26 నుంచి మోదీ రెండేళ్ల పండుగ
కేంద్ర మంత్రి దత్తాత్రేయ
హైదరాబాద్: ‘మోదీ రెండేళ్ల పండుగ’ను ఈ నెల 26 నుంచి జూన్ 26 వరకు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. కేంద్రం, రాష్ట్ర బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ ఉత్సవాలు జరపనున్నట్లు తెలిపారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, వాటి వల్ల లబ్ధిపొందిన వారిని నేరుగా కలవనున్నట్లు వెల్లడించారు.
‘యువతా మేలుకో నైపుణ్యం పెంచుకో’ అనే నినాదంతో రూపొందిం చిన స్కిల్ డెవలప్‌మెంట్ పథకానికి కేంద్రం రూ.1,600 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దేశంలో ఏర్పాటు చేస్తున్న 8 ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లలో ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రానున్న పదేళ్లలో దాదాపు 5 కోట్ల మంది వీటి ద్వారా ఉపాధి పొందుతారని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లో త్వరలో మూడు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కార్మికులు, రైతులు, అట్టడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు నేరుగా అభివృద్ధి ఫలాలను అందించేందుకు ముద్ర యోజన పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. దేశంలోని 5 లక్షల గ్రామాలకు రూ.2 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా అందజేసిన ఘనత మోదీదేనని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్, వామపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని దుయ్యబట్టారు.