జిల్లాలో పెరిగిన నేరాలు-ఘోరాలు
నెల్లూరు(క్రైమ్) : మాయమైపోతున్నడమ్మా..మనిషన్నవాడూ..మచ్చుకైన కానరాడే మానవత్వమున్నవాడూ..అని ఒక సినీ కవి రచించిన గేయం జిల్లాలో అక్షర సత్యంగా మారింది. కొద్ది నెలలుగా జిల్లాలో సంఘటనలను చూస్తే మానవత్వం మరుగునపడి కిరాతకం పైచేయి సాధిస్తున్నట్లుంది. ప్రశాంతతకు మారుపేరైన సింహపురి హింసపురిగా మారిపోయింది. ఆస్తి కోసం కడుపున పుట్టిన వారే తల్లిదండ్రులను హతమారుస్తున్నారు. స్నేహం ముసుగులో డబ్బుకోసం కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. దాంపత్య బంధానికి విలువ లేకుండా పోయింది. మహిళలకు ఇంటా బయట రక్షణ కొరవడింది. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుటుంబసభ్యులే ఘాతుకాలకు పాల్పడుతున్నారు.
ఇటీవల జరిగిన సంఘటనలు
► గతేడాది డిసెంబర్‌లో ప్రముఖ న్యాయవాది నరేంద్రయాదవ్ ఆస్తి వివాదం నేపథ్యంలో కిరాతకంగా హత్యకు గురయ్యారు.
► ఫిబ్రవరి 10న సైదాపురం మండలంలో రోజా అనే యువతిపై లైంగికదాడి చేసి గొంతుకోసి హతమార్చారు.
► ఫిబ్రవరి 11న నాయుడుపేట స్వర్ణముఖి నది తీరంలో పాతకక్షలతో ఓ యువకుడ్ని హత్యచేసి పెట్రోల్‌పోసి తగలబెట్టారు.
► ఫిబ్రవరి 21న పెళ్లకూరు మండలంలో మరో మహిళ మోజులో పడి భార్య రత్నమ్మను హత్య చేశాడు.
► ఏప్రిల్ 20న బిట్రగుంట సమీపంలో మహాలక్ష్మమ్మ అనే వృద్ధురాలిపై శ్రీనివాసులు అనే యువకుడు లైంగికదాడి చేశాడు.
► ఏప్రిల్ 5న ఆస్తి కోసం చాకలివీధిలో హనుమాయమ్మ అనే వృద్ధురాలిని మిద్దెపై నుంచి కోడలు తోసేసింది.
► ఏప్రిల్ 14న నగదు కోసం కిసాన్‌నగర్‌లో ప్రియురాలు నాగలక్ష్మిని ప్రియుడు పెంచలయ్య దారుణంగా హత్య చేశాడు.
► ఇటీవల బత్తిబాబు అనే యువకుడ్ని అతని స్నేహితులు నమ్మకంగా తమ వెంట తీసుకెళ్లి డబ్బుల కోసం దారుణంగా హతమార్చారు.
► మే 11న కొడవలూరు మండలం గుండాలమ్మపాలెంలో ఆస్తి పంపకాల్లో తేడాలు రావడంతో బీ నాగరాజును అతని అన్న సుబ్రమణ్యం దారుణంగా హత్య చేశాడు.
► మే 14న వెంకటాచలం మండలంలో కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే 14 ఏళ్ల కుమార్తెపై లైంగికదాడికి యత్నించాడు.
► మే 25న 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి వరసకు సోదరుడైన వెంకటేశ్వర్లు, ఆటోడ్రైవర్ విష్ణు లైంగికదాడి చేసి హత్య చేయబోయారు.
► మే 27న ఆస్తి కోసం ప్రముఖ వైద్యుడు విజయకుమార్‌ను ఆయన భార్య ఉషారాణి, కుమారుడు సుందరయ్య మరో ఇద్దరితో కలిసి దారుణంగా హత్య చేశారు.
మంటగలుస్తోన్న మానవత్వం
Published Fri, Jun 12 2015 4:06 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM
Advertisement
Advertisement