చేనేత పరిస్థితిపై సర్వే
ప్రత్యేక బృందాలతో సర్వే చేయించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికుల వివరాలను గ్రామాలవారీగా సేకరించి, చేతిమగ్గాల పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలతో సర్వే చేయించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ ఆదేశించారు. దీనిపై 14 అంశాలతో ప్రొఫార్మా పంపామని, మార్చి 5లోగా నివేదికను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. ప్రతి మగ్గానికి జియో ట్యాగింగ్ చేయించనున్నట్లు తెలిపారు. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణంలో 2015–16కు సంబంధించి నియో జకవర్గానికి 1,000 ఇళ్లను మంజూరు చేసినందున వాటికి అవసరమైన ల్యాండ్ బ్యాంక్ ను సిద్ధం చేసి 25 ఫిబ్రవరిలోగా సమర్పించాలని ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరా ఆవాస్ యోజన కింద చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేస్తామన్నారు. గృహ నిర్మాణ టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు.
బీడీ కార్మికుల వివరాలు పంపాలి
బీడీ కార్మికులకు గతంలో కేంద్రం ద్వారా మంజూ రు చేసిన వివరాలు, డబుల్ బెడ్ రూమ్ గృహాలకు సంబంధించిన వివరాలను ఈ నెల 25లోగా సమర్పించాలని సీఎస్ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న గొర్రెల యూనిట్లకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా అందుబాటులో ఉన్న వివరాలు, డిమాండ్ సర్వే ఈ నెల 27 లోగా సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. సాదా బైనామాల రెగ్యులరైజేషన్, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల దరఖాస్తుల వెరిఫికేషన్‌ను వేగవంతం చేసి లబ్ధిదారులకు డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు.
పరిహారం చెల్లింపులో పెండింగ్ వద్దు
అత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులు పెండింగ్‌లో లేకుండా చూడడంతోపాటు అవసరమైన నిధుల వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్లను సూచించారు. మిషన్ భగీరథ ట్రంక్ వర్క్స్‌తోపాటు ఇంట్రా విలేజ్ పనులు వేగవంతం చేయాలన్నారు. గ్రామా ల్లో హరిత రక్షణ కమిటీల ద్వారా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు.