ఐఏవై కింద రాష్ట్రానికి 60 వేల ఇళ్లు
కేంద్రం ఔదార్యంతో తెలంగాణకు లబ్ధి
కొత్తగా ఒక్క ఇల్లు నిర్మించకుండానే ఖాతాలోకి రూ.374 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లనే ఆ ఖాతాలో చూపబోతున్న అధికారులు
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్ర ఖజానాకు భారంగా పరిణమించిన తరుణంలో కేంద్రప్రభుత్వ ఔదార్యం కారణంగా రాష్ట్రఖాతాలోకి రూ.374 కోట్లు చేరనున్నాయి. అదనంగా 60 వేల ఇళ్లను ఇందిర ఆవాస్ యోజన (ఐఏవై) కింద మంజూరు చేయడం ద్వారా ఈ మొత్తాన్ని కేంద్రం ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో అయితే అదనంగా ఒక్క ఇంటిని కూడా నిర్మించాల్సిన అవసరం లేకుండా ఈ సొమ్మును పొందేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగున్నర లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నాలుగు నెలలుగా వాటికి నయాపైసా విడుదల కాలేదు. దీంతో పనులు పడకేశాయి. బిల్లుల బకాయిలు రూ.450 కోట్లకు చేరుకున్నాయి. బిల్లుల కోసం లబ్ధిదారులు తిరుగుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. అది తేలితేగాని డబ్బు విడుదల చేయవద్దన్నట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరుణంలో కేంద్రం అదనంగా 60 వేల ఇళ్లను ఐఏవై కింద మంజూరు చేస్తానని తెలిపింది. కొన్ని రాష్ట్రాలు వాటిని తీసుకోనందున కోటా మిగిలిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరం 60 వేల ఐఏవై ఇళ్లు మంజూరు కాగా, తొలి విడత బడ్జెట్ కింద రూ.187 కోట్లను కొద్దిరోజుల క్రితమే విడుదల చేసింది. మలి దఫాగా మరో రూ.187 కోట్లు రానున్నాయి. ఇంకా అదనపు ఇళ్ల కోసం మరో రూ.374 కోట్లు ఇవ్వబోతోంది. దీంతో, ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లనే ఐఏవై కింద మార్చి ఆ మొత్తాన్ని పొందేందుకు గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. అంటే వివిధ దశల్లో ఉన్న నాలుగున్నర లక్షల ఇళ్లలోంచే వీటిని చూపుతారన్నమాట. ఆమేరకు కేంద్రానికి లెక్కలు కూడా సమర్పిస్తారు. దీంతో కేంద్రం రికార్డుల్లో ఐఏవై ఇళ్ల నిర్మాణం జరిగినట్టు నమోదవుతుంది.