పేదలకు ఉచితమే.. | sakshi with Chief secretary BR Meena | Sakshi
Sakshi News home page

పేదలకు ఉచితమే..

Published Wed, Jan 21 2015 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

sakshi with Chief secretary BR Meena

- 125 గజాల దాకా క్రమబద్ధీకరణ  
 - రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా

 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న పేదలకు ఆయా స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతతో ఉందని రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆక్రమిత  స్థల విస్తీర్ణం 125 గజాలకు మించినా దరఖాస్తుదారులు పేదలైతే వారికి 125 గజాల వరకు ఉచితంగానే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన స్పష్టం చేశారు.

మిగిలిన స్థలం క్రమబద్ధీకరణకే నిర్దేశిత ధర మేరకు సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. కుటుంబ వార్షికాదాయం పట్టణాలు, నగరాల్లో రూ.2 లక్షల్లోపు ఉన్న వారందరినీ పేదలుగానే పరిగణిస్తామన్నారు. వీరంతా స్థానిక తహశీల్దారు నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుందన్నారు. అయితే భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవో 59 కింద  ప్రభుత్వం పేర్కొన్న రిజిస్ట్రేషన్ ధరను తగ్గించే యోచన లేదని మీనా స్పష్టం చేశారు.

పేదలకు 125 గజాల వరకు స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరిస్తున్నందున దరఖాస్తుదారుల్లో ఎక్కువ శాతం మందిపై భారం లేదన్నారు. మధ్యతరగతి వర్గాల కోసమే 125 గజాల నుంచి 250 గజాల వరకు రిజిస్ట్రేషన్ ధరలో 50 శాతం రాయితీని ప్రభుత్వం ఇచ్చిందన్నారు. 250 నుంచి 500 గజాల్లోపు స్థలంలో ఉంటున్న వారు స్థలం క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ ధరలో 75 శాతమే చెల్లించాలని, 500 గజాలకుపైగా ఆక్రమిత స్థలంలో ఉంటున్న ప్రజలను మధ్య తరగతివారీగా పరిగణించలేమన్నారు.
 
2 లక్షలకు చేరువైన దరఖాస్తులు..
క్రమబద్ధీకరణకు ఇప్పటివరకూ 1.89 లక్షల దరఖాస్తులు వచ్చాయని మీనా తెలిపారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి 1.17 లక్షల దరఖాస్తులు రాగా, అత్యల్పంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 255 దరఖాస్తులే వచ్చాయన్నారు. క్రమబద్ధీకరణ గడువు పెంచినందున మరో 3 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. కాగా, ప్రభుత్వ భూములతో పాటు ఆక్రమణలకు గురైన శ్మశాన స్థలాలు, మున్సిపల్ స్థలాలను కూడా క్రమబద్ధీకరించాలని నిర్ణయించినట్లు మీనా చెప్పారు.

శిఖం భూములను ఆక్రమించుకొన్న వారికి కూడా ఆయా స్థలాలను క్రమబద్ధీకరించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఎంఎస్ మక్తా.. వంటి ప్రాంతాల్లో మూడు ద శాబ్దాలుగా హుస్సేన్ సాగర్ స్థలాన్ని ఆక్రమించుకొని ఎంతోమంది నివాసముంటున్నారని, వాటిని రెగ్యులరైజ్ చేయకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో శిఖం భూములను కూడా డీనోటిఫై చేసి క్రమబద్ధీకరించేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయన్నారు.
 
క్రమబద్ధీకరణ గడువు పెంపు ఉత్తర్వులు జారీ
భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దరఖాస్తుల సమర్పణకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. 125 గజాల్లోపు స్థలాలను ఉచిత క్రమబద్ధీకరణ నిమిత్తం దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 31 వరకు, రిజిస్ట్రేషన్ ధర చెల్లించి వివిధ కేటగిరీల స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసేవారికి ఫిబ్రవరి 28 వరకు గడువు పొడిగిస్తూ జీవోఎంఎస్ నంబర్లు 5, 6 లతో వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement