బీడీ పరిశ్రమకు ‘పుర్రె’ భయం
సిరిసిల్ల/గంభీరావుపేట: బీడీ పరిశ్రమ మళ్లీ సంక్షోభం దిశగా పయనిస్తోంది. బీడీ కట్టలపై పుర్రె, డేంజర్ గుర్తులు ముద్రించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలోని బీడీ పరిశ్రమ మూతబడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తం గా పది జిల్లాల్లో బీడీ పరిశ్రమను సోమవారం నుంచి మూసివేయాలని బీడీ కంపెనీలు నిర్ణయించాయి. 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జీవో నంబర్ 297 ద్వారా బీడీ కట్టలపై 40 శాతం పుర్రె, ఎముకల గుర్తును ముద్రించాలని ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ బీడీ కార్మికులు ఆందోళన చేశారు. అప్పటినుంచి ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. కార్మికుల ఆందోళనలు పట్టించుకోకుండా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సర్క్యులర్ జీవో 727(ఈ) ద్వారా 85 శాతం డేంజర్ గుర్తును ఏప్రిల్ నుంచి ముద్రించాలని కోరడంతో బీడీ కంపెనీలు సంక్షోభంలో పడ్డాయి. మినీ సిగరెట్ల ప్రభావంతో బీడీ పరిశ్రమ అంతంత మాత్రంగానే నడుస్తుండగా, కొత్తగా పుర్రె, ఎముకల గుర్తులతో పరిశ్రమ మూతబడే పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు.
పరిశ్రమ మూత.. ఉపాధికి కోత
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా బీడీ కట్టలపై పుర్రె గుర్తు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బీడీ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. రాష్ట్రంలో 400 బీడీ కంపెనీలుండగా ఎనిమిది లక్షల మంది కార్మికులు ఉన్నారు. పుర్రెగుర్తు ముద్రణపై ప్రభుత్వం పునరాలోచించాలని యాజమాన్యాలు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే వినతిపత్రం సమర్పించినా స్పందన లేకపోవడంతో కంపెనీలు మూసివేయాలని నిర్ణయించాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి బీడీ ఉత్పత్తిని నిలిపివేసేందుకు బీడీ మాన్యుఫ్యాక్చరర్స్ అండ్ టొబాకో మర్చంట్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోని ఎనిమిది లక్షల మంది కార్మికులకు ప్రత్యక్షంగా బతుకుదెరువు కరువు కానుంది.
కరీంనగర్ జిల్లాలో రెండులక్షల మం ది కార్మికులు ఉండగా, నిజామాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఆదిలాబాద్‌లో లక్ష, వరంగల్‌లో 80 వేలు, మెదక్‌లో మరో 60 వేలు, నల్గొండ, మహబాబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో మరో లక్ష మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వెయ్యి బీడీలకు సగటున రూ.153 ఇస్తున్నారు. నిత్యం 50 కోట్ల బీడీలు ఉత్పత్తి అవుతున్నాయి. కంపెనీల మూసివేతతో బీడీ తయారీదారులతోపాటు బట్టీవాలా, ప్యాకింగ్ కార్మికులు, వాచ్‌మెన్లు, గంపావాలా, గుమస్తాలు, అకౌంటెంట్లు వంటి ఉద్యోగులకు ఉపాధి దూరం కానుంది.