్న ఓ వైద్యుడి వద్ద భారీ మొత్తంలో డబ్బు పుచ్చుకుని అధికారులు వదిలేయడంతో హైకోర్టు దీనిపై సీరియస్ అయి కమిషనర్ నాగలక్ష్మికి నెలరోజుల జైలు శిక్ష కూడా విధించింది. ఆ తరువాత ఆమెకు పదోన్నతి రావడంతో ప్రకాశం జిల్లా జేసీగా బదిలీ చేశారు. తాజాగా గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి 20 మందికి పైగా మృతిచెందిన ఘటన ఇంజినీరింగ్ అధికారుల తప్పిదం వల్లే జరిగినట్టు స్పష్టంగా తేలినా సంబంధిత విభాగాధిపతులపై చర్యలు తీసుకోకుండా కమిషనర్‌ను బలిపశువును చేశారు. కమిషనర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే... అనధికారిక నిర్మాణాలు, నాణ్యతాలోపంతో పనులు జరుగుతున్నా ఆయా విభాగాల ఉన్నతాధికారులు చూస్తూ ఊరుకోవడమే కాకుండా, వాటిని గుర్తించి కమిషనర్లు చర్యలకు ఉపక్రమించే తరుణంలో మంత్రులు, ఎంపీలతో ఒత్తిళ్లు చేయించి వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడతారు. అప్పటికీ వినకపోతే కోర్టుకు వెళ్లమంటూ వీరే ఉచిత సలహాలు ఇస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నగర కమిషనర్‌కు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చి తోకాడించే అధికారులు, సిబ్బందిపై కఠినంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
రికార్డుల్లో బయటపడ్డ అవినీతి
సాక్షి, గుంటూరు: నగరపాలక సంస్థలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించి అవసరమైన రికార్డులను తారుమారు చేయటం ద్వారా రికార్డు రూం సిబ్బంది భారీ అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రికార్డు రూమ్‌లో పనిచేసే కొందరు ఉద్యోగులు, దళారులు కలసి భారీ స్థాయిలో అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. ఇటీవల జరిగిన ఆడిట్ తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడినట్లు చెబుతున్నారు. ఇదీ సంగతి.. నగరపాలక సంస్థ పరిధిలో నూతన భవన నిర్మాణానికి ప్లాన్ అనుమతికి బిల్డింగ్ ప్లాను చార్జీలతో ఓపెన్ స్పెస్ కాస్ట్ కింద డెవలప్మెంట్ చార్జీలు చెల్లించాల్సి ఉంది. స్థలం కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ ధరపై 14 శాతం డెవలప్మెంట్ చార్జీలు చెల్లించాలి. అయితే ఆ స్థలంలో గతంలో ఉన్న ఇంటికి 1985 నుంచే పన్ను చెల్లింస్తుంటే డెవలప్మెంట్ చార్జీలకు మినహాయింపు ఇవ్వాలని పురపాలకశాఖ ఉత్తర్వుల్లో ఉంది. ఇది జరగాలంటే 1985కు ముందునుంచే పన్ను విధించినట్లు ధ్రువీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. దీనికోసం పౌరసేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకొని ఇంటి అసెస్మెంట్ నంబర్‌కు డిమాండ్ అబ్స్ట్రాక్ట్ సర్టిఫికెట్‌ను రికార్డురూం ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. గత ఐదేళ్లుగా వాణిజ్య, నివాస స్థలాల ధరలు విపరీతంగా పెరిగాయి. డెవలప్మెంట్ చార్జీల రూపంలో కార్పొరేషన్‌కు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రికార్డు రూం సిబ్బంది మాత్రం 1985కు ముందు పన్నులు లేకపోయినా ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం అందించటానికి లక్షల్లో బేరాలు కుదుర్చుకొని అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. అంతేకాకుండా రికార్డుల ప్రకారం పన్నులు ఉన్నవారికి సైతం పత్రాలు ఇవ్వటానికి ముడుపులు బాగానే వసూళు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆడిట్లో దొరికారు.. నగరపాలక సంస్థలో టౌన్‌ప్లానింగ్ విభాగంలో 2016–17కు సంబంధించి జరుగుతున్న ఆడిట్లో 14 శాతం పన్ను మినహాయింపుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అసలు 1985కి ముందు నగరంలో ఉన్న నిర్మాణాలు, అప్పుడు పన్నులు కట్టినవాటి సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం మినహాంపు పొందిన అసెస్మెంట్లకు మధ్య భారీ తేడాను గుర్తించినట్లు సమాచారం. అవినీతికి ప్రధాన కారణం రికార్డుల విభాగంలోని కొందరు ఉద్యోగులేనని ఆరోపణలు రావటంతో అక్కడ విధులు నిర్వర్తిసున్న రికార్డు రూం ఇన్చార్జి శరత్‌బాబును కమిషనర్ వేరే విభాగానికి బదిలీ చేశారు. అయితే సదరు వ్యక్తి రికార్డురూంలో విధులు కేటాయిస్తేనే చేస్తానంటూ సెలవుపై వెళ్లిపోయారు. ఇదే సమయంలో నిబంధనల ప్రకారం 1985కు పూర్వమే పన్ను చెల్లిస్తున్నప్పటికీ ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు రికార్డురూం సిబ్బందిపై నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధకు ఆధారాలతో సహా ఫిర్యాదు అందింది. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలటంతో రెవెన్యూ విభాగంలో బిల్‌కలెక్టర్ హోదాలో డిప్యూటేషన్‌పై రికార్డు రూం అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వి.పాండురంగారావును సస్పెండ్ చేస్తూ కమిషనర్ గురవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సైతం సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఎవరినీ వదిలిపెట్టం.. రికార్డు రూమ్‌లో జరిగిన అవకతవకలకు సంబంధించి పూర్తి విచారణ జరుపుతాం. నగరపాలక సంస్థ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందో చూసి బాధ్యుల నుంచి మొత్తం రాబడతాం. ఇందులో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినినీ వదిలేది లేదు. – చల్లా అనూరాధ, నగరపాలక సంస్థ కమిషనర్ -
ఓ గుమాస్తా దందాగిరి!
* గుంటూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ సెక్షన్లో అధికారి హవా గుంటూరు (నెహ్రూనగర్) : నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ సెక్షన్లో ఓ గుమాస్తా తన చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రతి పనికి ఎంతో కొంత ముట్టచెప్పనిదే ఫైలు కదలనివ్వడని సిబ్బంది ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ ఇంక్రిమెంట్లు వేయాలంటే రూ.500 దాకా, పీఆర్సీ బకాయిలు వేయాలంటే రూ.10 వేలు నుంచి రూ.15 వేలు, సరెండర్ లీవ్‌లకు రూ.3 వేలు, కొత్తగా ఎస్సార్ ఓపెన్ చేయాలంటే ఒక రేటు, ఇక కారుణ్య నియమకాలకు ఒక రేటు చొప్పున వసూలు చేస్తున్నారంటూ సిబ్బంది ఆరోపిస్తున్నారు. దీనిపై ఎస్ఈకి ఫిర్యాదు చేయడంతో ఆయన సదరు గుమాస్తాను తన చాంబర్‌కు పిలిపించి మాట్లాడారు. ఎందుకు ఇలా వసూలు చేస్తున్నావని అడగడంతో తాను తీసుకుంటే వేలల్లో.. మీరు తీసుకుంటే లక్షల్లోనే కదా అనడంతో ఎస్ఈ సైతం నోరు మెదపలేదని తెలిసింది. అతనిని సెక్షన్ నుంచి మార్చాలని కమిషనర్‌కు ఎస్ఈ నోట్ పెట్టినట్లు సమాచారం. గతంలో ప్రవీణ్ ప్రకాష్ కమిషనర్‌గా ఉన్న సమయంలో సదరు గుమాస్తా అటెండర్‌గా పనిచేసి జూనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ సంపాదించాడు. అయితే అతని పనితీరు నచ్చని కమిషనర్ తిరిగి అటెండర్‌గా డిమోట్ చేశారు. చివరికి కమిషనర్ బదిలీ కావడంతో కోర్టును ఆశ్రయించి తిరిగి ప్రమోషన్ సంపాదించాడు. కార్పొరేషన్లో సదరు గుమాస్తాకి అధికారులంటే లెక్కే లేదనే ఆరోపణలున్నాయి. దీనిపై ఎస్ఈ గోపాలకృష్ణారెడ్డిని వివరణ కొరగా సదరు గుమాస్తాపై వస్తున్న ఆరోపణలు నిజమేనని చెప్పారు. తన దగ్గరకు చాలా ఫిర్యాదులు అందాయన్నారు. తాను పిలిచినా రాలేదని తెలి పారు. విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. -
మానవత్వం మిగిలి ఉందా..?
* కలవరపెడుతున్న వృద్ధుల హత్యలు * ఒంటరిగా చూసి దాడులు, చోరీలు * పోలీసుల వైఫల్యంపై సర్వత్రా విమర్శలు గుంటూరు (పట్నంబజారు): వృద్ధులపై ఇటీవల జరుగుతున్న దాడులు, హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కాలయముడుగా మారుతున్నారు. తల్లి, తండ్రి అనే ప్రేమ లేదు.. బంధువు అనే జాలి లేదు. డబ్బుకోసం మానవత్వాన్ని మరిచి కిరాతకుల్లా వ్యవహరిస్తున్నారు. గుంటూరు నగరంలోని లాలాపేట పోలీసుస్టేçÙన్ పరిధిలో శనివారం రాత్రి ఆలస్యంగా వెలుగుచూసిన తల్లీకూతుళ్ళు బచ్చు లక్ష్మమ్మ (70), హరిప్రియ (50) హత్యలతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. హత్యలు ఆస్తి కోసం జరిగాయా లేక నగదు దోచుకునేందుకా అని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే హత్యలకు మందు తీవ్ర పెనుగులాట చోటు చేసుకున్న ఆనవాళ్ళు కనపడుతున్న నేపథ్యంలో తెలిసిన వారిపనే అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే అక్టోబర్ 5వ తేదీన పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగి షేక్ ఖాశీం (65), మీరాబీ (60)లను కన్నకూతురే ఆస్తి కోసం తన భర్తతో కలిసి హత్య చేయటం సంచలనం రేకెత్తించింది. ఇటువంటి ఘటనలు గతంలో సైతం అనేకం జరిగిన సందర్భాలు ఉన్నాయి. చిలుకలూరి పేట హైవే రోడ్డులో సిక్కు దంపతులను డబ్బు కోసం అత్యంత కిరాతకంగా చంపేశారు. వారు నివాసం ఉండే హోటల్లోనే ఘటన జరిగింది. ఇప్పటి వరకు ఆ కేసులో నిందితులను పట్టుకోవటంలో పోలీసులు పూర్తి వైఫల్యం చెందారనే విమర్శలున్నాయి. బెంబేలెత్తిస్తున్న దాడులు.. నివాసాల్లో ఒంటరిగా ఉన్న వృద్ధులపై జరుగుతున్న దాడులు బెంబేలెత్తిస్తున్నాయి. బ్రాడీపేటలో ఉండే పాగోలు నరసింహరావు అనే 75 సంత్సరాల వృద్ధుడిని ఒక యువకుడు కత్తితో బెదిరించి చేతికి ఉన్న బ్రాస్లెట్, మెడలోని గొలుసు అపహరించుకుపోయాడు. రామన్న పేటలో ఒక వృద్ధురాలిపై గుర్తుతెలియని యువకుడు దాడి చేసి నగదు, బంగారాన్ని దోచుకుపోయాడు. గోరంట్లలోని తూర్పు వీధిలో వృద్ధుడిపై దాడి చేసి సుమారు రూ .10లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకుపోయిన సంఘటన కలకలం రేపింది. కొంతకాలం క్రితం చౌత్రా సెంటర్లో కొంత మంది మైనర్ బాలురు, యువకులు కలిసి వృద్ధ దంపతులపై దాడి చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకునిపోయారు. ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నా పోలీసులు నిందితులను పట్టుకోవటంలో పూర్తి వైఫల్యం చెందారనే విమర్శలు ఉన్నాయి. గస్తీ ఏదీ? అన్ని ప్రాంతాల్లో పోలీసు గస్తీ సక్రమంగా ఉండటంలేదనే అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. పాతగుంటూరు యాదవుల బజారులో పోలీసు బీటు సరిగా లేకపోవటంవలనే చోరీలు జరుగుతున్నాయని ఆ ప్రాంతానికి చెందిన విరిశెట్టి సామ్రాజ్యం అనే మహిళ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్‌ముస్తఫా దృష్టికిS తీసుకుని రావటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అలాగే నిందితులను పట్టుకోవడంలో చేస్తున్న తాత్సారంతో పోలీసు శాఖ విమర్శల పాలవుతోంది. బ్రాడీపేటలో వృద్ధుడిపై దాడి కేసులో సీసీ కెమెరాల ఫుటేజీ ఉన్నప్పటీకీ నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలని, ఇలాంటి నేరాలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
అక్రమార్కులపై చర్యలు తప్పవు
* టీడీఆర్ బాండ్లు, సెస్ కుంభకోణాలు నిజమే * అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరుపుతున్నాం * రోడ్ల విస్తరణ పనులు వేగవంతం చేస్తాం * ఎన్నికలు ఎప్పుడొచ్చినా సమర్థంగా నిర్వహిస్తాం సాక్షి, గుంటూరు : నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ విభాగాల్లోని అవినీతి అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని నగర కమిషనర్ ఎస్.నాగలక్ష్మి స్పష్టం చేశారు. రోడ్ల విస్తరణలో భాగంగా జారీ చేసిన టీడీఆర్ బాండ్లులో అవకతవకలు, అభివృద్ధి పనుల్లో ఇంజనీరింగ్ అధికారుల కమీషన్ల కక్కుర్తిపై తమకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందాయని, వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని నగర కమిషనర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. టీడీఆర్ బాండ్లలో అక్రమాలు... రోడ్ల విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు జారీ చేశామని, అయితే వీటిలో కొన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆడిట్ అధికారులు నివేదిక సమర్పించారని కమిషనర్ చెప్పారు. అదేసమయంలో భవన నిర్మాణాలకు సంబంధించిన కార్మిక శాఖకు చెల్లించాల్సిన సెస్ విషయంలో నకిలీ చెక్కులు జమచేశారని, దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని వివరించారు. వారికి స్థానచలనం తప్పదు... కొంతమంది అధికారులు పాలనాపరమైన అంశాల్లో విఫలమయ్యారని, వారికి స్థానచలనం తప్పదని కమిషనర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టిపెట్టామని, ఇందులో భాగంగా ప్రధాన డివైడర్లలో గ్రీనరీ, పోస్టర్ రహిత నగరంగా చేసేందుకు అన్ని ప్రాంతాల్లో వాల్‌పెయింట్లు వేస్తున్నామని వివరించారు. నగరంలో కొత్తగా కొరిటెపాడు, జేకేసీ కళాశాల, లాల్పురం, యాదవబజార్, నందివెలుగు రోడ్ల విస్తరణ చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో మాస్టర్‌ప్లాన్ ప్రకారం అన్ని రోడ్లను విస్తరిస్తామన్నారు. ఈ పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. డ్రైనేజీ పనులు త్వరలో ప్రారంభం.. నగరంలో రూ.903 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు కమిషనర్ చెప్పారు. ఈ పనులను పబ్లిక్‌హెల్త్ విభాగం పర్యవేక్షిస్తుందని, అయితే క్షేత్రస్థాయిలో పనులను కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు సమన్వయం చేసుకుంటారని చెప్పారు. మూడు సంవత్సరాల్లో పనులు పూర్తిచేయాలని అగ్రిమెంట్ ఉన్నందున వేగంగా పనులు చేసేలా పబ్లిక్‌హెల్త్ అ«ధికారులు, కాంట్రాక్టరుతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు. నగరపాలకSసంస్థ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సమర్థవంతంగా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నగరపాలక సంస్థలో లాలుపురం, తురకపాలెం, ఓబుల్‌నాయుడుపాలెం, చల్లావారిపాలెం గ్రామాల్లోని కొన్ని సర్వేలు కలిశాయని, వాటిని తొలగించాలని ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. కొంతమంది ఓట్లు తొలగించినట్లు వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు. మరికొద్దిరోజుల్లోనే ఎన్నికల కమిషన్ నుంచి ఓటర్ల తుది జాబితా అందుతుందని, తర్వాత ఎక్కడైనా ఓట్లు తొలగించినట్లు తెలిస్తే బూత్‌లెవల్ అధికారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నగరాభివృద్ధికి అధికారులతో కలిసి కృషిచేస్తామన్నారు. -
గుంటూరులో గూండాలు
* జోరుగా ప్రైవేటు పంచాయితీలు * నగరంపై రౌడీలు, గూండాల మార్కు దందా * నీటిపై రాతలుగానే పోలీసుల మాటలు నగరంలో రౌడీలు, గూండాల మూకలు చెలరేగిపోతున్నాయి. భూ దందాలు, సెటిల్మెంట్స్, పంచాయితీలు, ఆస్తి గొడవల్లో తలదూర్చి వీరి మార్కు దందా చూపిస్తున్నారు. నగరంలోని దాదాపు అన్ని ఏరియాల్లో చోటామోటా మొదలుకొని పెద్ద స్థాయి వరకూ రౌడీలు, గూండాలు రాజ్యమేలుతున్నారు. కిరాయి హత్యలకు పాల్పడే వారు సైతం నగరంలోనే మకాం వేసి ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుంటూరు (పట్నంబజారు): నగరంలోని పట్టాభిపురం, అరండల్‌పేట, నగరంపాలెం, కొత్తపేట, లాలాపేట, పాతగంటూరు, రూరల్ పోలీసుస్టేషన్లలో కలిసి 300 మందికి పైగా రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో ఏ ప్లస్, ఏ, బీ, సీ కేటగిరీలకు చెందిన వారున్నారు. ఇటీవల కాలంలో రౌడీల దందా పెరిగిపోయింది. చిన్న స్థాయి పంచాయితీల దగ్గర నుంచి స్టేషన్ ఉన్నతాధికారుల వద్ద కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొందరు రౌడీషీటర్లుకు అధికారపార్టీ నేతల అండదండలుండటంతో పోలీసులు సైతం ఏమిచేయలేని పరిస్థితి దాపురించింది. దీనితో రౌడీలు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోందని పలువురు అంటున్నారు. ఇటీవల కాలంలో నగరంలో వరుసగా చోసుచేసుకుంటున్న ఘటనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పోలీసు నిఘా ఏదీ...? రౌడీషీటర్లుపై పోలీసుల నిఘా పూర్తిగా కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పలువురు అధికారులు యాంటీ రౌడీ స్వా్కడ్ (ఏఆర్ఎస్)తో ఎప్పటికప్పుడు రౌడీల కదలికలపై దృష్టి సారించేవారు. ప్రస్తుతం అటువంటి ప్రత్యేక బృందం లేదని తెలుస్తోంది. నగరంలోని శివారు కాలనీలు స్థావరాలుగా చేసుకుని కొందరు రౌడీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. గుంటూరులో రైల్వేస్టేషన్, బస్టాండ్ల వద్ద అర్ధరాత్రి కూడా అరాచకాలు సృష్టిస్తున్నారు. ఏదైమైనా పోలీసు ఉన్నతాధికారులు రౌడీల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సెలింగ్ డల్..... ఆయా స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లుకు ప్రతి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించటంతో పాటు వారి సంతకాలు సైతం తీసుకోవాల్సి ఉంటుంది. స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్‌లు ఇవ్వటంలేదని తెలుస్తోంది. ప్రతి ఆదివారం స్టేషన్‌కు రాకుండా.. సిబ్బందికి కాసులు చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని స్టేషన్లలో నేరుగా సిబ్బందే రౌడీలకు సమాచారాన్ని అందజేస్తున్నారు. ఈస్ట్ సబ్‌డివిజన్ పరిధిలోని ఒక పోలీసుస్టేషన్లో ప్రతి ఆదివారం రౌడీషీటర్లు సంతకాలు తీసుకుని రైటర్ డబ్బులివ్వాలని, లేకపోతే మాంసం తెచ్చిపెట్టాలంటూ ప్రతి వారం ఇబ్బందులకు గురి చేయటంతో నేరుగా స్టేషన్ ఉన్నతాధికారికే ఫిర్యాదు చేయటం గమనార్హం. రౌడీయిజాన్ని సహించం.. నగరంలో రౌడీకార్యకలాపాలు సాగిస్తే ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించం. వారి కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నాం. అసాంఘిక పనులు, దౌర్జన్యాలు చేస్తే చర్యలు చేపడతాం. పోలీసు స్టేషన్లలో ప్రతి వారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. సత్ప్రవర్తన లేకపోతే రౌడీషీటర్లను తీవ్రంగా పరిగణిస్తాం. – భాస్కరరావు, అడిషనల్ ఎస్పీ -
అంతా దైన్యం.. అభివృద్ధి శూన్యం
* అస్తవ్యస్తంగా రోడ్లు.. డ్రైనేజీ వ్యవస్థ * సక్రమంగా అందని సాగునీరు * అడుగడుగునా ట్రాఫిక్ కష్టాలు * సమస్యల వలయంలో గుంటూరు నగరం * పాలకవర్గం లేకపోవడంతో టీడీపీ నేతల ఇష్టారాజ్యం సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆధిపత్య రాజకీయాల కోసం నగర ప్రజల జీవితాలను ఫణంగా పెడుతున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే రాజకీయ వ్యూహంలో భాగంగా ఐదు నెలలకో కమిషనర్‌ను బదిలీ చేయిస్తూ వచ్చారు. కొత్త కమిషనర్‌కు నగరంపై పూర్తి అవగాహన రావాలంటే కనీసం నాలుగైదు నెలలైనా పడుతుంది. అవగాహన వచ్చేలోపు వారిని ఇక్కడి నుంచి బదిలీ చేసి పంపివేస్తుండడం నగర ప్రజలకు శాపంగా మారింది. గతంలో ఇక్కడ పనిచేసిన కన్నబాబు, అనురాధలు నగరాభివృద్ధిపై దృష్టి సారించి పాలనను గాడిలో పెడుతున్నారన్న సమయంలో బదిలీ కావడం ఎక్కడి ప్రతిపాదనలు అక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుత కమిషనర్ నాగలక్ష్మి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు, పుష్కరనగర్ ఏర్పాటు బాధ్యతల్లో మునిగి తేలుతున్నారు. దీంతో రెండు, మూడు నెలల సమయం వృథాగా పోయింది. ఆమె పాలనపై పట్టుసాధిస్తున్న తరుణంలో కార్పొరేషన్ ఎన్నికల వేడి మొదలవడంతో మళ్లీ అధికార పార్టీ నేతల జోక్యం పెరిగిపోయింది. ఇబ్బడిముబ్బడిగా సమస్యలు.. నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. సక్రమంగా లేని రోడ్లు.. అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ.. పారిశుద్ధ్య సమస్య.. తాగునీరందక ఇక్కట్లు. ఇలా చెప్పుకొంటూపోతే జాబితా చాంతాడంత ఉంటుంది. ఈ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి పది రోజుల కిందట టెండర్లు పిలిచారు. నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తిచేయాలనే నిబంధన పెట్టారు. ఇది మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా విలీన గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపట్టకపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉందని నగర ప్రజలు భావిస్తున్నారు. రాజధాని నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించేందుకు పోలీస్ అధికారులు గత కమిషనర్ల నుంచి ఇప్పటివరకూ అందరితో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇది కార్యరూపం దాల్చకపోవడంతో నగర ప్రజలు ట్రాఫిక్ చక్రబంధంలో నిత్యం అల్లాడుతున్నారు. ఎన్నికల కోసం తమ్ముళ్ల రాజకీయ డ్రామా.. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నగరాభివృద్ధి ఏమాత్రం జరగకపోవడం, సంక్షేమ పథకాల అమల్లోనూ నిర్లక్ష్యం వహించడంతో నగర ప్రజలు అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీన్ని గుర్తించిన ఆ నేతలు ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఏవో అద్భుతాలు జరగబోతున్నట్లు ప్రజలను నమ్మించి ఓట్ల కోసం వెళ్లాలనే వ్యూహరచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నగరంలో నాలుగు ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణం, అనేక ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో ఒకట్రెండు పనులకు శంకుస్థాపన చేసి ప్రజలను మభ్యపెట్టే కుట్రకు తెరతీయనున్నారు. -
ఈ–టాయిలెట్లు వచ్చేశాయ్..
* స్వచ్ఛ గుంటూరులో భాగంగా ఏర్పాటు * కాయిన్ వేస్తే డోర్ తెరుచుకుంటుంది... గుంటూరు (నెహ్రూనగర్): స్వచ్ఛ భారత్, స్వచ్ఛ గుంటూరు కార్యక్రమంలో భాగంగా నగరాన్ని స్మార్ట్ సీటీగా తీర్చిదిద్దేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ఈ (ఎలక్ట్రానిక్) టాయిటెట్లు ఏర్పాటు చేసింది. నగరంలో పలు చోట్ల నగరపాలక సంస్థ టాయిలెట్లు సౌకర్యవంతంగా లేకపోవడం, నిర్వహణ అంతంత మాత్రంగా ఉండటంతో నగర ప్రజలకు కొత్త రకం టాయిలెట్లను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. రూ.40 లక్షలతో ఏర్పాటు.. ఈ టాయిలెట్లను కే రళకు చెందిన ఈ– రామ్ సైంటిఫిక్ కంపెనీ తయారు చేసింది. ఒక్కొక్క దానికి రూ.8 లక్షల చొప్పున ఖర్చు చేసి 5 ప్రాంతాల్లో రూ. 40 లక్షలతోఈ టాయిలెట్లను కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ప్రధాన కూడళ్ళ వద్ద ఏర్పాటు.. జనం రద్దీగా ఉండే ప్రాంతాలైన పల్నాడు బస్టాండ్, కొల్లిశారదా మార్కెట్, గుజ్జనగుండ్ల, అరండల్‌పేట, నగరపాలక సంస్థ ప్రాంతంలో ఏర్పాటు చే శారు. ఇప్పటికే గుజ్జనగుండ్ల, అరండల్‌పేట, నగరపాలక సంస్థ తదితర ప్రాంతాల్లో ఈ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేశారు. కొల్లిశారదా మార్కెట్, పల్నాడు బస్టాండ్ల వద్ద నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా కొద్ది కాలంలోనే వీటిని వినియోగంలోకి తీసుకురానున్నట్లు నగరపాలక సంస్థ అ«ధికారులు చెబుతున్నారు. బాక్టీరియా క్రిములతో.. ఈ టాయిలెట్ల ద్వారా సెప్టిక్ ట్యాంక్‌లోకి వచ్చిన వ్యర్థాలను బయటికి తరలించే శ్రమ ఉండదు. సెప్టిక్ ట్యాంక్‌లో బ్యాక్టీరియా క్రిములు వేయడంతో వ్యర్థాలను ఈ క్రిములు తినివేస్తాయి. చివరికి నీరు మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ నీరు కూడా టాయిలెట్ల పక్కనే ఏర్పాటు చేసిన ఇంకుడుగుంతలోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. నగరంలో ప్రజల నుంచి ఆదరణ వస్తే మరిన్ని టాయిలెట్లను అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలియజేశారు. పనిచేస్తుందిలా.. ఈ టాయిలెట్లను రూ.1, 2, 5 కాయిన్లు వేసి ఉపయోగించాల్సి ఉంటుంది. వినియోగించేవారు ముందుగా ఆకుపచ్చ రంగు వెలుగుతున్నప్పుడు ఈ కాయిన్లు వేస్తే ఆటోమేటిక్‌గా డోర్ తెరుచుకుంటుంది. ఒకరికి మాత్రమే వాడుకునే విధంగా దీనిని రూపొందించారు. సెన్సర్ పనిచేసేదిలా... ఈ టాయిలెట్లలో లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్‌గా ఫ్యాన్, లైటు వెలుగుతుంది. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత నీళ్ళు కొట్టే పని లేకుండా సెన్సర్ల సహాయంతో వేస్ట్‌ని నీటితో శుభ్రం చేసుకుంటుంది. లోపల ఉన్న వ్యక్తికి అర్థమయ్యే విధంగా వాయిస్ డైరెక్షన్ కంప్యూటర్ చెబుతుంటుంది. 225 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకును టాయిలెట్ల వద్ద అమర్చారు. నిత్యం నీటి సరఫరా ఉండే విధంగా వీటిని రూపొందించారు. -
వానొచ్చె.. వెతలు తెచ్చె..
-
వాన.. వాన.. వెల్లూవాయె..
-
ఏటా రూ.కోటి ఎగనామం..!
► గుంటూరు నగరపాలక సంస్థఆదాయానికి భారీ గండి ► ప్రైవేట్ వ్యక్తులకు పరిపాలనాచార్జీల వసూలు బాధ్యత ► ఏడాదికి రూ. 3.78 లక్షలచెల్లింపుతో సరిపెడుతున్న వైనం ► బకాయిల సొమ్ము రూ.1.60కోట్లకు సైతం ఎసరు ► అందినకాడికి జేబులునింపుకొంటున్న ఘనులు ► ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కార్పొరేషన్ అధికారులు సాక్షి, గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ అధికారుల పనితీరు...కంచే చేను మేసిన చందంగా ఉంది. కార్పొరేషన్ ఆదాయాన్ని దారి మళ్లించి ప్రైవేట్ వ్యక్తుల జేబులు నింపుతున్నారు. ఫలితంగా ఏటా రూ. కోటికిపైగా ఆదాయానికి గండిపడుతోంది. అలాగే నగరపాలక సంస్థకు రావాల్సిన బకాయిలు రూ. 1.60 కోట్లు సైతం వారికే అప్పగించారు. నగరంలోని వాణిజ్య సముదాయాల నుంచి వచ్చే చెత్త సేకరణకు గత ఏడాది అధికారులు టెండర్లు నిర్వహించారు. దీని కోసం నగరాన్ని మూడు జోన్లుగా విభజించి నెలకు ఒక్కొక్కరు రూ. 10,500 చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. చెత్త సేకరించే ప్రైవేట్ వ్యక్తులు వాణిజ్య సముదాయాలు, టీ షాపులు, టిఫిన్ బండ్ల నుంచి నెలకు రూ.60 వసూలు చేసుకొనేలా గజిట్ రూపొందించారు. అయితే నగరంలోని విద్యాసంస్థల హాస్టళ్లు, ప్రైవేటు వసతి గృహాల నుంచి నగర పాలక సంస్థ ప్రతి సంవత్సరం పరిపాలనా చార్జీలను వసూలు చేస్తోంది. వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల వల్ల కొంత పారిశుధ్య సమస్య ఏర్పడుతుంది. దీనికోసం ప్రతి విద్యార్థి నుంచి రూ. 150 చొప్పున నగరపాలక సంస్థ పరిపాలనా చార్జీలను వసూలు చేస్తుంది. తద్వారా నగర పాలక సంస్థకు ఏటా రూ.కోటికిపైగా ఆదాయం వస్తుంది. అయితే వాణిజ్య సముదాయాలతో పాటు పరిపాలనా చార్జీలను వసూలు చేసుకొనే హక్కును సైతం ప్రైవేటు వ్యక్తులకే అప్పగించారు. అయితే నగరపాలక సంస్థకు మూడు జోన్లకు కలిపి నెలకు రూ. 31,500 చొప్పున ఏడాదికి రూ. 3.78 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. పరిపాలనా చార్జీల పరంగాా నగరపాలక సంస్థకు రావాల్సిన రూ.కోటి ఆదాయం ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి చేరుతుంది. దీంతో పాటు అంతకు ముందు హాస్టళ్ల నుంచి రావాల్సిన రూ. 1.60 కోట్లు బకాయిలను సైతం వదిలేయడంతో ప్రైవేటు వ్యక్తులే వసూలు చేసుకుని భారీగా లబ్ధి పొందుతున్నారు. ఉన్నతాధికారుల ఉదాసీనవైఖరి పరిపాలనా చార్జీల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు ఉన్నతాధికారులకు తెలియంది కాదు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా కమిషనర్ స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బకాయిల సంగతేంటి... పరిపాలనా చార్జీల విషయంలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో కార్పొరేషన్‌కు రావాల్సిన బకాయిలను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. 2011లో రూ.9.90 లక్షలు, 2012లో రూ. 44.27 లక్షలు, 2013లో రూ. 51 లక్షలు, 2014లో రూ. 67.42 లక్షలు బకాయిలు రావాల్సి ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి పరిపాలనా చార్జీలను యూజర్ చార్జీలుగా బదలాయించి ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారు. అయితే వీరు నగరపాలక సంస్థకు ఎంత చెల్లిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. -
దేశం మార్కు బ(ది)లీ !
మాట వినకుంటే బదిలీ. క్లర్క్ అయినా కమిషనర్ అయినా ఒకటే. తమ అడుగులకు మడుగులొత్తే వారైతే చాలు. ముక్కు సూటిగా పనిచేస్తూ గుంటూరు నగరాభివృద్ధి కోసం కృషి చేసే కమిషనర్లంటే కంటగింపు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులపై టీడీపీకి చెందిన ఓ ఎంపీ కన్నెర్ర చేస్తూ రాజ‘కీ’య బదిలీలకు తెరతీస్తున్నారు. ఏడాదిలో గుంటూరు కార్పొరేషన్‌కు ఐదుగురు కమిషనర్లు తొమ్మిది నెలల వ్యవధిలో కన్నబాబు, అనురాధలకు స్థానచలనం ముక్కుసూటిగా పనిచేసే ఉన్నతాధికారులపై అధికారపార్టీ కన్నెర్ర ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సీఎం వద్ద చక్రం తిప్పిన ఓ ఎంపీ..! కమిషనర్ మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ మాజీ కార్పొరేటర్లు ముఖ్యమంత్రి వద్ద తేల్చుకునేందుకు సిద్ధమైన ఓ మంత్రి, ఎమ్మెల్యే గుంటూరు : రాజధాని నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థకు అధిక ప్రాధాన్యం వచ్చింది. దీంతో నగర కమిషనర్‌గా సమర్థంగా పనిచేసే వారిని నియమించాలని మొదట్లో ప్రభుత్వం భావించినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం అడ్డుతగులుతూనే ఉన్నారు. ఇంత పెద్ద నగరాన్ని అభివృద్ధి చేయాలంటే సమర్థుడైన అధికారి కావాలనే ఉద్దేశంతో మొదట విశాఖపట్నం జేసీగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ను నియమించారు. అయితే ఇక్కడకు వచ్చేందుకు ఆయన ఆసక్తి కనబరచలేదు. దీంతో కమిషనర్‌గా ఉన్న నాగవేణిని 2014 డిసెంబర్ 13వ తేదీన బదిలీ చేసి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న శ్రీధర్‌కు ఫుల్ అడిషనల్చార్జి (ఎఫ్ఏసీ) ఇచ్చి ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆయన నలభై రోజులపాటు పనిచేసిన అనంతరం ఈ ఏడాది జనవరి 22న కర్నూలు జేసీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కన్నబాబును నూతన కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన సమర్థంగా పనిచేస్తూ, నగరాభివృద్ధిపై తనదైన ముద్ర వేసుకుంటున్న తరుణంలో ఐదు నెలలకే అంటే జూలై 8న ఎంఏయూడీ డెరైక్టర్‌గా బదిలీ చేశారు. నగర కమిషనర్‌గా మునిసిపల్ రీజినల్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న చల్లా అనురాధను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. అనురాధ సైతం ఈ నాలుగు నెలల కాలంలో పలు అభివృద్ధి పనులు చేయడంతోపాటు, నగరపాలక సంస్థలో అవినీతి, అసమర్థ అధికారులపై ఉక్కుపాదం మోపారు. ముక్కుసూటిగా పనిచేస్తూ అందరి మన్ననలూ పొందగలిగారు. అయితే అధికారపార్టీ ప్రజాప్రతినిధుల మాట వినకపోవడం వారికి కంటగింపుగా మారింది.దీంతో కమిషనర్‌ను బదిలీ చేయించేందుకు టీడీపీ ఎంపీ కొద్ది రోజులుగా సీఎం పేషీలో పావులు కదిపినట్టు సమాచారం. ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుని నిజాయతీని నమ్ముకున్న అధికారుల కంటే తామే గొప్పని నిరూపించగలిగారు. సొంతపార్టీ నుంచి వ్యతిరేకత ... కమిషనర్ బదిలీ వ్యవహారం అధికార పార్టీలో అగ్గి రాజేసింది. నగరపాలక సంస్థ వ్యవహారాలు చూస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేకు కూడా తెలియకుండా ఈ బదిలీ జరగడంతో మంత్రి తో కలిసి సీఎం వద్ద తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఐదునెలలు కూడా గడవక ముందే కమిషనర్‌ను మార్చడంపై అధికారపార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. నగరంపై పట్టు సాధిస్తున్న సమయంలో వారిని మార్చడం వల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయనేది వారి వాదన. నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఇలాగైతే తాము ఏ మొహం పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలంటూ వారు ప్రశ్నించినట్లు సమాచారం. ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఈ నగరాభివృద్ధిపై ఎందుకు శ్రద్ధ ఉంటుందంటూ సదరు ఎంపీని ఉద్దేశించి కొందరు మండిపడినట్లు తెలిసింది. మరోవైపు సమర్థత గల కమిషనర్లను బదిలీ చేయడం పట్ల నగర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తపవుతోంది. -
‘గ్రేటర్ గుంటూరు’కు సన్నాహాలు
గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థను గ్రేటర్ గుంటూరుగా మార్చేందుకు పురపాలకశాఖ ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. గతంలోనే గుంటూరు చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేయాలనే ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. నగరానికి చుట్టూ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలన్నింటినీ కలుపుకొని గుడ్లుక్తో గ్రేటర్ గుంటూరుగా మార్చడానికి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే, కృష్టాజిల్లాను మినహాయించి గుంటూరు జిల్లాలో సీఆర్డీఏ పరిధి మొత్తాన్ని కలిపి ‘గ్రేటర్ గుంటూరు’గా మార్చాలా, లేక చుట్టుపక్కల ప్రాంతాలను మాత్రం విలీనం చేయాలా అనే దానిపై ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. వాస్తవానికి 2005లో ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపాదనలు ఆచరణలోకి రాలేదు. అయితే, 2011లో గుంటూరు రూరల్ మండలం పరిధిలోని నల్లపాడు, పెదపలకలూరు, అంకిరెడ్డిపాలెం మిగిలిన భాగం, అడవితక్కెళ్లపాడు, గోరంట్ల, పొత్తూరు, చౌడవరం, ఏటుకూరు మిగిలిన భాగం, బుడంపాడు మిగిలిన భాగం, రెడ్డిపాలెం గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేసి మిగిలిన గ్రామాలను వదిలేశారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో లాలిపురం గ్రామం అంశంలో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంలో ఉన్న ప్రభుత్వం ఈ అంశంపై దృష్టిసారించింది. రాష్ట్ర నూతన రాజధాని ప్రాంతంగా ఉన్న గుంటూరును మరింత విస్తరించి గ్రేటర్‌గా రూపొందించేందుకు ప్రతిపాదనలు పంపాలని గత ఏడాది జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆయన కార్పొరేషన్ అధికారులతో చర్చించి గ్రేటర్ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. గ్రేటర్ ఆవిర్భావానికి మార్గం సుగమం 1994లో గుంటూరు.. మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా ఆవిర్భవించింది. విద్యారంగానికి పేరుగాంచిన గుంటూరులో అనేక విద్యాసంస్థలు ఆవిర్భవించటం, నగర శివారుల్లో మిల్లులు, ఇతర చిన్న పరిశ్రమలు రావటంతో సరిహద్దులు గణనీయంగా విస్తరించాయి. దీంతో నగర జనాభా 6.47 లక్షలు దాటింది. అలాగే, పది విలీన గ్రామాలతో కలిపి 7.20 లక్షలకు చేరింది. గుంటూరు నగరంలోని మంగళగిరి, పెదకాకాని, పేరేచర్ల, తాడికొండ, గుంటూరు రూరల్ మండలాలను నగరపాలక సంస్థలో విలీనం చేస్తే జనాభా 15 లక్షలు దాటే అవకాశం ఉంది. దీంతో గ్రేటర్ గుంటూరు ఆవిర్భావం సాధ్యపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్లోకి ఆరుగురు ఎమ్మెల్యేలు గ్రేటర్ గుంటూరు ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే గ్రేటర్ పరిధిలోకి ఐదుగురు ఎమ్మెల్యేలు వస్తారు. మంగళగిరి, పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ పరిధిలోకి రానున్నారు. వీరు నగరపాలక సంస్థలో ఎక్స్‌ఆఫిషియో సభ్యులుగా ఉంటారు. గ్రేటర్ గుంటూరు ఎందుకంటే.. నగర సరిహద్దుల్లోని 15 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రాంతాలను కలుపుకొని విశాఖపట్నం తర్వాత రెండో గ్రేటర్ నగరంగా గుంటూరు అవతరించనుంది. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు పెద్ద మొత్తంలో అందే అవకాశం ఉంది. నగర జనాభా 10 లక్షల పైచిలుకు ఉంటే మురికివాడల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు లభిస్తాయి. అలాగే, నగరంలో పరిశ్రమలు పెరగడం, విమానాశ్రయాలు, స్టేడియంల నిర్మాణం సాధ్యపడే అవకాశం ఉంది. కాగా, గ్రేటర్ గుంటూరు అయితే.. ప్రజలకు పన్నుల వడ్డన కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. -
అభివృద్ధికి విఘాతం
సాక్షి, గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామ పంచాయతీలకు సంబంధించి దాదాపు రూ.10 కోట్లకు పైగా నిధులు ట్రెజరీలో మూలుగుతున్నాయి. వీటి గురించి కార్పొరేషన్ అధికారులు ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫలితంగా ఆయా గ్రామాల్లో అభివృద్ధి సైతం కుంటుపడుతోంది. వివరాల్లోకివెళితే... నగరపాలక సంస్థలో విలీనమైన తరువాత ఆయా పంచాయతీలకు సంబంధించిన అన్ని రకాల నిధులను ట్రెజరీ అధికారులు కార్పొరేషన్‌కు బదిలీ చేయాలి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ట్రెజరీ ప్రధాన కార్యాలయం, సంబంధిత పంచాయతీరాజ్ శాఖ, జిల్లా కలెక్టర్ నుంచి అందాలి. అలా జరిగి ఉంటే ఆ నిధులు ఎప్పడో గ్రామ పంచాయతీల నుంచి కార్పొరేషన్‌కు బదిలీ అయ్యేవి. ఇక్కడ కార్పొరేషన్ అధికారులు సైతం ఆ నిధుల గురించి పట్టించుకోక పోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. ఫలితం గా విలీన గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. జిల్లా పంచాయతీ అధికారి 279 జీవో ప్రకారం విలీనమైన 10 గ్రామ పంచాయతీలకు సంబంధించి కార్పొరేషన్‌కు బదిలీ చేయాల్సిన నిధులు ఎన్ని ఉన్నాయో తెలియజేయాలని ఏటీవో(అసిస్టెంట్ ట్రెజరీ అధికారి)ని కోరారు. ఆ మేరకు 2013 అక్టోబరు 25న నిధుల జాబితాను ట్రెజరీ అధికారులు సిద్ధం చేసి కార్పొరేషన్,పంచాయతీ అధికారులకు పంపారు. ఆ తరువాత ఆ నిధుల గురించి ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ కారణంగా విలీన గ్రామాల్లో ఉద్యోగులకు సైతం మున్సిపల్ సాధారణ నిధుల నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. 2011,12,13 ఆర్థిక సంఘం నిధులతో పాటు పలు రకాల నిధులున్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు రూ. 10 కోట్ల మేర ఉంటాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నిధుల విడుదలకు సంబంధించి కార్పొరేషన్,పంచాయతీ అధికారులు స్పందించి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిధుల విడుదలకు కృషి చేయావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పంచాయతీల సాధారణ నిధులు ఇవే పంచాయతీపేరు నిధులు పంచాయతీపేరు నిధులు (రూ. లక్షల్లో) (రూ. లక్షల్లో) ఆడవి తక్కెళ్లపాడు 28.49 గోరంట్ల 188.00 అంకిరెడ్డిపాలెం 65.10 నల్లపాడు 54.91 బుడంపాడు 15.90 పెదపలకలూరు 52.96 చౌడవరం 11.75 పొత్తూరు 46.34 ఏటుకూరు 62.55 రెడ్డిపాలెం 54.19 -
జీఎంసీకి జరిమానా
భవన నిర్మాణానికి అనుమతులపై హైకోర్టు తీర్పు మూడు వారాల్లో పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశం ఓ భవన నిర్మాణానికి అనుమతిని మంజూరు చేసే విషయంలో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని హైకోర్టు తేల్చింది. ఇందుకు గాను కార్పొరేషన్‌కు రూ.20వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని మూడు వారాల్లో పిటిషనర్లకు చెల్లించాలని కార్పొరేషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. కోర్టు తీర్పుల పట్ల అధికారులు చూపే గౌరవంపైనే న్యాయ పాలన ఆధారపడి ఉందని, కోర్టు తీర్పులను పదే పదే అగౌరవపరిస్తే కఠిన శిక్షలకు గురి కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా జస్టిస్ రామచంద్రరావు తన తీర్పులో అధికారులను హెచ్చరించారు. గుంటూరులోని సంపత్‌నగర్, సర్వే నెంబర్ 673లో డి.అంకిరెడ్డి, ఎం.జానకి 875 చదరపు గజాల స్థలాన్ని సరోజనీదేవి అనే మహిళ నుంచి కొన్నారు. ఆ భూమిలో ఇంటి నిర్మాణం నిమిత్తం దరఖాస్తు చేసుకోగా, ఆ భూమి ప్రజోపయోగం కోసం కేటాయించారంటూ ఇంటి నిర్మాణం కోసం అనుమతినిచ్చేందుకు గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నిరాకరించారు. దీనిని సవాలు చేస్తూ అంకిరెడ్డి, జానకి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ రామచంద్రరావు విచారించారు. సదరు భూమిని ప్రజోపయోగం కేటాయించలేదని, అది సరోజనీదేవి పూర్వీకులకే చెందుతుందంటూ కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు స్పష్టం చేసినా కూడా గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. పిటిషనర్లు సరోజనీదేవి నుంచి కొన్న 875 చదరపు గజాల భూమి ప్రజోపయోగాల కోసం కేటాయించింది కాదని కోర్టులు చెప్పినా పట్టించుకోకుండా, పిటిషనర్ల భవన అనుమతి నిర్మాణ దరఖాస్తును తిరస్కరించడం మునిసిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యానికి నిదర్శమని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. కార్పొరేషన్ పొగరుబోతు వైఖరి, నిర్లక్ష్యపు తీరు కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని తేల్చి చెప్పారు. ఇందుకు గాను కార్పొరేషన్‌కు రూ.20వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని పిటిషనర్లకు మూడు వారాల్లో చెల్లించాలని కార్పొరేషన్‌నున ఆదేశించింది. -
‘పచ్చ'చొక్కాలకు స్థానంపై ఆగ్రహావేశాలు
సాక్షి, గుంటూరు ఫించన్ల మంజూరులో ప్రభుత్వం తెలుగు తమ్ముళ్లలకు కర్ర పెత్తనం ఇవ్వడంపై సర్వతా ఆందోళన వ్యక్తమవుతోంది. సామాజిక కార్యకర్తల పేరుతో అర్హత పరిశీలన కమిటీలో పచ్చచొక్కాలకు స్థానం కల్పించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆసరాలేని అభాగ్యులు, పండుటాకుల నోట్లో మట్టి కొట్టడానికి సర్కారు వేసిన ఎత్తుగడ అని అన్ని వర్గాలు మండి పడుతున్నాయి. అర్హతల పరిశీలన పేరుతో లబ్ధిదారులను భారీగా తగ్గించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోందనే విమర్శలు వినవస్తున్నాయి. ్త జిల్లాలోని 57 మండలాలు, 12 మున్సిపాలిటీలు, గుంటూరు కార్పొరేషన్లో అన్ని రకాల సామాజిక పింఛన్లు కలిపి 3,49,580 ఉన్నాయి. హెచ్ఐవి బాధితుల పింఛన్లు మరో 4,456 ఉన్నాయి. ఈ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నెలకు రూ. 9.12 కోట్లు వెచ్చిస్తోంది. వీటన్నిటికి ఆధార్ సీడింగ్ 96 శాతం మేర పూర్తి చేశారు. మిగిలిన నాలుగు శాతం పింఛన్లలో కోత పడనున్నట్టు తెలుస్తోంది. ్త బోగస్ పింఛన్ల పేరుతో వీలైనన్నింటికి కోత పెట్టేందుకు ప్రభుత్వం రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. ్త అక్టోబరు 2 నుంచి వికలాంగుల పింఛన్లకు సంబంధించి వారి అంగవైకల్యం ఆధారంగా రూ.1200, రూ.1500 పంపిణీ చేస్తారు. మిగిలిన అన్ని పింఛన్లను వెయ్యి రూపాయలకు పెంచారు. పెరిగిన ఫించన్ల ఆధారంగా జిల్లాకు రూ.36.23 కోట్లు కావాలని అంచనా వేశారు. అర్హతల పరిశీలన ప్రారంభం.. జిల్లాలో పింఛన్ల అర్హత కమిటీలు సర్వే ప్రారంభించాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మేట్ కొన్ని మండలాల్లో డౌన్లోడు కాకపోవడంతో ఆయా చోట్ల సర్వే ప్రారంభం కాలేదు. దీంతో 21, 22 తేదీల్లో సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త పింఛన్లకు దరఖాస్తులను ఈ నెల 23న స్వీకరించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 24 మండలాలు, మూడు మున్సిపాలిటీల్లో శుక్రవారమే సర్వే ప్రారంభమైంది. 21 తేదీ వరకు జరుగుతుంది. పింఛన్ల పరిశీలన, కొత్త దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ముఖ్యమంత్రి శనివారం ఉదయం 11 గంటలకు అన్ని మండలాల ఎంపీడీఓలు, ఉన్నతాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. పింఛనుదారుల్లో అందోళన... రకరకాల నిబంధనల పేరుతో తెలుగు తమ్ముళ్లు తమ పేర్లు ఎక్కడ తొలగిస్తారోనని పండుటాకులు వణికిపోతున్నారు. బోగస్ పేరుతో వీలైనంత ఎక్కువ మందిని తొలగించి భారం తగ్గించుకోవడంతో పాటు, పచ్చ చొక్కాలకు పింఛన్లు అందేందుకే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రుణ మాఫీ హామీ అమలులో తాత్సారం చేస్తున్న ప్రభుత్వంపై రైతులు, డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. సామాజిక కార్యకర్తల పేరుతో పార్టీ కార్యకర్తలకు పింఛన్ల అర్హత పరిశీలన కమిటీలో స్థానం కల్పించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల సర్వే పేరుతో గ్రామాల్లోకి వెళితే ప్రజల నుంచి ఆగ్రహం చవిచూడక తప్పదనే ఆందోళన కొన్ని చోట్ల తెలుగు తమ్ముళ్లను పట్టి పీడిస్తోంది. మొత్తంగాతెలుగు దేశం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పింఛన్లపై విచారణ నిర్వహిస్తున్న పంచాయతీ కార్యాలయాల వద్దకు శుక్రవారం లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తెనాలి డివిజన్ కొల్లూరు పంచాయతీ కార్యాలయం వద్దకు వృద్ధులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. -
కమిషనర్ వర్సెస్ ఉద్యోగులు
ఒంగోలు, న్యూస్‌లైన్ : ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ విజయలక్ష్మి-ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. కమిషనర్ వేధింపులు తట్టుకోలేకపోతున్నామంటూ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు, ఉద్యోగులు బుధవారం మూకుమ్మడిగా సెలవుపెట్టి వెళ్లడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే కమిషనర్ తీరుపై అక్కడి అధికారులు, ఉద్యోగులు అనేకసార్లు నిరసన వ్యక్తం చేశారు. తాజాగా టౌన్‌ప్లానింగ్ ఉద్యోగులు మూకుమ్మడిగా సెలవుపెట్టి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని రాతపూర్వకంగా రాసి కమిషనర్‌కు కూడా అందజేశారు. అంతేగాకుండా మున్సిపల్ పరిపాలనాధికారికి కూడా ఫ్యాక్స్ ద్వారా పంపారు. అనంతరం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను కలిసిన టౌన్‌ప్లానింగ్ విభాగం ఉద్యోగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము తీసుకున్న ఈ నిర్ణయానికి నగరపాలక సంస్థ కార్యాలయంలోని అన్ని విభాగాల నుంచి కూడా మద్దతు ఉందని వారు పేర్కొన్నారు. గురువారం ఉదయం సమావేశం నిర్వహించుకుని తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. గతంలో కూడా కమిషనర్ వైఖరికి నిరసనగా కార్యాలయ ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టారని, అయినప్పటికీ ఆమె తీరులో ఏమాత్రం మార్పు రాలేదని అసిస్టెంట్ సిటీ ప్లానర్ చంద్రబోస్ ఈ సందర్భంగా వెల్లడించారు. దీనిపై తామంతా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యాలయంలో కమిషనర్ తీరుతో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దీనిపై విచారణ చేపట్టాలని ఆ కమిషన్‌ను కోరతామన్నారు. ఒంగోలు నగర అభివృద్ధికి సంబంధించి కమిషనర్ నుంచి తమకు ఎటువంటి సహకారం ఉండటం లేదన్నారు. అంతేగాకుండా ఉద్యోగులను కించపరుస్తూ ఆమె మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో దాదాపు 55 వేల వరకు నిర్మాణాలుండగా, వాటిలో 1978కి ముందుగా..అంటే మాస్టర్ ప్లాన్ రాకపూర్వం జరిగిన నిర్మాణాలు కూడా ఉన్నాయని తెలిపారు. కానీ, అవి ప్లాన్ ప్రకారం లేవంటూ కమిషనర్ తమను బాధ్యులను చేస్తూ మెమోలు జారీ చేసి వేధిస్తున్నారని ఆయన వివరించారు. నగరంలో 10 ట్రాఫిక్ జంక్షన్లను గుర్తించి బీవోటీ పద్ధతిలో వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయిస్తే కమిషనర్ అడ్డుపడుతున్నారని తెలిపారు. కార్పొరేషన్‌కు చెందిన ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు దృష్టిసారిస్తే..దాన్ని కూడా కమిషనర్ అడ్డుకుంటున్నారని చెప్పారు. ఏ కారణంగా లేకుండానే ఇలాంటి అనేక అభివృద్ధి పనులకు కమిషనర్ బ్రేకులు వేస్తూ తమను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని అసిస్టెంట్ సిటీ ప్లానర్ చంద్రబోస్ వివరించారు. వాటన్నింటినీ ఉన్నతాధికారులకు వివరించి ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరతామని ఆయన పేర్కొన్నారు.