‘పచ్చ'చొక్కాలకు స్థానంపై ఆగ్రహావేశాలు
సాక్షి, గుంటూరు
ఫించన్ల మంజూరులో ప్రభుత్వం తెలుగు తమ్ముళ్లలకు కర్ర పెత్తనం ఇవ్వడంపై సర్వతా ఆందోళన వ్యక్తమవుతోంది. సామాజిక కార్యకర్తల పేరుతో అర్హత పరిశీలన కమిటీలో పచ్చచొక్కాలకు స్థానం కల్పించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆసరాలేని అభాగ్యులు, పండుటాకుల నోట్లో మట్టి కొట్టడానికి సర్కారు వేసిన ఎత్తుగడ అని అన్ని వర్గాలు మండి పడుతున్నాయి. అర్హతల పరిశీలన పేరుతో లబ్ధిదారులను భారీగా తగ్గించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోందనే విమర్శలు వినవస్తున్నాయి.
్త జిల్లాలోని 57 మండలాలు, 12 మున్సిపాలిటీలు, గుంటూరు కార్పొరేషన్‌లో అన్ని రకాల సామాజిక పింఛన్లు కలిపి 3,49,580 ఉన్నాయి. హెచ్‌ఐవి బాధితుల పింఛన్లు మరో 4,456 ఉన్నాయి. ఈ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నెలకు రూ. 9.12 కోట్లు వెచ్చిస్తోంది. వీటన్నిటికి ఆధార్ సీడింగ్ 96 శాతం మేర పూర్తి చేశారు. మిగిలిన నాలుగు శాతం పింఛన్లలో కోత పడనున్నట్టు తెలుస్తోంది.
్త బోగస్ పింఛన్ల పేరుతో వీలైనన్నింటికి కోత పెట్టేందుకు ప్రభుత్వం రకరకాల ఎత్తుగడలు వేస్తోంది.
్త అక్టోబరు 2 నుంచి వికలాంగుల పింఛన్లకు సంబంధించి వారి అంగవైకల్యం ఆధారంగా రూ.1200, రూ.1500 పంపిణీ చేస్తారు. మిగిలిన అన్ని పింఛన్లను వెయ్యి రూపాయలకు పెంచారు.
పెరిగిన ఫించన్ల ఆధారంగా జిల్లాకు రూ.36.23 కోట్లు కావాలని అంచనా వేశారు.
అర్హతల పరిశీలన ప్రారంభం..
జిల్లాలో పింఛన్ల అర్హత కమిటీలు సర్వే ప్రారంభించాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మేట్ కొన్ని మండలాల్లో డౌన్‌లోడు కాకపోవడంతో ఆయా చోట్ల సర్వే ప్రారంభం కాలేదు. దీంతో 21, 22 తేదీల్లో సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త పింఛన్లకు దరఖాస్తులను ఈ నెల 23న స్వీకరించనున్నారు.
జిల్లా వ్యాప్తంగా 24 మండలాలు, మూడు మున్సిపాలిటీల్లో శుక్రవారమే సర్వే ప్రారంభమైంది. 21 తేదీ వరకు జరుగుతుంది.
పింఛన్ల పరిశీలన, కొత్త దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ముఖ్యమంత్రి శనివారం ఉదయం 11 గంటలకు అన్ని మండలాల ఎంపీడీఓలు, ఉన్నతాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
పింఛనుదారుల్లో అందోళన...
రకరకాల నిబంధనల పేరుతో తెలుగు తమ్ముళ్లు తమ పేర్లు ఎక్కడ తొలగిస్తారోనని పండుటాకులు వణికిపోతున్నారు.
బోగస్ పేరుతో వీలైనంత ఎక్కువ మందిని తొలగించి భారం తగ్గించుకోవడంతో పాటు, పచ్చ చొక్కాలకు పింఛన్లు అందేందుకే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రుణ మాఫీ హామీ అమలులో తాత్సారం చేస్తున్న ప్రభుత్వంపై రైతులు, డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు.
సామాజిక కార్యకర్తల పేరుతో పార్టీ కార్యకర్తలకు పింఛన్ల అర్హత పరిశీలన కమిటీలో స్థానం కల్పించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల సర్వే పేరుతో గ్రామాల్లోకి వెళితే ప్రజల నుంచి ఆగ్రహం చవిచూడక తప్పదనే ఆందోళన కొన్ని చోట్ల తెలుగు తమ్ముళ్లను పట్టి పీడిస్తోంది. మొత్తంగాతెలుగు దేశం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
పింఛన్లపై విచారణ నిర్వహిస్తున్న పంచాయతీ కార్యాలయాల వద్దకు శుక్రవారం లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తెనాలి డివిజన్ కొల్లూరు పంచాయతీ కార్యాలయం వద్దకు వృద్ధులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.