ఒంగోలు, న్యూస్‌లైన్ : ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ విజయలక్ష్మి-ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. కమిషనర్ వేధింపులు తట్టుకోలేకపోతున్నామంటూ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు, ఉద్యోగులు బుధవారం మూకుమ్మడిగా సెలవుపెట్టి వెళ్లడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే కమిషనర్ తీరుపై అక్కడి అధికారులు, ఉద్యోగులు అనేకసార్లు నిరసన వ్యక్తం చేశారు.
తాజాగా టౌన్‌ప్లానింగ్ ఉద్యోగులు మూకుమ్మడిగా సెలవుపెట్టి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని రాతపూర్వకంగా రాసి కమిషనర్‌కు కూడా అందజేశారు. అంతేగాకుండా మున్సిపల్ పరిపాలనాధికారికి కూడా ఫ్యాక్స్ ద్వారా పంపారు. అనంతరం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను కలిసిన టౌన్‌ప్లానింగ్ విభాగం ఉద్యోగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము తీసుకున్న ఈ నిర్ణయానికి నగరపాలక సంస్థ కార్యాలయంలోని అన్ని విభాగాల నుంచి కూడా మద్దతు ఉందని వారు పేర్కొన్నారు. గురువారం ఉదయం సమావేశం నిర్వహించుకుని తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.
గతంలో కూడా కమిషనర్ వైఖరికి నిరసనగా కార్యాలయ ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టారని, అయినప్పటికీ ఆమె తీరులో ఏమాత్రం మార్పు రాలేదని అసిస్టెంట్ సిటీ ప్లానర్ చంద్రబోస్ ఈ సందర్భంగా వెల్లడించారు. దీనిపై తామంతా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యాలయంలో కమిషనర్ తీరుతో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దీనిపై విచారణ చేపట్టాలని ఆ కమిషన్‌ను కోరతామన్నారు. ఒంగోలు నగర అభివృద్ధికి సంబంధించి కమిషనర్ నుంచి తమకు ఎటువంటి సహకారం ఉండటం లేదన్నారు. అంతేగాకుండా ఉద్యోగులను కించపరుస్తూ ఆమె మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో దాదాపు 55 వేల వరకు నిర్మాణాలుండగా, వాటిలో 1978కి ముందుగా..అంటే మాస్టర్ ప్లాన్ రాకపూర్వం జరిగిన నిర్మాణాలు కూడా ఉన్నాయని తెలిపారు.
కానీ, అవి ప్లాన్ ప్రకారం లేవంటూ కమిషనర్ తమను బాధ్యులను చేస్తూ మెమోలు జారీ చేసి వేధిస్తున్నారని ఆయన వివరించారు. నగరంలో 10 ట్రాఫిక్ జంక్షన్‌లను గుర్తించి బీవోటీ పద్ధతిలో వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయిస్తే కమిషనర్ అడ్డుపడుతున్నారని తెలిపారు. కార్పొరేషన్‌కు చెందిన ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు దృష్టిసారిస్తే..దాన్ని కూడా కమిషనర్ అడ్డుకుంటున్నారని చెప్పారు. ఏ కారణంగా లేకుండానే ఇలాంటి అనేక అభివృద్ధి పనులకు కమిషనర్ బ్రేకులు వేస్తూ తమను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని అసిస్టెంట్ సిటీ ప్లానర్ చంద్రబోస్ వివరించారు. వాటన్నింటినీ ఉన్నతాధికారులకు వివరించి ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరతామని ఆయన పేర్కొన్నారు.
కమిషనర్ వర్సెస్ ఉద్యోగులు
Published Thu, Jun 5 2014 1:08 AM | Last Updated on Tue, Aug 21 2018 3:53 PM
Advertisement
Advertisement