
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన జూలై 1ని జీఎస్టీ దినోత్సవంగా పాటిస్తామని కేంద్ర ప్రభుత్వం శనివారం చెప్పింది. భారతీయ పన్ను వ్యవస్థలో ఊహించని సంస్కరణలు జీఎస్టీతో సాధ్యమయ్యాయంది. ‘ఒక దేశం, ఒకే పన్ను’ నినాదంతో గతేడాది జూలై 1న జీఎస్టీ అమల్లోకొచ్చింది. జీఎస్టీని అమలు చేయడంలో ఈ ఏడాది కాలంలో అనేక సమస్యలు ఎదురయ్యాయని, అన్నింటినీ పరిష్కరించామని ఆర్థిక శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు విధించే అనేక రకాల పన్నులను ఏకం చేసి దేశ మంతటా ఒకే విధానంతో ఒకే రకమైన పన్నును జీఎస్టీ ద్వారా తీసుకొచ్చామంది.
బిల్లు తప్పక తీసుకోండి: గోయల్
వినియోగదారులు తాము కొన్న ప్రతి వస్తువుకూ బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలనీ, ఎవరైనా యజమానులు ఇవ్వకపోతే బిల్లు కావాల్సిందేనని పట్టుబట్టి అడగాలని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాపారుల పన్ను ఎగవేతలు, అక్రమాలపై ప్రజలే నేరుగా ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ఓ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. కాంపొజిషన్ పథకం పరిమితిని కోటి రూపాయలకు మించి పెంచేందుకు ఈ వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు జీఎస్టీ చట్టానికి సవరణల బిల్లులను ప్రవేశపెడతామని గోయల్ చెప్పారు.