జీఎస్టీ భారం రూ.5.73 కోట్లు | The GST burden at Rs 5.73 crore | Sakshi
Sakshi News home page

జీఎస్టీ భారం రూ.5.73 కోట్లు

Published Sat, Jun 10 2017 4:44 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

జీఎస్టీ భారం రూ.5.73 కోట్లు - Sakshi

జీఎస్టీ భారం రూ.5.73 కోట్లు

సిరిసిల్ల:  వేలాదిమంది మహిళలకు ఉపాధి కల్పించే బీడీ పరిశ్రమను జీఎస్టీలో(వస్తు సేవల పన్ను)ని 28వ శ్లాబులోకి చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శ్రామికుల ఉపాధికి గొడ్డలిపెట్టులాంటిదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. సర్కారు తీరుతో జిల్లాపై రోజూ కనీసం రూ.19.11 లక్షల చొప్పున నెలకు రూ.5.73 కోట్ల వరకు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఆటుపోట్ల మధ్య ఉన్న బీడీ పరిశ్రమ.. జీఎస్టీ ద్వారా సంక్షోభంలోకి వెళ్తుందని పేర్కొంటున్నారు.
 
ఊరూరా ఉపాధి..
జిల్లాలోని 212 గ్రామాల్లో దాదాపు 65 వేల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారని అంచనా. దాదాపు 16 కంపెనీలు వీరికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇవికాకుండా మరో 20 వరకు అనధికారిక కంపెనీలు బీడీలు ఉత్పత్తి చేస్తున్నాయి. జిల్లాలో మహిళలకు అధికఉపాధి కల్పించేది బీడీ పరిశ్రమనే. ఇలాంటి పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించే జీఎస్టీతో పన్ను భారం పడుతుంది. వెయ్యి బీడీలు చేస్తే రూ.159 చెల్లించాల్సి ఉండగా.. కంపెనీలు నగదు బీడీల పేరిట వర్దిబీడీలను చేయిస్తున్నా యి. నెలంతా పనివ్వకుండా 15 రోజులు పని కల్పించి, మిగితా రోజుల్లో నగదు బీడీలను చేయిస్తున్నాయి. కొన్ని కంపెనీలు అసలు పని కల్పించకుండా కొద్దిగా బీడీలు చేయించి వదిలేస్తున్నాయి. నెలలో 20 రోజులకు మించి బీడీ కార్మికులకు పని ఉండడం లేదు. జిల్లా వ్యాప్తంగా 38,117 మంది బీడీ కార్మికులకు నెలనెలా రూ.1000 చొప్పున ఆసరా పింఛన్‌ వస్తుంది. అరకొర ఆదాయంలో జీవిస్తున్న బీడీ కార్మికులకు ప్రభుత్వం అందించే పింఛన్‌ కొంత మేలు చేస్తోంది.
 
జిల్లాలో జీఎస్టీ భారమే..
జిల్లాలో 65 మంది బీడీ కార్మికులు ఉండగా.. సగటున ఒక్కో కార్మికురాలు 700 బీడీలు చేస్తుంది. ఈలెక్కన నిత్యం జిల్లావ్యాప్తంగా 4.55 కోట్ల బీడీలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పటికే బీడీలపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ విధిస్తున్నారు. ప్రతీవెయ్యి బీడీలపై రూ.16 సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం విధించడంతో రోజుకు రూ.7.28 లక్షల మేరకు పన్ను కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. కొత్తగా విధించే జీఎస్టీ ప్రకారం 28 శాతం పన్ను  విధించే అవకాశం ఉంది. ఇది వచ్చేనెలలో అమలైతే జిల్లాలోని బీడీ పరిశ్రమపై రోజుకు రూ.19.11లక్షల మేరకు జీఎస్టీ భారం పడనుంది. ఇప్పటికే బీడీల కట్టలపై గొంతు క్యాన్సర్‌ గుర్తుల ఆంక్షలతో బీడీ పరిశ్రమ సంక్షోభంలో ఉంది.

తద్వారా డిమాండ్‌ పడిపోయి చాలా కంపెనీలు మూతపడ్డాయి. బీడీ కార్మికులకు చేతినిండా పనిలేకుండా పోయింది. జీఎస్టీ అమలుతో బీడీల కట్టల ధరలు పెంచాల్సి వస్తుంది. దీంతో తాగేవాళ్ల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. దీంతో బీడీల ఉత్పత్తిని కంపెనీలు తగ్గించి కార్మికుల ఉపాధిలో కోత విధించే అవకాశంఉంది. ఇప్పటికే జిల్లాలో సగటున బీడీ కార్మికులకు నెలకు 20 రోజులకు మించి పనిలభించడంలేదు. తాజాగా జీఎస్టీ ఎఫెక్ట్‌తో బీడీపరిశ్రమ మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని భావిస్తున్నారు. ఈసమస్యను గుర్తించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌.. బీడీపరిశ్రమను జీఎస్టీ నుంచి మినహాయించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఇంకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. జీఎస్టీ అమలైతే బీడీపరిశ్రమ భవితవ్యం అగమ్యగోచరంగా మారనుంది. జిల్లాలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది.
 
ఇరవై రోజులే పని 
ఇరవై ఐదు ఏళ్లుగా బీడీలు చేస్తున్న. నెలకు ఇరవై రోజులే పని ఉంటది. రోజుకు 800 బీడీలు చేస్త. నెలకు రూ.1800 వస్తయి. మా ఆయన కైలాసం టెక్స్‌టైల్‌ పార్క్‌లో పనిజేస్తడు. ఆయనకు నెలకు రూ.6000 వస్తయి. గీ పైసలతోనే మేము బతుకుడు. బీడీలపని లేకుంటే మేం వట్టిగనే ఉండాలే.
– కల్యాడపు అరుణ, బీడీ కార్మికురాలు
 
బట్ట, పొట్టకే సరిపోతున్నయి 
నేను 13 ఏళ్లుగా బీడీలు చేస్తున్న. ఎంత జేసినా బట్టకు పొట్టకే సరిపోతున్నయి. ఆకు మంచిగ వస్తలేదు. తుట్టి అవుతంది. మేం ఆకు కొని బీడీలు చేస్తున్నాం. నెలకు రూ.1000 వరకు బీడీల పైసలు వస్తున్నాయి. ఈపని లేకుంటే మేం ఏం పని జేస్తం. మా పెనిమిటి గణేశ్‌ సాంచాలు నడిపిస్తడు. బీడీలపనితోనే బతుకుదెరువు.
– కాటబత్తిని అరుణ, బీడీ కార్మికురాలు
 
చేతినిండా పనిలేదు 
నేను 30 ఏళ్లుగా బీడీ ప్యాకింగ్‌ కార్మికుడిగా పని చేస్తున్న. ఏడేళ్లుగా చేతినిండా పని ఉంటలేదు. నెలకు 15 రోజులే పనిదొరుకుతంది. మిగితా రోజులు ఖాళీగానే ఉండాలి. బీడీలను బాగా తగ్గించిండ్రు. ఇప్పుడు నెలకు రూ.6000 వస్తుంది. చేతినిండా పనిఉంటే మంచిజీతం వస్తుంది. బీడీ పరిశ్రమపై పన్ను వేయద్దు.
– కొక్కుల ప్రసాద్, ప్యాకింగ్‌ కార్మికుడు
 
కేంద్రంపై ఒత్తిడి తేవాలి 
తెలంగాణ జిల్లాల్లో మహిళలకు ఉపాధి కల్పించే బీడీపరిశ్రమపై జీఎస్టీ విధించడం సరికాదు. ఇప్పటికే కార్మికులు చాలాకష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వం గుర్తించి పింఛన్లు ఇస్తుంది. కానీ జీఎస్టీతో మళ్లీ సంక్షోభంలో పడుతుంది. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి జీఎస్టీ లేకుండా చేయాలి. 
– వెంగళ శ్రీనివాస్, కార్మిక సంఘం నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement