బీడీ కార్మికులకు కేంద్ర నిధులతో ఇళ్లు
♦ కేంద్ర మంత్రి దత్తాత్రేయ వెల్లడి
♦ పెన్షన్, పీఎఫ్ సెటిల్‌మెంట్లకు ‘శ్రమ్ సువిధ’ పోర్టల్
♦ కింగ్‌ఫిషర్ ఉద్యోగుల హక్కుల కోసం స్క్వాడ్
సాక్షి, హైదరాబాద్: బీడీ కార్మికుల సంక్షేమం దృష్ట్యా కేంద్ర నిధులతో పక్కా గృహాలు కట్టిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని నిజామాబాద్, వరంగల్, సిద్దిపేటలను గుర్తించామని, రాష్ట్రం ప్రభుత్వం స్థలం ఇస్తే మోడల్ హౌస్‌లు నిర్మిస్తామన్నారు. అలాగే ఏపీలో ముఖ్యమైన ప్రాంతాలను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని భవిష్య నిధి కార్యాలయంలో తెలంగాణ, ఏపీలకు చెందిన ఈపీఎఫ్ అధికారులతో దత్తాత్రేయ సమీక్ష నిర్వహించా రు.
ఆయన మాట్లాడుతూ కార్మికులకు పెన్షన్, క్లెయిమ్‌లు, సెటిల్‌మెంట్లను పారదర్శకంగా నిర్వహించేం దుకు ‘శ్రమ్ సువిధ’ వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కార్మిక సేవలను సులభతరం చేస్తున్నామన్నారు. తెలంగాణలో 29,269 పరిశ్రమలలో 36.91 లక్షల మందికి, ఏపీలో 22,706 పరిశ్రమల్లో 13.29 లక్షల మందికి భవిష్య నిధి సభ్యత్వం ఉందన్నారు. యాజ మాన్యాలతో సంబంధం లేకుండా వీరికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ద్వారా పీఎఫ్ సొమ్ము నేరుగా పొందేలా కృషి చేస్తున్నామన్నారు.
కార్మికుల కనీస వేతనాన్ని పెంచాలని భావిస్తున్నామని, ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు చేపట్టామన్నారు. బ్యాంకులకు రూ. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన ‘కింగ్‌ఫిషర్’ యజమాని విజయ్‌మాల్యా విదేశాలకు పారిపోవడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు ఒక స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. తమ శాఖ తరఫున వేసిన కమిటీ నివేదిక ఆధారంగా ‘కింగ్‌ఫిషర్’ నుంచి ఏ మేరకు నిధులు రావాల్సి ఉందో.. వాటన్నింటినీ రాబట్టి ఉద్యోగులకు అందిస్తామన్నారు. పార్లమెంటులో ఆధార్ బిల్లుకు ఆమోదం వల్ల కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. కానీ కాంగ్రెస్, వామపక్షాలు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తూ కీలక బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నాయన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, గుంటూరు రీజనల్ అధికారులు ఎం.ఎస్.కె.వి.వి. సత్యనారాయణ, కె.నారాయణ, పి.వీరభద్రస్వామి పాల్గొన్నారు.