సాక్షి, ముంబై : గోరేగావ్-ములుండ్ లింక్‌రోడ్ (జీఎంఎల్‌ఆర్) పూర్తిగా ఎలవేటెడ్‌గా నిర్మించనున్నారు. అయితే ఈ మార్గాన్ని తొలుత రోడ్డు మార్గంగా నిర్మించాలని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ భావించింది. అరేకాలనీ మీదుగా ఈ మార్గం వెళుతుండడంతో రోడ్డు నిర్మాణంలో భాగంగా 1,100 చెట్లను నరకాల్సి వచ్చింది. దీంతో పచ్చదనం కోల్పోవద్దన్న ఉద్దేశంతో ఈ మార్గాన్ని ఎలవేటెడ్ మార్గంగా నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు.
ఇందుకు గాను రూ.1,300 కోట్లు ఖర్చు అవుతున్నట్లు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించిన సలహాదారులు తమ నివేదికను ఇటేవల సమర్పించారు. ఇటీవల బీఎంసీ గోరేగావ్‌లోని అరేరోడ్‌ను వెడల్పు చేసేందుకు ప్రతిపాదించింది. గోరేగావ్ నుంచి సాకివిహార్ వరకు నాలుగు లేన్ల దారిగా, తర్వాత ఇక్కడి నుంచి ములుండ్ వరకు ఎలవేటెడ్‌గా నిర్మించాలని నిశ్చయించింది.
అయితే పర్యావరణ ప్రేమికులు ఈ ప్లాన్‌ను పూర్తిగా వ్యతిరేకించారు. ఇందులో భాగంగా అరేరోడ్ వద్ద దాదాపు 1,100 చెట్లను నరికి వేయాల్సి వచ్చింది. అంతేకాకుండా జంతువుల కదలికకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడ్డారు. కాగా, పర్యావరణ పరిరక్షణతోపాటు జంతువులకు కూడా ఇబ్బంది కలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ అడిషనల్ కమిషనర్, రోడ్ల విభాగపు అధికారి ఎస్‌వీఆర్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తుది డైజన్‌కు సంబంధించిన పనులు నిర్వహిస్తున్నారు. అయితే అరెకాలనీలో మొత్తంగా టన్నెల్‌ను నిర్మించాల్సిందిగా పర్యావరణ ప్రేమికులు సూచించారు.
కానీ కార్పోరేషన్ అధికారులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. టన్నెల్‌ను నిర్మించే బదులు ఎలవెటెడ్‌ను నిర్మించడం ద్వారా నిర్మాణ వ్యయం తగ్గించవచ్చని అధికారి అభిప్రాయపడ్డారు. ఈ గోరేగావ్-ములుండ్ లింక్‌రోడ్ నిర్మాణం నగరంలో 5వ ఈస్ట్, వెస్ట్‌ను కలుపుతుందని ఆయన తెలిపారు. 14 కి.మీ. రోడ్డు అరేకాలని, సాకివిహార్, భాందూప్ కాంప్లెక్స్ మీదుగా వెళ్లి ములుండ్‌లోని ఎల్‌బీఎస్ మార్గ్‌కు కలుస్తుంది. ఈ కొత్త ప్రణాళికపై స్థానికులు, పర్యావరణ ప్రేమికులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలివేటెడ్ రోడ్ నిర్మాణంతో పిల్లర్లు ఇప్పుడు ఉన్న రోడ్డు కంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయని, దీంతో అరే కాలనీలో రోడ్డు నిర్మాణం చేపట్టవద్దని సామాజిక కార్యకర్త బీజు అగస్టీన్ డిమాండ్ చేశారు.