దేశం మార్కు బ(ది)లీ !
మాట వినకుంటే బదిలీ. క్లర్క్ అయినా కమిషనర్ అయినా ఒకటే. తమ అడుగులకు మడుగులొత్తే వారైతే చాలు. ముక్కు సూటిగా పనిచేస్తూ గుంటూరు నగరాభివృద్ధి కోసం కృషి చేసే కమిషనర్‌లంటే కంటగింపు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులపై టీడీపీకి చెందిన ఓ ఎంపీ కన్నెర్ర చేస్తూ రాజ‘కీ’య బదిలీలకు తెరతీస్తున్నారు.
- ఏడాదిలో గుంటూరు కార్పొరేషన్‌కు ఐదుగురు కమిషనర్‌లు
- తొమ్మిది నెలల వ్యవధిలో కన్నబాబు, అనురాధలకు స్థానచలనం
- ముక్కుసూటిగా పనిచేసే ఉన్నతాధికారులపై అధికారపార్టీ కన్నెర్ర
- ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సీఎం వద్ద చక్రం తిప్పిన ఓ ఎంపీ..!
- కమిషనర్ మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ మాజీ కార్పొరేటర్లు
- ముఖ్యమంత్రి వద్ద తేల్చుకునేందుకు సిద్ధమైన ఓ మంత్రి, ఎమ్మెల్యే
గుంటూరు : రాజధాని నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థకు అధిక ప్రాధాన్యం వచ్చింది. దీంతో నగర కమిషనర్‌గా సమర్థంగా పనిచేసే వారిని నియమించాలని మొదట్లో ప్రభుత్వం భావించినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం అడ్డుతగులుతూనే ఉన్నారు.
ఇంత పెద్ద నగరాన్ని అభివృద్ధి చేయాలంటే సమర్థుడైన అధికారి కావాలనే ఉద్దేశంతో మొదట విశాఖపట్నం జేసీగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ను నియమించారు. అయితే ఇక్కడకు వచ్చేందుకు ఆయన ఆసక్తి కనబరచలేదు. దీంతో కమిషనర్‌గా ఉన్న నాగవేణిని 2014 డిసెంబర్ 13వ తేదీన బదిలీ చేసి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న శ్రీధర్‌కు ఫుల్ అడిషనల్‌చార్జి (ఎఫ్‌ఏసీ) ఇచ్చి ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆయన నలభై రోజులపాటు పనిచేసిన అనంతరం ఈ ఏడాది జనవరి 22న కర్నూలు జేసీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కన్నబాబును నూతన కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఆయన సమర్థంగా పనిచేస్తూ, నగరాభివృద్ధిపై తనదైన ముద్ర వేసుకుంటున్న తరుణంలో ఐదు నెలలకే అంటే జూలై 8న ఎంఏయూడీ డెరైక్టర్‌గా బదిలీ చేశారు. నగర కమిషనర్‌గా మునిసిపల్ రీజినల్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న చల్లా అనురాధను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.
అనురాధ సైతం ఈ నాలుగు నెలల కాలంలో పలు అభివృద్ధి పనులు చేయడంతోపాటు, నగరపాలక సంస్థలో అవినీతి, అసమర్థ అధికారులపై ఉక్కుపాదం మోపారు. ముక్కుసూటిగా పనిచేస్తూ అందరి మన్ననలూ పొందగలిగారు. అయితే అధికారపార్టీ ప్రజాప్రతినిధుల మాట వినకపోవడం వారికి కంటగింపుగా మారింది.దీంతో కమిషనర్‌ను బదిలీ చేయించేందుకు టీడీపీ ఎంపీ కొద్ది రోజులుగా సీఎం పేషీలో పావులు కదిపినట్టు సమాచారం. ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుని నిజాయతీని నమ్ముకున్న అధికారుల కంటే తామే గొప్పని నిరూపించగలిగారు.
సొంతపార్టీ నుంచి వ్యతిరేకత ...
కమిషనర్ బదిలీ వ్యవహారం అధికార పార్టీలో అగ్గి రాజేసింది. నగరపాలక సంస్థ వ్యవహారాలు చూస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేకు కూడా తెలియకుండా ఈ బదిలీ జరగడంతో మంత్రి తో కలిసి సీఎం వద్ద తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఐదునెలలు కూడా గడవక ముందే కమిషనర్‌ను మార్చడంపై అధికారపార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. నగరంపై పట్టు సాధిస్తున్న సమయంలో వారిని మార్చడం వల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయనేది వారి వాదన.
నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఇలాగైతే తాము ఏ మొహం పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలంటూ వారు ప్రశ్నించినట్లు సమాచారం. ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఈ నగరాభివృద్ధిపై ఎందుకు శ్రద్ధ ఉంటుందంటూ సదరు ఎంపీని ఉద్దేశించి కొందరు మండిపడినట్లు తెలిసింది. మరోవైపు సమర్థత గల కమిషనర్‌లను బదిలీ చేయడం పట్ల నగర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తపవుతోంది.