మహిళల ఆర్థిక పరిపుష్టి, స్వావలంబనకు ఆసరాగా నిలుస్తున్న బీడీ పరిశ్రమ మసకబారిపోతున్న క్రమంలో తమ బాగుకు పనిచేసే వారి కోసం ఆ కార్మికులు ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపించేంతటి శక్తి ఉన్న తమను ఏ రాజకీయ పార్టీలు ఆదరిస్తాయా.. అని బీడీ కార్మికులు లెక్కలు వేసుకుంటున్నారు.
బీడీ కార్మికులకు ఇప్పటి వరకు అందుతున్న జీవనభృతిని నెలకు రూ.2 వేల నుంచి రూ.5 వేలు చేస్తామని వివిధ రాజకీయ పార్టీలు హామీలిస్తున్నాయి. అయితే, కార్మికుల కనీస వేతనం, పింఛన్ పెంపుతో పాటు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించడం, సంక్షేమం, వైద్య సౌకర్యాల అమలు హామీలు దిశగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాలని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
కంపెనీలను కట్టడి చేసేదెవ్వరు?
కార్మికులకు వేతనాల పెంపు అంశంలో యాజమాన్యాలు ఆడిందే ఆటగా సాగుతోంది. గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ప్రధాన కంపెనీలపై స్థానిక సర్కారు అజమాయిషీ అంతంతమాత్రమే కావడంతో న్యాయం జరగడం లేదు. 2010 నవంబర్‌లో వేతనాల పెంపు కోరుతూ కార్మికులు బంద్ పాటించారు. సుమారు 32 రోజులపాటు సమ్మె సాగిన క్రమంలో అప్పటి సర్కార్ కార్మికుల కనీస వేతనం రూ.130గా నిర్ణయిస్తూ 2011 డిసెంబర్‌లో జీఓ 41 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.
ఈ జీఓ అమలుకు యాజమాన్యాలు ఒప్పుకోలేదు. దాంతో కార్మిక సంఘాలు మరోసారి చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం జీఓ 81 జారీ అయ్యింది. ప్రస్తుతం వేయి బీడీలకు రూ.231 మాత్రమే ఇస్తున్నారు. వాస్తవానికి జీఓ 41 అమలైతే ప్రస్తుత పరిస్థితుల్లో వేయి బీడీలకు కనీసంగా రూ.600 వస్తాయనికార్మికులు చెబుతున్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వస్థాయిలో సైతం ఒత్తిడి తెచ్చి కంపెనీల యాజమాన్యాలను ఒప్పించేలా ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు స్పష్టమైన హామీ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది.
తగ్గుతున్న అమ్మకాలు.. పనిదినాలపై ప్రభావం
తెలంగాణలో సుమారు 4,74,438 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. ఈ మధ్యకాలంలో మార్కెట్లలోకి వచ్చి చేరుతున్న మినీ సిగరెట్లతో బీడీల అమ్మకాలు పడిపోతున్నాయి. ఫలితంగా కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా నెలకు పది నుంచి పదిహేను రోజులు మాత్రమే కార్మికులకు ఆకు, తంబాకు ఇస్తూ మిగిలిన రోజుల్లో కంపెనీలు బంద్ చేస్తున్నాయి. కార్మిక చట్టాల ప్రకారం కనీసం ఏడాదికి 312 పనిదినాలు కల్పించాల్సి ఉండగా, యాజమాన్యాలు మాత్రం 100 నుంచి 120 రోజులు మాత్రమే పనిదినాలు కల్పిస్తున్నాయి.
వాస్తవానికి సిగరెట్లపై నిబంధనల మేరకు ప్రచారం కల్పిస్తుండగా, బీడీలపై కనీసంగా ప్రచారం లేకపోవడంతోనే అమ్మకాలు తగ్గిపోతున్నాయని, ఫలితంగా తమ పనిదినాలూ తగ్గుతున్నాయని కార్మికులు వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కార్మికులకు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించే దిశగా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ దృష్టి సారించలేదన్న అసంతృప్తి కార్మికుల్లో నెలకొంది.
ప్రధాన సమస్యలు..
♦ పని దినాల కుదింపు.. ఫలితంగా వేతనం చాలడం లేదు జీఓ 41(కనీసవేతన చట్టం) అమలు కాలేదు.
♦ ఈఎస్‌ఐ వైద్య సౌకర్యం పూర్తిస్థాయిలో లేదు.
♦ సంక్షేమ పథకాలపై కార్మికులకు అవగాహన కరువు. పట్టించుకోని కార్మికశాఖ.
♦ 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీ ప్రత్యామ్నాయఉపాధి.. కానీ ఇంతవరకు చూపలేదు.
♦ బీడీ కట్టపై పుర్రెగుర్తు తొలగింపు అమలుకాలేదు.
♦ జిల్లాకో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఉండాలని కార్మికుల దీర్ఘకాల డిమాండ్
ఆసరా పింఛన్ రావడం లేదు
నేను ఏడేళ్లుగా బీడీలు చేస్తున్నా. పీఎఫ్ కూడా ఉంది. కానీ ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ రావడం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇస్తామని అంటున్నారే తప్ప.. మంజూరు చేయడం లేదు. – బోండ్ల స్రవంతి, రాచర్లబొప్పాపూర్
-ముజఫర్
Comments
Please login to add a commentAdd a comment