తల్లికూతుళ్ళు లక్ష్మమ్మ, హరిప్రియ మృతదేహాలు ( ఫైల్)
* కలవరపెడుతున్న వృద్ధుల హత్యలు
* ఒంటరిగా చూసి దాడులు, చోరీలు
* పోలీసుల వైఫల్యంపై సర్వత్రా విమర్శలు
గుంటూరు (పట్నంబజారు): వృద్ధులపై ఇటీవల జరుగుతున్న దాడులు, హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కాలయముడుగా మారుతున్నారు. తల్లి, తండ్రి అనే ప్రేమ లేదు.. బంధువు అనే జాలి లేదు. డబ్బుకోసం మానవత్వాన్ని మరిచి కిరాతకుల్లా వ్యవహరిస్తున్నారు. గుంటూరు నగరంలోని లాలాపేట పోలీసుస్టేçÙన్ పరిధిలో శనివారం రాత్రి ఆలస్యంగా వెలుగుచూసిన తల్లీకూతుళ్ళు బచ్చు లక్ష్మమ్మ (70), హరిప్రియ (50) హత్యలతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. హత్యలు ఆస్తి కోసం జరిగాయా లేక నగదు దోచుకునేందుకా అని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే హత్యలకు మందు తీవ్ర పెనుగులాట చోటు చేసుకున్న ఆనవాళ్ళు కనపడుతున్న నేపథ్యంలో తెలిసిన వారిపనే అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే అక్టోబర్ 5వ తేదీన పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగి షేక్ ఖాశీం (65), మీరాబీ (60)లను కన్నకూతురే ఆస్తి కోసం తన భర్తతో కలిసి హత్య చేయటం సంచలనం రేకెత్తించింది. ఇటువంటి ఘటనలు గతంలో సైతం అనేకం జరిగిన సందర్భాలు ఉన్నాయి. చిలుకలూరి పేట హైవే రోడ్డులో సిక్కు దంపతులను డబ్బు కోసం అత్యంత కిరాతకంగా చంపేశారు. వారు నివాసం ఉండే హోటల్లోనే ఘటన జరిగింది. ఇప్పటి వరకు ఆ కేసులో నిందితులను పట్టుకోవటంలో పోలీసులు పూర్తి వైఫల్యం చెందారనే విమర్శలున్నాయి.
బెంబేలెత్తిస్తున్న దాడులు..
నివాసాల్లో ఒంటరిగా ఉన్న వృద్ధులపై జరుగుతున్న దాడులు బెంబేలెత్తిస్తున్నాయి. బ్రాడీపేటలో ఉండే పాగోలు నరసింహరావు అనే 75 సంత్సరాల వృద్ధుడిని ఒక యువకుడు కత్తితో బెదిరించి చేతికి ఉన్న బ్రాస్‌లెట్, మెడలోని గొలుసు అపహరించుకుపోయాడు. రామన్న పేటలో ఒక వృద్ధురాలిపై గుర్తుతెలియని యువకుడు దాడి చేసి నగదు, బంగారాన్ని దోచుకుపోయాడు. గోరంట్లలోని తూర్పు వీధిలో వృద్ధుడిపై దాడి చేసి సుమారు రూ .10లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకుపోయిన సంఘటన కలకలం రేపింది. కొంతకాలం క్రితం చౌత్రా సెంటర్‌లో కొంత మంది మైనర్ బాలురు, యువకులు కలిసి వృద్ధ దంపతులపై దాడి చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకునిపోయారు. ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నా పోలీసులు నిందితులను పట్టుకోవటంలో పూర్తి వైఫల్యం చెందారనే విమర్శలు ఉన్నాయి.
గస్తీ ఏదీ?
అన్ని ప్రాంతాల్లో పోలీసు గస్తీ సక్రమంగా ఉండటంలేదనే అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. పాతగుంటూరు యాదవుల బజారులో పోలీసు బీటు సరిగా లేకపోవటంవలనే చోరీలు జరుగుతున్నాయని ఆ ప్రాంతానికి చెందిన విరిశెట్టి సామ్రాజ్యం అనే మహిళ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్‌ముస్తఫా దృష్టికిS తీసుకుని రావటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అలాగే నిందితులను పట్టుకోవడంలో చేస్తున్న తాత్సారంతో పోలీసు శాఖ విమర్శల పాలవుతోంది. బ్రాడీపేటలో వృద్ధుడిపై దాడి కేసులో సీసీ కెమెరాల ఫుటేజీ ఉన్నప్పటీకీ నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలని, ఇలాంటి నేరాలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.