ఇళ్లు కోల్పోయిన వారిని సత్వరమే ఆదుకోవాలి
► ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిటీ ఎమ్మెల్యే
► వర్ష బీభత్స ప్రాంతాల్లో పర్యటన
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వర్షాల కారణంగా ఇళ్లు కూలి నిరాశ్రయులైన వారిని సత్వరమే ఆదుకోవాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడచిన రెండు రోజులుగా కురుస్తున వర్షాలకు 13,15 డివిజన్లలోని పలుప్రాంతాల్లో ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. గురువారం ఎమ్మెల్యే ఆయా డివిజన్లలో పర్యటించారు. వర్షాల కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇళ్లు కూలిపోవడంతో తెలిసిన వారి పంచన తలదాచుకుంటున్నామని పలువురు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.
విద్యుత్, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, స్థానిక కార్పొరేటర్లు చొరవ తీసుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు పడిపోవడం, ఇళ్లు కూలిపోవడంతో కొంత మంది నిరాశ్రయులయ్యారని వారికి ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు పక్కాగృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కార్పొరేటర్లు ఊటుకూరు మాధవయ్య, ఓబిలి రవిచంద్ర, నాయకులు లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, కర్తం ప్రతాప్‌రెడ్డి, ఎస్‌కే సుభాన్, శివప్రసాద్‌రెడ్డి, ముదిరెడ్డి లక్ష్మీరెడ్డి, ముడియాల దశరథరామిరెడ్డి, ఎస్‌కే మాబు, నాగూరు నాగార్జునరెడ్డి, శివ, రవి, వినయ్, ప్రసాద్‌రెడ్డి, కొండారెడ్డి, సగిలి జయరామిరెడ్డి, గూడూరు సురేంద్రరెడ్డి, సింగంశెట్టి అశోక్, పత్తి చంద్రశేఖర్, గంధం సుధీర్‌బాబు, సుబ్బారెడ్డి, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.