గుంటూరులో గూండాలు
గుంటూరులో గూండాలు
Published Thu, Oct 13 2016 9:01 PM | Last Updated on Tue, Aug 21 2018 3:53 PM
* జోరుగా ప్రైవేటు పంచాయితీలు
* నగరంపై రౌడీలు, గూండాల మార్కు దందా
* నీటిపై రాతలుగానే పోలీసుల మాటలు
నగరంలో రౌడీలు, గూండాల మూకలు చెలరేగిపోతున్నాయి. భూ దందాలు, సెటిల్‌మెంట్స్, పంచాయితీలు, ఆస్తి గొడవల్లో తలదూర్చి వీరి మార్కు దందా చూపిస్తున్నారు. నగరంలోని దాదాపు అన్ని ఏరియాల్లో చోటామోటా మొదలుకొని పెద్ద స్థాయి వరకూ రౌడీలు, గూండాలు రాజ్యమేలుతున్నారు. కిరాయి హత్యలకు పాల్పడే వారు సైతం నగరంలోనే మకాం వేసి ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గుంటూరు (పట్నంబజారు): నగరంలోని పట్టాభిపురం, అరండల్‌పేట, నగరంపాలెం, కొత్తపేట, లాలాపేట, పాతగంటూరు, రూరల్ పోలీసుస్టేషన్‌లలో కలిసి 300 మందికి పైగా రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో ఏ ప్లస్, ఏ, బీ, సీ కేటగిరీలకు చెందిన వారున్నారు. ఇటీవల కాలంలో రౌడీల దందా పెరిగిపోయింది. చిన్న స్థాయి పంచాయితీల దగ్గర నుంచి స్టేషన్ ఉన్నతాధికారుల వద్ద కూర్చుని సెటిల్‌మెంట్‌లు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొందరు రౌడీషీటర్లుకు అధికారపార్టీ నేతల అండదండలుండటంతో పోలీసులు సైతం ఏమిచేయలేని పరిస్థితి దాపురించింది. దీనితో రౌడీలు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోందని పలువురు అంటున్నారు. ఇటీవల కాలంలో నగరంలో వరుసగా చోసుచేసుకుంటున్న ఘటనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
పోలీసు నిఘా ఏదీ...?
రౌడీషీటర్లుపై పోలీసుల నిఘా పూర్తిగా కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పలువురు అధికారులు యాంటీ రౌడీ స్వా్కడ్ (ఏఆర్‌ఎస్)తో ఎప్పటికప్పుడు రౌడీల కదలికలపై దృష్టి సారించేవారు. ప్రస్తుతం అటువంటి ప్రత్యేక బృందం లేదని తెలుస్తోంది. నగరంలోని శివారు కాలనీలు స్థావరాలుగా చేసుకుని కొందరు రౌడీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. గుంటూరులో రైల్వేస్టేషన్, బస్టాండ్‌ల వద్ద అర్ధరాత్రి కూడా అరాచకాలు సృష్టిస్తున్నారు. ఏదైమైనా పోలీసు ఉన్నతాధికారులు రౌడీల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కౌన్సెలింగ్ డల్.....
ఆయా స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లుకు ప్రతి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించటంతో పాటు వారి సంతకాలు సైతం తీసుకోవాల్సి ఉంటుంది. స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్‌లు ఇవ్వటంలేదని తెలుస్తోంది. ప్రతి ఆదివారం స్టేషన్‌కు రాకుండా.. సిబ్బందికి కాసులు చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని స్టేషన్‌లలో నేరుగా సిబ్బందే రౌడీలకు సమాచారాన్ని అందజేస్తున్నారు. ఈస్ట్ సబ్‌డివిజన్ పరిధిలోని ఒక పోలీసుస్టేషన్‌లో ప్రతి ఆదివారం రౌడీషీటర్లు సంతకాలు తీసుకుని రైటర్ డబ్బులివ్వాలని, లేకపోతే మాంసం తెచ్చిపెట్టాలంటూ ప్రతి వారం ఇబ్బందులకు గురి చేయటంతో నేరుగా స్టేషన్ ఉన్నతాధికారికే ఫిర్యాదు చేయటం గమనార్హం.
రౌడీయిజాన్ని సహించం..
నగరంలో రౌడీకార్యకలాపాలు సాగిస్తే ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించం. వారి కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నాం. అసాంఘిక పనులు, దౌర్జన్యాలు చేస్తే చర్యలు చేపడతాం. పోలీసు స్టేషన్‌లలో ప్రతి వారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. సత్‌ప్రవర్తన లేకపోతే రౌడీషీటర్లను తీవ్రంగా పరిగణిస్తాం.
– భాస్కరరావు, అడిషనల్ ఎస్పీ
Advertisement