
తవ్వేసి.... చంపేసి
►అభివృద్ధి పనుల పేరుతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు
►తిరుపతిలో భవనం కూలి
►విద్యార్థిని మృతి మరొకరికి తీవ్ర గాయాలు
►అధికారుల నిర్లక్ష్యంతో కూలిన భవనం
►బాలిక మృతి మరో యువతికి తీవ్రగాయాలు
►తిరుపతి కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం
►బలైపోయింది. అభివృద్ధి పనుల పేరుతో నగరంలో కాలువల పునఃనిర్మాణ పనులు
చేపడుతున్నారు.
ఇందులో భాగంగా సున్నపు వీధిలో ఇష్టారాజ్యంగా జేసీబీలతో తవ్వేశారు. కొన్ని చోట్ల భవనాలకు వేసిన పునాదులూ ఊడిపోయాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఓ చోట పాత భవనం పేకమేడలా కూలిపోయింది. దీని శిథిలాల కింద పడి ఓ విద్యార్థిని ప్రాణాలు విడిచింది. మరో విద్యార్థిని తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది.
తిరుపతి క్రైం: తిరుపతి నగర పాలక సంస్థ కాలువ నిర్మాణానికి తవ్విన గుంతల వల్ల బుధవారం సున్నపు వీధిలో భవనం కూలిపోయింది. దాని కింద పడి బాలిక మృతిచెందింది. ఈస్ట్ సబ్ డివిజనల్ డీఎస్పీ మురళీకృష్ణ కథనం మేరకు.. తిరుపతి సున్నపువీధిలో మురుగు కాలువలు నిర్మించేందుకు నెల రోజులుగా జేసీబీతో గుంతలు తవ్వుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నుంచి సున్నపు వీధిలో కాలువ పనులను ఇంటి పునాదుల పక్కనే చేపట్టారు. అదేవీధిలో రెండు అంతస్తుల భవనంలో లత కూతుళ్లు గిరీష్మ(18), నిహారిక (15), వారి సమీప బంధువువైన బాలిక ఉంటున్నారు. కింద ఫ్లోర్‌లో పండ్ల దుకాణాం ఉంది. బుధవారం తెల్లవారుజామున భవనం ఒక పక్కకు ఒరిగిపోయింది. భవనంపై ఉన్న లతను, ఆమె సమీప బంధువుల బాలికను స్థానికులు నిచ్చెన ద్వారా కిందకు దించారు. అకస్మాత్తుగా ఆ పాతభవనం కూలిపోయింది.
భవన శిథిలాల కింద గిరీష్మ, నిహారిక ఇరక్కుపోయారు. సమాచారం అందుకున్న ఈస్ట్ సీఐ రాంకిషోర్, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, అగ్నిమాపక అధికారి శంకర్ ప్రసాద్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. జేసీబీతో భవన శిథిలాలను తొలగించారు. గిరీష్మ, నిహారికను రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిహారిక మృతిచెందింది. ఆమె తండ్రి గతంలో చనిపోయాడు. తల్లి లత ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ పిల్లలను చదివించుకుంటోంది. గిరీష్మ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. నిహారిక ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసింది. నిహారిక మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. గాయపడిన గిరీష్మాను మొదటగా రుయాకు, అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, తర్వాత వేలూరు స్విమ్స్‌కు తరలించారు. భవనం వెనుక నివాసముంటున్న మృతురాలు నిహారిక తాతయ్య మునికృష్ణయ్య, నానమ్మ పద్మావతి అందులోనే ఇరుక్కుపోయారు. అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది శిథిలాలను తొలగించి వృద్ధులను కాపాడారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ గాలిముద్దుకృష్ణమ నాయుడు, జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్, నగర పాలక కమిషనర్ వినయ్‌చంద్, అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, ఏఎస్‌పీ ఎంవీఎస్ స్వామి, అర్బన్ తహశీల్దార్ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై అగ్నిమాపక, పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. శిథిలాలను తొలగించి వెంటనే కాలువలో కాంక్రీట్‌తో నింపాలని అధికారులు ఆదేశించారు. పురాతన భవనాల్లో నివాసముంటున్న వారిని ఖాళీ చేయాలి చెప్పారు. సంఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదికను హోంమంత్రి చిన్నరాజప్పకు పంపించాలని అధికారులు ఆదేశించారు. మృతుల కుటుంబాలను అదుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. నగర పాలక సంస్థ అధికారులు ఎటువంటి సూచన లేకుండా లోతుగా కాలువలు తవ్వడంతోనే భవనం కూలిపోయిందని స్థానికులు ఆరోపించారు. ఈ సంఘటనపై ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.