జనం సొమ్ముకు..పచ్చ టెండర్! | Corporation officials ruling party leader froud in government scheams | Sakshi
Sakshi News home page

జనం సొమ్ముకు..పచ్చ టెండర్!

Published Fri, Jul 15 2016 4:32 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

జనం సొమ్ముకు..పచ్చ టెండర్!

జనం సొమ్ముకు..పచ్చ టెండర్!

కార్పొరేషన్ అధికారులు, అధికార పార్టీ నేత కుమ్మక్కు
టెండర్లు లేకుండానే రూ.18 లక్షల పనులు
60 శాతం పనులు అయిపోయిన తర్వాత టెండర్లకు ఆహ్వానం
గతంలోనూ టెండర్లు లేకుండా కోట్లాది రూపాయల పనులు
ఒంగోలు నగరపాలక సంస్థలో వింత పోకడ
కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా కలెక్టర్
అరుునా యథేచ్ఛగా అక్రమాలు
ప్రజల సొమ్ము టీడీపీ నేతల పాలు
కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత పనులు చేపట్టడం సాధారణంగా జరిగే ప్రక్రియ. ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికారపార్టీ నేతలు, కార్పొరేషన్ అధికారులు కుమ్మక్కై ముందు పనులు చేయించి ఆ తర్వాత  టెండర్లు పిలుస్తూ వింత పోకడకు తెరలేపారు. కాంట్రాక్టర్ల దగ్గర పెద్ద ఎత్తున ముడుపులు పుచ్చుకొని ప్రజాధనానికి గండి కొడుతున్నారు. గతంలోనూ కోట్లాది రూపాయల పనులకు సంబంధించి ఇదే తీరు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్నా మున్సిపల్ అధికారులు, టీడీపీ నేతలు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపి అందినకాడికి దండుకుంటున్నారు. అయినా వారిపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.

 చక్రం తిప్పిన షాడో ఎమ్మెల్యే..
ఒంగోలు నగరంలోని రామ్‌నగర్ 6 నుంచి 7వ లైను వరకు, 7వ లైను నుంచి 8వ లైను వరకు గ్రీన్‌బెల్టు పేరుతో  కార్పొరేషన్ అభివృద్ధి పనులు చేపట్టింది. 6వ లైను పనుల కోసం రూ.8,46,494/-, 7వ లైను పనుల  కోసం రూ.9,24,296/- కేటాయించారు. మొత్తంగా రెండు పనుల కోసం రూ.17,70,790/- కేటాయించారు. ఈ మొత్తం నగరపాలక సంస్థసాధారణ నిధుల నుండి కేటాయిస్తారు. గ్రీన్‌బెల్టులో భాగంగా రెండు రోడ్ల మధ్య మొక్కలు, గ్రీనరీ పెంచాల్సి ఉంది. దీనికి రక్షణగా ఇరువైపుల 6 అడుగుల ఎత్తున ఐరన్ పోల్స్‌ను ఏర్పాటు చేసి, ఐరన్ బాలీ (ఫెన్సింగ్)ను నిర్మించాల్సి ఉంది. ఈ పనుల కోసం మున్సిపల్ అధికారులు ఈ నెల 2న పేరుకు టెండర్లు పిలిచారు. 14వ తేదీన టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది.

ఇప్పటికే నగరానికి చెందిన అధికార పార్టీ నేత ఆదేశం మేరకు ఆ పనులను ఆయన ఏర్పాటు చేసిన ఫైవ్‌మెన్ కమిటీకి అప్పగించారు. కమిటీలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించే అనుచరుడు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా జోరుగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 60 నుంచి 70 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ అధికారులు టెండర్లు మాత్రం తెరవలేదు. పేరుకు టెండర్లు నిర్వహించి టెండర్ ఓపెన్ చేయకుండానే కాంట్రాక్టర్‌తో పనులు చేయించడం చూస్తే కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం అధికారుల అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థమవుతోంది. రెండు పనులకు సంబంధించి దాదాపు రూ.18 లక్షలు కేటాయించారు. టెండర్లలో పోటీ నిర్వహించి ఉంటే 20 శాతం తక్కువకు పనులు ఖరారు అయ్యేవి. ఈ లెక్కన దాదాపు రూ.4 లక్షలు ప్రజాధనం మిగిలేది. టెండర్లకు పోటీకి వచ్చే కాంట్రాక్టర్లను ఇప్పటికే ఆ పనులను వేరే కాంట్రాక్టర్లకు అప్పగించామని మీరు పోటీలో పాల్గొనవద్దని, కాదని పాల్గొంటే ఇబ్బందులు పడతారంటూ ఇంజినీరింగ్ విభాగం అధికారులే బెదిరించడం గమనార్హం.

 ముఖ్యనేత ఆదేశాలతో అక్రమాల వెల్లువ..
నగరానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత ఆదేశాల మేరకు కార్పొరేషన్ అక్రమాలకు అడ్డేలేకుండా పోతుందన్న విమర్శలున్నాయి. ముఖ్యనేత (ఏర్పాటు చేసిన ఫైవ్‌మెన్ కమిటీ) నగరపాలక సంస్థ కార్యాలయూల్లో మకాం వేసి అధికారులను శాసిస్తున్నారు. తాము చెప్పినట్టే నిధులు ఖర్చు చేయాలంటూ, తాను నిర్దేశించిన పనులనే చేపట్టాలంటూ శాసిస్తున్నారు. టెండర్లు లేకుండానే పనులు చేయిస్తున్నారు. కాదు, కూడదంటే బదిలీ చేసుకొని వెళ్లిపోమ్మని అధికారులతో బెదిరిస్తున్నారు. దోచుకుంటున్న నిధుల్లో పచ్చ నేతలకు 8 శాతం, అధికారులకు 4 శాతం వాటాగా పంచుకుంటున్నట్లు కొందరు మున్సిపల్ అధికారులే చెబుతుండటం గమనార్హం.

 గతంలోనూ ఇదే తీరు..
టెండర్లు ఖరారు కాకుండానే ముందుగా పనులను చేయించడం ఒంగోలు మున్సిపాలిటీలో ఆనవాయితీగా మారింది. గతంలో బాలకృష్ణాపురంలో రెండు సిమెంట్ రోడ్ల నిర్మాణం, గాంధీపార్కులో విద్యుత్ స్తంభాలు, బల్బుల ఏర్పాటు, కమ్మపాలెం స్మశానవాటిక ప్రహరీగోడ నిర్మాణం పనులు సైతం ముందుగా చేయించి తర్వాత టెండర్లు ఖరారు చేశారు. టెండర్లు లేకుండానే కోట్లాది రూపాయల పనులు గుట్టుచప్పుడు లేకుండానే నిర్వహించారు.

 మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్..
ఒంగోలు మున్సిపాలిటీ ఎన్నికలు జరగకపోవడంతో ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉన్నారు. అయినా సరే ఇక్కడ అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండాపోతోంది. విలువైన మున్సిపల్ స్థలాలను కూలగొట్టి అధికార పార్టీ నేతలకు ధారాదత్తం చేస్తున్నారు. మరో వైపు బండ్లమిట్ట, పోతురాజుకాలువ ప్రాంతాల్లో పేదల ఇళ్లు, దుకాణాలను కూల్చివేసి ఆ స్థలాలను సైతం అధికార పార్టీ  నేతలకు అప్పగించే ప్రయత్నానికి దిగినా.. పాలనాధికారి మిన్నకుండిపోయారన్న విమర్శలున్నాయి. దీంతో పాటు టెండర్లు లేకుండా కోట్లాది రూపాయల పనులు నిర్వహిస్తూ అధికారులు, అధికార పార్టీ నేతలు ప్రజాధనాన్ని దోచుకుతింటున్నా ఉన్నతాధికారి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement