లక్షన్నర ‘ఇందిరమ్మ’ ఇళ్లు రద్దు!
♦ అనర్హులు లబ్ధిపొందినట్లు తేలడంతో జాబితా నుంచి తొలగింపు
♦ మిగతా 2.10 లక్షల ఇళ్ల బిల్లుల మంజూరుకు ఓకే
♦ అవకతవకల వడపోత తర్వాత స్పష్టత
♦ తొలివిడతలో రూ.197 కోట్ల విడుదలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ‘ఇందిరమ్మ’ ఇళ్ల పథకంలో అనర్హులు లబ్ధిపొందినట్లుగా గుర్తించిన లక్షన్నర ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న మిగతా 2.10 లక్షల ఇళ్లకు బిల్లులు మంజూరు చేయాలని నిర్ణయించింది. అందులో తొలి విడతగా దాదాపు రూ.197 కోట్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ 2.10 లక్షల ఇళ్లను పూర్తి చేయాలంటే దాదాపు రూ.1,100 కోట్లు అవసరం. అయితే ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) పథకం కింద గతంలో కేంద్రం మంజూరు చేసిన రూ.510 కోట్లు గృహ నిర్మాణ శాఖ వద్ద ఉన్నాయి. అవి పోను మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది.
దాదాపు మూడేళ్లుగా..
తెలంగాణ ఏర్పాటయ్యాక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. దీనిపై సీఐడీ విచారణ జరిపించగా.. అక్రమాలు నిజమేనని వెల్లడైంది. దాంతో ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల సంగతి అటకెక్కినట్లేననే భావన వ్యక్తమైంది. అయితే అర్హులైన పేదలు బిల్లులు అందక ఇబ్బంది పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో కొన్ని బిల్లులైనా మంజూరు చేయాలని నిర్ణయించి.. 2016లో కొన్ని నిధులు మంజూరు చేసింది. కానీ అది కూడా నిలిచిపోయింది. తాజాగా ఇందిరమ్మ పథకంలో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరగనివ్వమని, వారికి మొత్తం బిల్లులు మంజూరు చేస్తామని ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బిల్లుల మంజూరుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
నిధుల సమీకరణ ఎలా?
‘ఇందిరమ్మ’ ఇళ్ల కోసం కేంద్రం ఇచ్చిన రూ.510 కోట్ల ఐఏవై నిధులు పోను.. రాష్ట్రం మరో రూ.600 కోట్ల మొత్తాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇళ్లకు నిధుల్లేక హడ్కో నుంచి రుణంగా తీసు కుంటున్నారు.దీంతో ఇందిరమ్మ బిల్లుల చెల్లిం పు ప్రభుత్వానికి భారంగా మారనుంది.
ఇప్పుడు సిబ్బంది కరువు?
ఇందిరమ్మ బిల్లుల మంజూరులో కొత్త సమస్య వచ్చిపడింది. గతంలో గృహ నిర్మాణశాఖ సిబ్బంది బిల్లులు చెల్లించేవారు. ఇటీవల ఆ విభాగాన్ని ప్రభుత్వం రద్దు చేసి.. సిబ్బందిని ఇతర విభాగాలకు డిప్యుటేషన్‌పై పంపింది. అవినీతి ఆరోపణల మేరకు వంద ల మంది తాత్కాలిక సిబ్బందిని తొలగించిం ది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇందిరమ్మ బిల్లుల చెల్లింపునకు సిబ్బంది లేని పరిస్థితి ఎదురైంది. దీంతో పంచాయతీరాజ్ విభాగం నుంచి కొంతమంది సిబ్బందిని రప్పించి వారికి బిల్లుల చెల్లింపుపై తర్ఫీదు ఇస్తున్నారు. వారు ‘ఇందిరమ్మ’ ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించి, ఫొటోలు తీసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా బిల్లులను మంజూరు చేస్తారు. సోమవారం నుంచి బిల్లుల చెల్లింపు ప్రారంభమయ్యే అవకాశముంది.