పేదల ఇళ్లు క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఏర్పాటు చేసుకున్న ఇళ్లను వందగజాల వరకూ ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో పేదల నివాసాలను గరిష్టంగా వందగజాల వరకూ క్రమబద్ధీకరిస్తున్నట్లు రెవెన్యూ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలు నివాసం కోసం వేసుకున్న గుడిసెలు, ఇళ్లకే ఇది వర్తిస్తుంది. ఆక్రమించుకున్న స్థలాలకు క్రమబద్ధీకరణ జీవో వర్తించదని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ బుధవారం జారీ చేసిన జీవో 296లో స్పష్టం చేశారు. జీవోలోని ముఖ్యాంశాలు, విధి విధానాలిలా ఉన్నాయి.
⇒ గతేడాది జనవరి ఒకటో తేదీ నాటికి ఉన్న ఆక్రమిత ఇళ్లకే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది.
⇒ అభ్యంతరంలేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమిత నివాసాల క్రమబద్ధీకరణ అని ఈ పథకాన్ని పిలుస్తారు. అమలు ఈ నెల 15 నుంచి ఆరంభమవుతుంది.
‘మీసేవ’ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
⇒ క్రమబద్ధీకరణ కోసం ఈ నెల 15 నుంచి 120 రోజుల్లోగా ‘మీసేవ’ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను సంబంధిత తహశీల్దార్లకు పంపుతారు. సబ్ కలెక్టరు/ రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన డివిజనల్ స్థాయి రెగ్యులరైజేషన్ కమిటీ (డీఎల్‌ఆర్‌సీ)ని ఏర్పాటు చేస్తారు. ఇందులో ఆయా మున్సిపాలిటీల పట్టణ ప్రణాళిక అధికారి సభ్యునిగానూ, తహశీల్దారు సభ్య కన్వీనరుగాను ఉంటారు. తహశీల్దారు ప్రతి దరఖాస్తు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి క్రమబద్ధీకరణకు అర్హమైనదో కాదో నిర్ధారించడం కోసం డీఎల్‌ఆర్‌సీకి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం తహశీల్దార్లకు జిల్లా కలెక్టరు/రాష్ట్ర భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) నిర్దిష్ట ప్రొఫార్మా, చెక్‌లిస్టు పంపుతారు.
మహిళల పేరిటే పట్టాలు
⇒ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మహిళల పేరిట రూపొందిస్తారు. కుటుంబంలో మహిళలు లేని పక్షంలో కుటుంబ పెద్ద అయిన పురుషుని పేరుతో తయారు చేస్తారు.
⇒ అందిన ప్రతి దరఖాస్తును 90 రోజుల్లోగా పరిష్కరించాలి.హాడీఎల్‌పీసీ నిర్ణయంపై సంతృప్తి చెందని పక్షంలో దరఖాస్తుదారు 90 రోజుల్లోగా జేసీ-1కు అప్పీల్ చేసుకోవచ్చు.
ఈ ప్రాంతాలకు వర్తించదు...
⇒ అభ్యంతరంలేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటారు.
⇒ మాస్టర్‌ప్లాన్, జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్, రోడ్ల అభివృద్ధి ప్రణాళికకు ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లోని దరఖాస్తులను, అనుమతించిన లేఅవుట్లలోని ఖాళీ స్థలాలనూ పరిశీలించరు. నీటివనరులు, శ్మశాన వాటికలు, నీటిపారుదల, తాగునీటి ట్యాంకులు ప్రాంతాల్లోని ఆక్రమణదారుల దరఖాస్తులను అనుమతించరు. ప్రజావసరాలకు పనికొచ్చే స్థలాలు, అతి విలువైన స్థలాలనూ ఈ జీవో నుంచి మినహాయిస్తారు.
⇒ పట్టా పొందిన రెండేళ్ల తర్వాత ఆ స్థలాలపై వారికి పూర్తి వారసత్వ హక్కులు లభిస్తాయి.