అక్రమార్కులపై చర్యలు తప్పవు
అక్రమార్కులపై చర్యలు తప్పవు
Published Fri, Oct 14 2016 4:38 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
* టీడీఆర్ బాండ్లు, సెస్ కుంభకోణాలు నిజమే
* అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరుపుతున్నాం
* రోడ్ల విస్తరణ పనులు వేగవంతం చేస్తాం
* ఎన్నికలు ఎప్పుడొచ్చినా సమర్థంగా నిర్వహిస్తాం
సాక్షి, గుంటూరు : నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ విభాగాల్లోని అవినీతి అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని నగర కమిషనర్ ఎస్.నాగలక్ష్మి స్పష్టం చేశారు. రోడ్ల విస్తరణలో భాగంగా జారీ చేసిన టీడీఆర్ బాండ్లులో అవకతవకలు, అభివృద్ధి పనుల్లో ఇంజనీరింగ్ అధికారుల కమీషన్ల కక్కుర్తిపై తమకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందాయని, వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని నగర కమిషనర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
టీడీఆర్ బాండ్లలో అక్రమాలు...
రోడ్ల విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు జారీ చేశామని, అయితే వీటిలో కొన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆడిట్ అధికారులు నివేదిక సమర్పించారని కమిషనర్ చెప్పారు. అదేసమయంలో భవన నిర్మాణాలకు సంబంధించిన కార్మిక శాఖకు చెల్లించాల్సిన సెస్ విషయంలో నకిలీ చెక్కులు జమచేశారని, దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని వివరించారు.
వారికి స్థానచలనం తప్పదు...
కొంతమంది అధికారులు పాలనాపరమైన అంశాల్లో విఫలమయ్యారని, వారికి స్థానచలనం తప్పదని కమిషనర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టిపెట్టామని, ఇందులో భాగంగా ప్రధాన డివైడర్లలో గ్రీనరీ, పోస్టర్ రహిత నగరంగా చేసేందుకు అన్ని ప్రాంతాల్లో వాల్‌పెయింట్లు వేస్తున్నామని వివరించారు. నగరంలో కొత్తగా కొరిటెపాడు, జేకేసీ కళాశాల, లాల్‌పురం, యాదవబజార్, నందివెలుగు రోడ్ల విస్తరణ చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో మాస్టర్‌ప్లాన్ ప్రకారం అన్ని రోడ్లను విస్తరిస్తామన్నారు. ఈ పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు.
డ్రైనేజీ పనులు త్వరలో ప్రారంభం..
నగరంలో రూ.903 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు కమిషనర్ చెప్పారు. ఈ పనులను పబ్లిక్‌హెల్త్ విభాగం పర్యవేక్షిస్తుందని, అయితే క్షేత్రస్థాయిలో పనులను కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు సమన్వయం చేసుకుంటారని చెప్పారు. మూడు సంవత్సరాల్లో పనులు పూర్తిచేయాలని అగ్రిమెంట్ ఉన్నందున వేగంగా పనులు చేసేలా పబ్లిక్‌హెల్త్ అ«ధికారులు, కాంట్రాక్టరుతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు. నగరపాలకSసంస్థ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సమర్థవంతంగా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నగరపాలక సంస్థలో లాలుపురం, తురకపాలెం, ఓబుల్‌నాయుడుపాలెం, చల్లావారిపాలెం గ్రామాల్లోని కొన్ని సర్వేలు కలిశాయని, వాటిని తొలగించాలని ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. కొంతమంది ఓట్లు తొలగించినట్లు వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు. మరికొద్దిరోజుల్లోనే ఎన్నికల కమిషన్ నుంచి ఓటర్ల తుది జాబితా అందుతుందని, తర్వాత ఎక్కడైనా ఓట్లు తొలగించినట్లు తెలిస్తే బూత్‌లెవల్ అధికారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నగరాభివృద్ధికి అధికారులతో కలిసి కృషిచేస్తామన్నారు.
Advertisement