కుళ్లిపోయిన స్థితిలో వ్యాపారి మృతదేహం లభ్యం
స్నేహితుడే హంతకుడాఅనే కోణంలో దర్యాప్తు
పంజగుట్ట: పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వ్యక్తి ఎస్సార్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉండే విష్ణు రూపాని (45) కిరాణా అండ్ జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. గత నెల 29వ తేదీన రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో షాపు మూసేసి కొద్దిసేపట్లో వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన విష్ణు రూపాని తిరిగి రాలేదు.
దీంతో అతని కుటుంబ సభ్యులు 30వ తేదీన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా బుధవారం సాయంత్రం ఎస్సార్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుద్ధానగర్‌లో ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి చూడగా ఓ యువకుడు మృతి చెంది ఉన్నాడు. అతన్ని పరిశీలించగా గత నెల 29న మిస్సయిన విష్ణు రూపానిగా గుర్తించారు. మృతి చెందిన గదిలో మద్యం తాగిన ఆనవాళ్లు ఉన్నట్లు సమాచారం.
సదరు గదిలో ఉండే విష్ణు స్నేహితుడు కనిపించకుండా పోయాడని, దీంతో అతనే హత్య చేశాడా అన్న కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేసున్నారు. 29వ తేదీన రాత్రి విష్ణు, అతని స్నేహితుడు యాక్టివా ద్విచక్రవాహనంపై వెళ్లిన సీసీ పుటేజీలు పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. విష్ణు ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం హత్యకు గురయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో శరీరంపై గాయాలు సరిగ్గా కనిపించడంలేదని, పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment