Beedi industry
-
బీడీ బతుకులు మారలే...
మహిళల ఆర్థిక పరిపుష్టి, స్వావలంబనకు ఆసరాగా నిలుస్తున్న బీడీ పరిశ్రమ మసకబారిపోతున్న క్రమంలో తమ బాగుకు పనిచేసే వారి కోసం ఆ కార్మికులు ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపించేంతటి శక్తి ఉన్న తమను ఏ రాజకీయ పార్టీలు ఆదరిస్తాయా.. అని బీడీ కార్మికులు లెక్కలు వేసుకుంటున్నారు. బీడీ కార్మికులకు ఇప్పటి వరకు అందుతున్న జీవనభృతిని నెలకు రూ.2 వేల నుంచి రూ.5 వేలు చేస్తామని వివిధ రాజకీయ పార్టీలు హామీలిస్తున్నాయి. అయితే, కార్మికుల కనీస వేతనం, పింఛన్ పెంపుతో పాటు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించడం, సంక్షేమం, వైద్య సౌకర్యాల అమలు హామీలు దిశగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాలని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. కంపెనీలను కట్టడి చేసేదెవ్వరు? కార్మికులకు వేతనాల పెంపు అంశంలో యాజమాన్యాలు ఆడిందే ఆటగా సాగుతోంది. గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ప్రధాన కంపెనీలపై స్థానిక సర్కారు అజమాయిషీ అంతంతమాత్రమే కావడంతో న్యాయం జరగడం లేదు. 2010 నవంబర్‌లో వేతనాల పెంపు కోరుతూ కార్మికులు బంద్ పాటించారు. సుమారు 32 రోజులపాటు సమ్మె సాగిన క్రమంలో అప్పటి సర్కార్ కార్మికుల కనీస వేతనం రూ.130గా నిర్ణయిస్తూ 2011 డిసెంబర్లో జీఓ 41 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది. ఈ జీఓ అమలుకు యాజమాన్యాలు ఒప్పుకోలేదు. దాంతో కార్మిక సంఘాలు మరోసారి చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం జీఓ 81 జారీ అయ్యింది. ప్రస్తుతం వేయి బీడీలకు రూ.231 మాత్రమే ఇస్తున్నారు. వాస్తవానికి జీఓ 41 అమలైతే ప్రస్తుత పరిస్థితుల్లో వేయి బీడీలకు కనీసంగా రూ.600 వస్తాయనికార్మికులు చెబుతున్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వస్థాయిలో సైతం ఒత్తిడి తెచ్చి కంపెనీల యాజమాన్యాలను ఒప్పించేలా ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు స్పష్టమైన హామీ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. తగ్గుతున్న అమ్మకాలు.. పనిదినాలపై ప్రభావం తెలంగాణలో సుమారు 4,74,438 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. ఈ మధ్యకాలంలో మార్కెట్లలోకి వచ్చి చేరుతున్న మినీ సిగరెట్లతో బీడీల అమ్మకాలు పడిపోతున్నాయి. ఫలితంగా కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా నెలకు పది నుంచి పదిహేను రోజులు మాత్రమే కార్మికులకు ఆకు, తంబాకు ఇస్తూ మిగిలిన రోజుల్లో కంపెనీలు బంద్ చేస్తున్నాయి. కార్మిక చట్టాల ప్రకారం కనీసం ఏడాదికి 312 పనిదినాలు కల్పించాల్సి ఉండగా, యాజమాన్యాలు మాత్రం 100 నుంచి 120 రోజులు మాత్రమే పనిదినాలు కల్పిస్తున్నాయి. వాస్తవానికి సిగరెట్లపై నిబంధనల మేరకు ప్రచారం కల్పిస్తుండగా, బీడీలపై కనీసంగా ప్రచారం లేకపోవడంతోనే అమ్మకాలు తగ్గిపోతున్నాయని, ఫలితంగా తమ పనిదినాలూ తగ్గుతున్నాయని కార్మికులు వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కార్మికులకు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించే దిశగా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ దృష్టి సారించలేదన్న అసంతృప్తి కార్మికుల్లో నెలకొంది. ప్రధాన సమస్యలు.. ♦ పని దినాల కుదింపు.. ఫలితంగా వేతనం చాలడం లేదు జీఓ 41(కనీసవేతన చట్టం) అమలు కాలేదు. ♦ ఈఎస్ఐ వైద్య సౌకర్యం పూర్తిస్థాయిలో లేదు. ♦ సంక్షేమ పథకాలపై కార్మికులకు అవగాహన కరువు. పట్టించుకోని కార్మికశాఖ. ♦ 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీ ప్రత్యామ్నాయఉపాధి.. కానీ ఇంతవరకు చూపలేదు. ♦ బీడీ కట్టపై పుర్రెగుర్తు తొలగింపు అమలుకాలేదు. ♦ జిల్లాకో ఈఎస్ఐ ఆస్పత్రి ఉండాలని కార్మికుల దీర్ఘకాల డిమాండ్ ఆసరా పింఛన్ రావడం లేదు నేను ఏడేళ్లుగా బీడీలు చేస్తున్నా. పీఎఫ్ కూడా ఉంది. కానీ ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ రావడం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇస్తామని అంటున్నారే తప్ప.. మంజూరు చేయడం లేదు. – బోండ్ల స్రవంతి, రాచర్లబొప్పాపూర్ -ముజఫర్ -
బీడీ పరిశ్రమకు జీఎస్టీని మినహాయించండి
కేంద్ర మంత్రి అర్జున్రాంను కోరిన బీడీ మజ్దూర్ సంఘ్ సాక్షి, న్యూఢిల్లీ: అధికశాతం మహిళలు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నందున వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఆ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మెగ్వాల్‌ను అఖిల భారత బీడీ మజ్దూర్ మహా సంఘ్ నేతలు కోరారు. శనివారం కేంద్రమంత్రిని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలసిన సంఘం నేతలు.. జీఎస్టీలో బీడీ ఆకులపై 18 శాతం, బీడీలపై 28 శాతం పన్ను విధించడం వల్ల బీడీ పరిశ్రమ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వివరించారు. బీడీ పరిశ్రమలపై దాదాపు కోటి మంది వరకు ఆధారపడి బతుకుతున్నారని, జీఎస్టీలో పన్నులు పెంచడం వల్ల వారి జీవనాధారం ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. మెగ్వాల్‌ను కలసిన వారిలో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ తదితరులున్నారు. -
జీఎస్టీ భారం రూ.5.73 కోట్లు
సిరిసిల్ల: వేలాదిమంది మహిళలకు ఉపాధి కల్పించే బీడీ పరిశ్రమను జీఎస్టీలో(వస్తు సేవల పన్ను)ని 28వ శ్లాబులోకి చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శ్రామికుల ఉపాధికి గొడ్డలిపెట్టులాంటిదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. సర్కారు తీరుతో జిల్లాపై రోజూ కనీసం రూ.19.11 లక్షల చొప్పున నెలకు రూ.5.73 కోట్ల వరకు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఆటుపోట్ల మధ్య ఉన్న బీడీ పరిశ్రమ.. జీఎస్టీ ద్వారా సంక్షోభంలోకి వెళ్తుందని పేర్కొంటున్నారు. ఊరూరా ఉపాధి.. జిల్లాలోని 212 గ్రామాల్లో దాదాపు 65 వేల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారని అంచనా. దాదాపు 16 కంపెనీలు వీరికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇవికాకుండా మరో 20 వరకు అనధికారిక కంపెనీలు బీడీలు ఉత్పత్తి చేస్తున్నాయి. జిల్లాలో మహిళలకు అధికఉపాధి కల్పించేది బీడీ పరిశ్రమనే. ఇలాంటి పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించే జీఎస్టీతో పన్ను భారం పడుతుంది. వెయ్యి బీడీలు చేస్తే రూ.159 చెల్లించాల్సి ఉండగా.. కంపెనీలు నగదు బీడీల పేరిట వర్దిబీడీలను చేయిస్తున్నా యి. నెలంతా పనివ్వకుండా 15 రోజులు పని కల్పించి, మిగితా రోజుల్లో నగదు బీడీలను చేయిస్తున్నాయి. కొన్ని కంపెనీలు అసలు పని కల్పించకుండా కొద్దిగా బీడీలు చేయించి వదిలేస్తున్నాయి. నెలలో 20 రోజులకు మించి బీడీ కార్మికులకు పని ఉండడం లేదు. జిల్లా వ్యాప్తంగా 38,117 మంది బీడీ కార్మికులకు నెలనెలా రూ.1000 చొప్పున ఆసరా పింఛన్ వస్తుంది. అరకొర ఆదాయంలో జీవిస్తున్న బీడీ కార్మికులకు ప్రభుత్వం అందించే పింఛన్ కొంత మేలు చేస్తోంది. జిల్లాలో జీఎస్టీ భారమే.. జిల్లాలో 65 మంది బీడీ కార్మికులు ఉండగా.. సగటున ఒక్కో కార్మికురాలు 700 బీడీలు చేస్తుంది. ఈలెక్కన నిత్యం జిల్లావ్యాప్తంగా 4.55 కోట్ల బీడీలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పటికే బీడీలపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. ప్రతీవెయ్యి బీడీలపై రూ.16 సెంట్రల్ ఎక్సైజ్ సుంకం విధించడంతో రోజుకు రూ.7.28 లక్షల మేరకు పన్ను కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. కొత్తగా విధించే జీఎస్టీ ప్రకారం 28 శాతం పన్ను విధించే అవకాశం ఉంది. ఇది వచ్చేనెలలో అమలైతే జిల్లాలోని బీడీ పరిశ్రమపై రోజుకు రూ.19.11లక్షల మేరకు జీఎస్టీ భారం పడనుంది. ఇప్పటికే బీడీల కట్టలపై గొంతు క్యాన్సర్ గుర్తుల ఆంక్షలతో బీడీ పరిశ్రమ సంక్షోభంలో ఉంది. తద్వారా డిమాండ్ పడిపోయి చాలా కంపెనీలు మూతపడ్డాయి. బీడీ కార్మికులకు చేతినిండా పనిలేకుండా పోయింది. జీఎస్టీ అమలుతో బీడీల కట్టల ధరలు పెంచాల్సి వస్తుంది. దీంతో తాగేవాళ్ల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. దీంతో బీడీల ఉత్పత్తిని కంపెనీలు తగ్గించి కార్మికుల ఉపాధిలో కోత విధించే అవకాశంఉంది. ఇప్పటికే జిల్లాలో సగటున బీడీ కార్మికులకు నెలకు 20 రోజులకు మించి పనిలభించడంలేదు. తాజాగా జీఎస్టీ ఎఫెక్ట్‌తో బీడీపరిశ్రమ మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని భావిస్తున్నారు. ఈసమస్యను గుర్తించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్.. బీడీపరిశ్రమను జీఎస్టీ నుంచి మినహాయించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఇంకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. జీఎస్టీ అమలైతే బీడీపరిశ్రమ భవితవ్యం అగమ్యగోచరంగా మారనుంది. జిల్లాలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఇరవై రోజులే పని ఇరవై ఐదు ఏళ్లుగా బీడీలు చేస్తున్న. నెలకు ఇరవై రోజులే పని ఉంటది. రోజుకు 800 బీడీలు చేస్త. నెలకు రూ.1800 వస్తయి. మా ఆయన కైలాసం టెక్స్టైల్ పార్క్‌లో పనిజేస్తడు. ఆయనకు నెలకు రూ.6000 వస్తయి. గీ పైసలతోనే మేము బతుకుడు. బీడీలపని లేకుంటే మేం వట్టిగనే ఉండాలే. – కల్యాడపు అరుణ, బీడీ కార్మికురాలు బట్ట, పొట్టకే సరిపోతున్నయి నేను 13 ఏళ్లుగా బీడీలు చేస్తున్న. ఎంత జేసినా బట్టకు పొట్టకే సరిపోతున్నయి. ఆకు మంచిగ వస్తలేదు. తుట్టి అవుతంది. మేం ఆకు కొని బీడీలు చేస్తున్నాం. నెలకు రూ.1000 వరకు బీడీల పైసలు వస్తున్నాయి. ఈపని లేకుంటే మేం ఏం పని జేస్తం. మా పెనిమిటి గణేశ్ సాంచాలు నడిపిస్తడు. బీడీలపనితోనే బతుకుదెరువు. – కాటబత్తిని అరుణ, బీడీ కార్మికురాలు చేతినిండా పనిలేదు నేను 30 ఏళ్లుగా బీడీ ప్యాకింగ్ కార్మికుడిగా పని చేస్తున్న. ఏడేళ్లుగా చేతినిండా పని ఉంటలేదు. నెలకు 15 రోజులే పనిదొరుకుతంది. మిగితా రోజులు ఖాళీగానే ఉండాలి. బీడీలను బాగా తగ్గించిండ్రు. ఇప్పుడు నెలకు రూ.6000 వస్తుంది. చేతినిండా పనిఉంటే మంచిజీతం వస్తుంది. బీడీ పరిశ్రమపై పన్ను వేయద్దు. – కొక్కుల ప్రసాద్, ప్యాకింగ్ కార్మికుడు కేంద్రంపై ఒత్తిడి తేవాలి తెలంగాణ జిల్లాల్లో మహిళలకు ఉపాధి కల్పించే బీడీపరిశ్రమపై జీఎస్టీ విధించడం సరికాదు. ఇప్పటికే కార్మికులు చాలాకష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వం గుర్తించి పింఛన్లు ఇస్తుంది. కానీ జీఎస్టీతో మళ్లీ సంక్షోభంలో పడుతుంది. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి జీఎస్టీ లేకుండా చేయాలి. – వెంగళ శ్రీనివాస్, కార్మిక సంఘం నాయకుడు -
బీడీ పరిశ్రమకు జీఎస్టీ పొగ
♦ ప్రస్తుతం వెయ్యి బీడీలకు రూ.16 ఎక్సైజ్ డ్యూటీ ♦ ఇక అమ్మకంపై 28 శాతం వడ్డింపు.. ♦ బీడీ కార్మికులపై ప్రభావం కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి అమలు చేయనున్న జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) బీడీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే బీడీ కట్టపై గొంతు క్యాన్సర్ గుర్తు వంటి ఆంక్షలతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ పరిశ్రమపై ఈ పన్ను కోలుకోలేని దెబ్బతీయనుంది. – సాక్షి, నిజామాబాద్ తగ్గనున్న పనిదినాలు... రెక్కాడితే గానీ డొక్కాడని బీడీ కార్మికులకు ప్రస్తుతం నెలలో పది నుంచి 15 రోజులకు మించి పనిదినాలు లభించడం లేదు. కనీస వేతనాలకు సంబంధించిన జీవోనెం.41 ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. జీఎస్టీతో బీడీల ధరలను పెంచడం అనివార్యం కానుంది. తద్వారా బీడీ డిమాండ్ తగ్గి.. ఉత్పత్తి తగ్గించాల్సి వస్తుంది. దీంతో తమ పనిదినాలు తగ్గుతాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి లక్షలాది మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వాల ఆంక్షలతో ఈ పరిశ్రమ ఇప్పటికే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. జీఎస్టీతో కార్మికుల ఉపాధిపై దెబ్బపడుతుంది. ఇప్పటికే నెలలో 15 రోజులు కూడా పని దొరకడం లేదు. ఇకపై కార్మికుల పనిదినాలు మరింత తగ్గే అవకాశాలున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. – వనమాల కృష్ణ, తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కార్మికులు ఎక్కువగా ఉండే జిల్లాలు: నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట తక్కువగా ఉండే జిల్లాలు: వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ ప్రతి రోజు ఉత్పత్తి అవుతున్న బీడీల సంఖ్య: సుమారు 20 కోట్లు మన రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్న రాష్ట్రాలు: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్ 8,00,000 రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న బీడీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీడీ కంపెనీలు: సుమారు 150 ప్రస్తుతం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కింద ప్రతి వెయ్యి బీడీలకు వసూలు చేస్తున్న మొత్తం: రూ.16 రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం వసూలు చేస్తున్న సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ: రూ.75 కోట్లు జీఎస్టీ 28 శాతం అమల్లోకి వస్తే.. రూ.100 విలువ చేసే బీడీలపై ట్యాక్స్: రూ.28 -
పుర్రె గుర్తుపై కదం తొక్కిన కార్మికులు
మెట్పల్లి: కరీంనగర్ జిల్లాలో బీడీ కార్మికులు కదం తొక్కారు. బీడీ కట్టలపై పుర్రెగుర్తుతోపాటు 85 శాతం డేంజర్ మార్కును తొలగించాలని ఏఐటీయూసీ అనుబంధ బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. సోమవారం మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన వందలాది మంది బీడీ కార్మికులు చావిడి నుంచి ర్యాలీగా పాత బస్టాండ్ చౌరస్తాకు వచ్చి అక్కడ రాస్తారోకో చేశారు. అనంతరం అక్కడి నుంచి కొత్త బస్టాండ్ చేరుకొని మరోమారు రాస్తారోకో నిర్వహించారు. తర్వాత తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. బీడీ పరిశ్రమపై లక్షలాది మంది ఆధారపడి బతుకుతున్నారని, పుర్రె, డేంజర్ గుర్తుల వల్ల బీడీల అమ్మకాలు కార్మికులు రోడ్డున పడతారని అన్నారు. అలాగే బీడీ కట్టలపై పుర్రె, డేంజర్ బొమ్మలను 85శాతం మేరకు ముద్రించాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను నిరసిస్తూ బీడీ కార్మికులు గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కథలాపూర్, కోనరావుపేట తహశీల్దార్ కార్యాలయూల ఎదుట ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్లకు అందజేశారు. ఎల్లారెడ్డిపేటలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. కథలాపూర్ మండలంలోని 18 గ్రామాలకు చెందిన బీడీ కార్మికులు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీడీ పరిశ్రమపై ఆంక్షలు ఎత్తివేయూలని డిమాండ్ చేశారు. కోనరావుపేటలోనూ తహసీ ల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. -
బీడీ పరిశ్రమకు ‘పుర్రె’ భయం
సిరిసిల్ల/గంభీరావుపేట: బీడీ పరిశ్రమ మళ్లీ సంక్షోభం దిశగా పయనిస్తోంది. బీడీ కట్టలపై పుర్రె, డేంజర్ గుర్తులు ముద్రించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలోని బీడీ పరిశ్రమ మూతబడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తం గా పది జిల్లాల్లో బీడీ పరిశ్రమను సోమవారం నుంచి మూసివేయాలని బీడీ కంపెనీలు నిర్ణయించాయి. 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జీవో నంబర్ 297 ద్వారా బీడీ కట్టలపై 40 శాతం పుర్రె, ఎముకల గుర్తును ముద్రించాలని ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ బీడీ కార్మికులు ఆందోళన చేశారు. అప్పటినుంచి ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. కార్మికుల ఆందోళనలు పట్టించుకోకుండా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సర్క్యులర్ జీవో 727(ఈ) ద్వారా 85 శాతం డేంజర్ గుర్తును ఏప్రిల్ నుంచి ముద్రించాలని కోరడంతో బీడీ కంపెనీలు సంక్షోభంలో పడ్డాయి. మినీ సిగరెట్ల ప్రభావంతో బీడీ పరిశ్రమ అంతంత మాత్రంగానే నడుస్తుండగా, కొత్తగా పుర్రె, ఎముకల గుర్తులతో పరిశ్రమ మూతబడే పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. పరిశ్రమ మూత.. ఉపాధికి కోత ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా బీడీ కట్టలపై పుర్రె గుర్తు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బీడీ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. రాష్ట్రంలో 400 బీడీ కంపెనీలుండగా ఎనిమిది లక్షల మంది కార్మికులు ఉన్నారు. పుర్రెగుర్తు ముద్రణపై ప్రభుత్వం పునరాలోచించాలని యాజమాన్యాలు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే వినతిపత్రం సమర్పించినా స్పందన లేకపోవడంతో కంపెనీలు మూసివేయాలని నిర్ణయించాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి బీడీ ఉత్పత్తిని నిలిపివేసేందుకు బీడీ మాన్యుఫ్యాక్చరర్స్ అండ్ టొబాకో మర్చంట్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోని ఎనిమిది లక్షల మంది కార్మికులకు ప్రత్యక్షంగా బతుకుదెరువు కరువు కానుంది. కరీంనగర్ జిల్లాలో రెండులక్షల మం ది కార్మికులు ఉండగా, నిజామాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఆదిలాబాద్‌లో లక్ష, వరంగల్‌లో 80 వేలు, మెదక్‌లో మరో 60 వేలు, నల్గొండ, మహబాబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో మరో లక్ష మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వెయ్యి బీడీలకు సగటున రూ.153 ఇస్తున్నారు. నిత్యం 50 కోట్ల బీడీలు ఉత్పత్తి అవుతున్నాయి. కంపెనీల మూసివేతతో బీడీ తయారీదారులతోపాటు బట్టీవాలా, ప్యాకింగ్ కార్మికులు, వాచ్మెన్లు, గంపావాలా, గుమస్తాలు, అకౌంటెంట్లు వంటి ఉద్యోగులకు ఉపాధి దూరం కానుంది. -
‘పుర్రె’పై మరో పోరు
ఢిల్లీలో నేడు బీడీ యాజమాన్యాల సమావేశం కోరుట్ల: బీడీ పరిశ్రమను సమ్మెబాట పట్టించిన పుర్రె గుర్తు మరోమారు కార్మికులను కలవరపరుస్తోంది. బీడీకట్టలపై పుర్రె గుర్తు సైజు పెంపునకు కేంద్ర కార్మిక సంక్షేమశాఖ చర్యలు తీసుకుంటుండడాన్ని బీడీ కంపెనీల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే బీడీకట్టలపై ఉన్న పుర్రె గుర్తు, అవయవాల ముద్రణతో అమ్మకాలు పడిపోయాయని, మళ్లీ గుర్తు పెద్దగా చేసి మద్రించాలన్న యోచనతో తమ పరిస్థితి అధ్వానంగా మారుతుందని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో బీడీకట్టలపై పుర్రె గుర్తు సైజు పెంపునకు నిరసనగా కంపెనీల మూసివేతకు యజమాన్యాలు యోచిస్తున్నాయి. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న బీడీ కంపెనీల యాజమాన్యాలు గురువారం ఢిల్లీలో సమావేశమవుతున్నాయి. -
‘ధూమపాన చట్టం నుంచి బీడీని మినహాయించాలి’
షోలాపూర్, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన ధూమపాన చట్టం నుంచి బీడీ పరిశ్రమకు మినహాయింపు కల్పించాలని ఎన్‌సీసీపీ కార్మిక సెల్ పట్టణ అధ్యక్షుడు గోవర్ధన్ సంచు డిమాండ్ చేశారు. ఆయన గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కొత్త చట్టం ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీనుంచి బీడీ కట్టలపై 85 శాతం మేర హెచ్చరికలు, 15 శాతం మేర బ్రాండ్ పేరు ముద్రించుకోవాలి. దీనివల్ల బీడీ కట్టలపై కంపెనీ పేరు మరీ చిన్నదిగా కనిపిస్తుందని గోవర్ధన్ అన్నారు. పేరు సైజు తగ్గించడం వల్ల నిజమైన కంపెనీలు దెబ్బతింటాయని, విక్రయాలు పడిపోతాయని వాపోయారు. అలాగే తంబాకుపై కూడా నిషేధం విధించేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. దీనివల్ల సుమారు ఆరు లక్షల మంది బీడీ కార్మికులపై ప్రభావం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు బట్టల మిల్లులు, మరమగ్గాలు మూతపడుతుండటంతో స్థానికంగా ఉపాధి లభించడం కష్టమవుతోందని, ఇప్పుడు బీడీ పరిశ్రమ కూడా దెబ్బతింటే నిరుద్యోగ సమస్య పెరుగుతుందన్నా రు. ఈ అంశంపై ఎన్సీపీ సెల్ బృందం త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల ను కలిసి విన్నవిస్తామన్నారు. చట్టంపై ప్రభుత్వం పునరాలోచన చేయకుంటే ఎన్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. -
సిగరెట్‌పై రూ. 3.50 వడ్డన!
* బీడీ పరిశ్రమకు రాయితీలన్నీ కట్ * బడ్జెట్ పై ఆరోగ్యమంత్రి సూచనలు న్యూఢిల్లీ: పొగాకు వినియోగంతో ఆరోగ్యపరంగా, సామాజికపరంగా కలిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని, ఒక్కో సిగరెట్‌పై పన్నును మూడున్నర రూపొయల చొప్పన పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సూచించారు. సిగరెట్ల వినియోగాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకోవాలంటూ ఆయన గురువారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. వచ్చే నెల్లో సాధారణ బడ్జెట్ రాబోతున్న నేపథ్యంలో ఆయన ఈ లేఖరాశారు. ధూమపానాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా, బీడీ పరిశ్రమకు ఇచ్చే పన్ను మినహాయింపునకు కూడా స్వస్తి చెప్పాలన్నారు. దూమపానం ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన దష్ర్పభావం చూపుతోందని, ప్రతియేటా కోటిన్నరమంది పేదలుగా మారుతున్నారని హర్షవర్దన్ తెలిపారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో ఒక్కో సిగరెట్‌పై మూడున్నర రూపాయల చొప్పున పన్ను పెంచాలని సూచించారు. ఈ ప్రతిపాదనలను అమలుచేస్తే 30లక్షలమందిపైగా ధూమపానం మానేస్తారని, భారీగా పెంచే పన్నుతో ఖజానాకు రూ.3,800కోట్ల ఆదాయం వస్తుందన్నారు. పన్ను రాయితీలు బీడీ పరిశ్రమ విస్తృతికి ఉపయోగపడ్డాయే తప్ప, బీడీ కార్మికుల పరిస్థితి మాత్రం క్షీణించిందని చెప్పారు.