సాక్షి, గుంటూరు: నగరపాలక సంస్థలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించి అవసరమైన రికార్డులను తారుమారు చేయటం ద్వారా రికార్డు రూం సిబ్బంది భారీ అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రికార్డు రూమ్‌లో పనిచేసే కొందరు ఉద్యోగులు, దళారులు కలసి భారీ స్థాయిలో అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. ఇటీవల జరిగిన ఆడిట్ తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడినట్లు చెబుతున్నారు.
ఇదీ సంగతి..
నగరపాలక సంస్థ పరిధిలో నూతన భవన నిర్మాణానికి ప్లాన్ అనుమతికి బిల్డింగ్ ప్లాను చార్జీలతో ఓపెన్ స్పెస్ కాస్ట్ కింద డెవలప్‌మెంట్ చార్జీలు చెల్లించాల్సి ఉంది. స్థలం కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ ధరపై 14 శాతం డెవలప్‌మెంట్ చార్జీలు చెల్లించాలి. అయితే ఆ స్థలంలో గతంలో ఉన్న ఇంటికి 1985 నుంచే పన్ను చెల్లింస్తుంటే డెవలప్‌మెంట్ చార్జీలకు మినహాయింపు ఇవ్వాలని పురపాలకశాఖ ఉత్తర్వుల్లో ఉంది. ఇది జరగాలంటే 1985కు ముందునుంచే పన్ను విధించినట్లు ధ్రువీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. దీనికోసం పౌరసేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకొని ఇంటి అసెస్‌మెంట్ నంబర్‌కు డిమాండ్ అబ్‌స్ట్రాక్ట్ సర్టిఫికెట్‌ను రికార్డురూం ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. గత ఐదేళ్లుగా వాణిజ్య, నివాస స్థలాల ధరలు విపరీతంగా పెరిగాయి. డెవలప్‌మెంట్ చార్జీల రూపంలో కార్పొరేషన్‌కు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రికార్డు రూం సిబ్బంది మాత్రం 1985కు ముందు పన్నులు లేకపోయినా ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం అందించటానికి లక్షల్లో బేరాలు కుదుర్చుకొని అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. అంతేకాకుండా రికార్డుల ప్రకారం పన్నులు ఉన్నవారికి సైతం పత్రాలు ఇవ్వటానికి ముడుపులు బాగానే వసూళు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆడిట్‌లో దొరికారు..
నగరపాలక సంస్థలో టౌన్‌ప్లానింగ్ విభాగంలో 2016–17కు సంబంధించి జరుగుతున్న ఆడిట్‌లో 14 శాతం పన్ను మినహాయింపుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అసలు 1985కి ముందు నగరంలో ఉన్న నిర్మాణాలు, అప్పుడు పన్నులు కట్టినవాటి సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం మినహాంపు పొందిన అసెస్‌మెంట్‌లకు మధ్య భారీ తేడాను గుర్తించినట్లు సమాచారం. అవినీతికి ప్రధాన కారణం రికార్డుల విభాగంలోని కొందరు ఉద్యోగులేనని ఆరోపణలు రావటంతో అక్కడ విధులు నిర్వర్తిసున్న రికార్డు రూం ఇన్‌చార్జి శరత్‌బాబును కమిషనర్ వేరే విభాగానికి బదిలీ చేశారు. అయితే సదరు వ్యక్తి రికార్డురూంలో విధులు కేటాయిస్తేనే చేస్తానంటూ సెలవుపై వెళ్లిపోయారు. ఇదే సమయంలో నిబంధనల ప్రకారం 1985కు పూర్వమే పన్ను చెల్లిస్తున్నప్పటికీ ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు రికార్డురూం సిబ్బందిపై నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధకు ఆధారాలతో సహా ఫిర్యాదు అందింది. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలటంతో రెవెన్యూ విభాగంలో బిల్‌కలెక్టర్ హోదాలో డిప్యూటేషన్‌పై రికార్డు రూం అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వి.పాండురంగారావును సస్పెండ్ చేస్తూ కమిషనర్ గురవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సైతం సమాయత్తమవుతున్నట్లు సమాచారం.
ఎవరినీ వదిలిపెట్టం..
రికార్డు రూమ్‌లో జరిగిన అవకతవకలకు సంబంధించి పూర్తి విచారణ జరుపుతాం. నగరపాలక సంస్థ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందో చూసి బాధ్యుల నుంచి మొత్తం రాబడతాం. ఇందులో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినినీ వదిలేది లేదు. – చల్లా అనూరాధ, నగరపాలక సంస్థ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment