♦ కన్నెత్తి చూడని కార్పొరేషన్ అధికారులు
♦ విచ్చలవిడిగా నిర్మాణాలు..ఆపై వ్యాపార సముదాయాలు..
♦ కాసులిస్తే అన్ని ఓకే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అక్రమ నిర్మాణాల వ్యవహారంలో అధికారుల ఉదాసీన వైఖరికి ముడుపుల వ్యవహారమే ప్రధాన కారణం. విచ్చలవిడిగా నిర్మాణాలు జరిగి సెల్లార్లలో వ్యాపారాలు కొనసాగుతున్నాయంటే అధికారుల నిర్లక్ష్యం బట్టబయలవుతోంది. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాల వ్యవహారంలో సెల్లార్ల బాగోతం జోరుగా కొనసాగుతోంది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నిబంధనలు తుంగలో తొక్కి నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారు. కార్పొరేషన్‌లోని 50 డివిజన్ల పరిధిలోని వ్యాపార సముదాయ ప్రాంతాలు ఉన్న చోట ఈ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి.
ఇదీ పరిస్థితి : నగరంలోని హైదరాబాద్‌రోడ్డు, ఖలీల్‌వాడి, గాంధీచౌక్, వినాయక్‌నగర్, కంఠేశ్వర్, సుభాష్‌నగర్ ప్రాంతాల్లో సెల్లార్లలోనే వ్యాపారాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం వ్యాపార సముదాయం నిర్మాణం కావాలంటే తప్పనిసరిగా సెల్లార్ ఉండాలి. ఇందులో పార్కింగ్ కోసం స్థలం కేటాయించాలి. కానీ.. ఇటీవల భవన నిర్మాణాలు, వ్యాపార సముదాయాల కోసం నిర్మించిన వాటిలో సెల్లార్లు వ్యాపార సముదాయాలుగా మారుతున్నాయి. ఇలాంటి వారికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అనుమతులు ఇవ్వకూడదు. పైగా వాటిని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇవి ఏమి పట్టించుకోని అధికారులు నిమ్మకుండిపోతున్నారు.
⇒ హైదరాబాద్ రోడ్డులోని ఓ ప్రముఖ వ్యాపార సముదాయం నిర్మాణం జరిగి రెండేళ్లు అవుతుంది. ఇందులో వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. పార్కింగ్ కోసం వదిలివేసి ఉండాల్సి ఉండగా ఇక్కడ అవి ఏమి పట్టించుకోకుండా వ్యాపార సముదాయాలు నెలకొన్నాయి.
⇒ పూలాంగ్ సమీపంలోని ఓ కార్పొరేట్ వ్యాపార సంస్థ కొనసాగుతోంది. దాని కింది భాగంలో సెల్లార్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహణ కొనసాగుతోంది. సెల్లార్‌లోనే అత్యవసర సేవ లు, ఓపీ సేవలు అం దిస్తున్నారు. పార్కింగ్ మాత్రం ప్రధాన రోడ్డుపైనే కొనసాగుతోంది. ఈ ఆస్పత్రి కొనసాగేందుకు ప్రధా న రోడ్డును ఆక్రమించి డ్రెరుునేజీని మూసి వేశారు. అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్డుకు అనుకుని మెట్ల నిర్మాణం చేపట్టారు. అయినా కార్పొరేషన్ అధికారులు మేల్కొనడం లేదు.
⇒ ఎల్లమ్మగుట్ట చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి కొనసాగుతోంది. ఈ భవనం సెల్లార్ విభాగంలో అత్యవసర విభాగం కొనసాగిస్తున్నారు. సెల్లార్ కోసం వదిలి వేయూల్సి ఉండగా ఇక్కడ వైద్యసేవలు అందిస్తున్నారు.
⇒ వినాయక్‌నగర్‌లోని ఓ వ్యాపార సముదాయం కొనసాగుతోంది. ఈ నాలుగంతస్తుల భవనంలో సెల్లార్ కోసం మొదట వదిలి వేసిన ప్రస్తుతం సెల్లార్‌లో వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్నారు. డ్రెరుునేజీని అక్రమించి నిర్మాణాలు చేపట్టారు.
⇒ బస్టాండ్ సమీపంలోని మరో కాంప్లెక్స్‌లో విచ్చలవిడిగా వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ కాంప్లెక్స్ ముందు రోజు వందలాది వాహనాలు పార్కింగ్ చేయడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాంప్లెక్స్‌లోని సెల్లార్ విభాగంలో వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. వీటిపై కనీసం అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
⇒ బోధన్ రోడ్డులోని ఓ మాజీ ప్రజాప్రతినిధికి చెందిన కాంప్లెక్స్‌లో సెల్లార్ నిర్మించగా ఇక్కడ వ్యాపార స ముదాయలు కొనసాగుతున్నాయి. ఇక్కడ రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ఈ భవనానికి మున్సిపల్ అనుమతి కూడా లేదు.
⇒ వీక్లీబజార్‌లోని అపార్టుమెంట్‌లో సెల్లార్‌లో వ్యాపా ర సముదాయంలో కొనసాగుతోంది. అందులో నివసిస్తున్న వారు కోర్టుకు ఎక్కడంతో కోర్టు ఆదేశాలతో ఈ నిర్మాణాలను కూల్చివేశారు.
⇒ ఖలీల్‌వాడిలో ప్రధానంగా 80 వరకు భవనాలు ఉన్నాయి. ఇందులో అన్నింటిలో ప్రైవేట్ ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించి సెల్లార్ల నిర్మాణాలు అందుబాటులో లేవు. ప్రతి భవన నిర్మాణం సెల్లార్ లేకుండానే కొనసాగింది. అతి తక్కువ స్థలంలో 3, 4 అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
⇒ అపార్టుమెంట్ల నిర్మాణంలో ఇదే విధానం కొనసాగుతోంది. సెల్లార్‌ల నిర్మాణంలో వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసి యజమానులు డబ్బులు దండుకుంటున్నారు. కార్పొరేషన్ అధికారులకు ముడుపులు అందిస్తూ తప్పించుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.