దోచుకో..దాచుకో | Curroption In corporation office | Sakshi
Sakshi News home page

దోచుకో..దాచుకో

Published Fri, Mar 9 2018 11:47 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

Curroption In corporation office - Sakshi

కార్పొరేషన్‌ కార్యాలయం

నెల్లూరు సిటీ: కార్పొరేషన్‌లో అధికారులు, సిబ్బంది కుమ్మక్కై గుట్టుచప్పుడుగా దోపిడీ పాలన సాగిస్తున్నారు. భవనాలకు సంబంధించి ఏ అనుమతి కోసమైన కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే పీల్చిపిప్పిచేస్తున్నారు. లెట్రిన్‌సీట్ల కనెక్షన్ల మంజూరుకు సైతం కమర్షియల్‌ భవన యజామానుల నుంచి ఇంజినీరింగ్‌ అధికారులు  భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 54 డివిజన్‌ల ఉన్నాయి. ఇందులో 17 డివిజన్ల పరిధిలోని ప్రధాన ప్రాంతాలు, కమర్షియల్‌ ప్రాంతాల్లో డ్రైనేజీ అసిస్‌మెంట్‌లు ఉన్నాయి. మొత్తం 727 అసిస్‌మెంట్లు ఉండగా ఏటా కార్పొరేషన్‌కు రూ.40లక్షలు పన్నుల రూపంలో ఆదాయం వస్తోంది. డ్రైనేజీ కనెక్షన్‌లు ఇచ్చే సమయంలో ఇంజినీరింగ్‌ అధికారులు..పన్నులు వేసే సమయంలో రెవెన్యూ అధికారులు దోపిడీకి తెరతీస్తున్నారు. ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై  ఏటా సుమారు రూ.2కోట్ల మేర కార్పొరేషన్‌ ఆదాయానికి గండి కొడుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం కార్పొరేషన్‌ పరిధిలో రూ.500కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తున్నారు. అయితే ఇంకా డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి రాలేదు.

డబ్బులు ఇస్తే సరి..లేకపోతే చుక్కలే
కార్పొరేషన్‌ పరిధిలో ఇళ్లు, కాంప్లెక్స్‌లు నిర్మించుకున్న సమయంలో డ్రైనేజీ వ్యవస్థను ఆయా భవన యజమానులు ఏర్పాటు చేసుకోవాలి. కార్పొరేషన్‌ పరిధిలో అధిక సంఖ్యలో భవన యజమానులు సెప్టిక్‌ట్యాంకులు ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొన్ని ప్రధాన, కమర్షియల్‌ ప్రాంతాల్లో కార్పొరేషన్‌కు సంబంధించిన మరుగుదొడ్ల పైపులైన్‌ ఉంది. ఆయా ప్రాంతాల్లోని  భవన యజమానులు  కార్పొరేషన్‌ పైపులైన్‌కు మరుగుదొడ్లను కనెక్షన్‌ ఏర్పాటు చేసుకోవాలంటే కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులు పరిశీలించి కనెక్షన్‌ ఇస్తారు. 17 డివిజన్‌లకు గానూ ఒక ఏఈ, ఇద్దరు మేస్త్రీలు ఈ వ్యవహారం చూస్తున్నారు. అయితే ఇంజినీరింగ్‌ అధికారులు  పైప్‌లైన్‌ కనెక్షన్‌కు భవన యజమానుల నుంచి రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డిమాండ్‌ చేసిన మొత్తం ఇవ్వకుంటే  కొర్రీలు పెడుతూ చుక్కలు చూపిస్తున్నారు. పైప్‌లైన్‌ను రిపేర్లు వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. సమస్య ఎదురైనా ఆలస్యంగా మరమ్మతులు  చేస్తున్నారు. దీంతో భవన యజమానులు తప్పని పరిస్థితుల్లో ఇంజినీరింగ్‌ అధికారులు అడిగిన మొత్తాన్ని ఇస్తున్నారు.

ఏటా రూ.2కోట్ల మేర నష్టం  
ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులు తమ ఆదాయం కోసం కార్పొరేషన్‌కు ఆదాయ వనరులకు గండి కొడుతున్నారు. ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు  కుమ్మక్కై హాస్పిటల్స్, కాంప్లెక్స్‌లు, లాడ్జీలు, భారీ భవనాల మరుగుదొడ్ల(లెట్రిన్‌ సీట్లు) కనెక్షన్ల లెక్కల్లో తేడాలు చూపుతున్నారు. ఏటా డ్రైనేజీ కనెక్షన్ల రూపంలో కార్పొరేషన్‌కు కేవలం రూ.40లక్షల మేర మాత్రమే ఆదాయం వస్తోంది. ప్రస్తుతం డ్రైనేజీ పన్నుల రూపంలో దాదాపు రూ.3కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. లెక్కలు తారుమారు చేయడంతో రూ.2కోట్ల మేర కార్పొరేషన్‌కు నష్టం వాటిల్లుతున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కార్పొరేషన్‌కు రావాల్సిన ఆదాయం రాకుండాపోతుంది. ఇదే అదనుగా రెవెన్యూ అధికారులు  ఏటా భవన యజమానుల నుంచి లక్షల రూపాయలు దండుకుంటున్నారు.

అంతా మేము చూసుకుంటాం  
ఇంజినీరింగ్‌ అధికారులు లెట్రిన్‌ సీట్లకు పైప్‌లైన్‌ ఏర్పాటు చేసే సమయంలో పన్నులు తక్కువ వచ్చేలా తాము చూసుకుంటామని భవన యజమానుల నుంచి భారీగా డిమాండ్‌ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు తాము చెప్పినట్లు నడుచుకుంటారని, లెట్రిన్‌సీట్లు లెక్కలు తాము చేసిందే ఫైనల్‌ అని చెప్పొకొస్తున్నారు. ఈ విధంగా ఇంజనీరింగ్‌ అధికారులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారు.  

అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు
కార్పొరేషన్‌కు రావాల్సిన పన్నుల వసూళ్లలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. కార్పొరేషన్‌ అనుమతులు, పైపులైన్ల కనెక్షన్ల కోసం ఉద్యోగులకు నగదు చెల్లించొద్దు. ఎవరైనా నగదు డిమాండ్‌ చేస్తే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.  –అలీంబాషా, కార్పొరేషన్‌ కమిషనర్‌   

కొన్ని అక్రమ ఘటనలు  
నగరంలోని పొగతోటలోని ఓ ఆస్పత్రిలో భవన యజమాని వద్ద ఇంజినీరింగ్‌ అధికారులు భారీగా వసూలు చేసి 30 లెట్రిన్‌ సీట్లు ఉంటే కేవలం ఏడు లెట్రిన్‌సీట్లు ఉన్నట్లు పన్నుల లెక్కల్లో చూపించారు.  
ఇటీవల తిప్పరాజువారివీధి ఇళ్లు నిర్మించుకున్న ఓ భవన యజమాని డ్రైనేజీ పైప్‌లైన్‌కు కార్పొరేషన్‌లో దరఖాస్తు చేసుకోగా కనెక్షన్ల మంజూరుకు ఇంజనీరింగ్‌ అధికారులు రూ.30వేలు వసూలు చేశారు.  
ట్రంకురోడ్డులో కమర్షియల్‌ భవనం నిర్మించిన యజమాని వద్ద ఇంజనీరింగ్‌ అధికారులు రూ.50వేలు డిమాండ్‌ చేశారు. నగదు ఇవ్వకపోవడంతో కొర్రీలు పెట్టడంతో  తప్పని పరిస్థితుల్లో ఇచ్చి చేయించుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement