తెలంగాణకు రూ.1,178 కోట్లు | Rs 1,178 crore to Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు రూ.1,178 కోట్లు

Published Wed, Sep 20 2017 3:05 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

తెలంగాణకు రూ.1,178 కోట్లు - Sakshi

తెలంగాణకు రూ.1,178 కోట్లు

- సెప్టెంబర్‌ పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం
జీఎస్‌టీ అమలైనా.. పన్నుల వాటా అంతంతే
జీఎస్‌టీతోనూ మార్పులేక తలపట్టుకున్న ఆర్థిక శాఖ
 
సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర పన్నుల వాటాలో తెలంగాణకు రూ.1,178 కోట్లు విడుదలయ్యాయి. గతంలో ప్రతి నెలా ఒకటో తేదీనే పన్నుల వాటా నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విడుదల చేసేది. జూలై నుంచి దేశవ్యాప్తంగా జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచీ ఈ నిధుల పంపిణీ జాప్యమవుతోంది. ఒకటో తేదీన ఇచ్చే నిధులు 15 లేదా 20వ తేదీ వరకు కేంద్రం నుంచి రావటం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త విధానం ఉండటంతో పన్నులతో ఎంత ఆదాయం వస్తుంది? అందులో 42 శాతం చొప్పున రాష్ట్రాలకు ఎన్ని నిధులు పంపిణీ చేయాలి? అని కేంద్ర ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. అందుకే పన్నుల వాటా పంపిణీ గాడిన పడలేదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. 
 
రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశ..
జీఎస్‌టీ అమల్లోకి రావటం, ఇంకా పన్నుల ద్వారా వచ్చే ఆదాయంపై స్పష్టత లేకపోవటంతో కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటాను పంపిణీ చేయటంలో కొంత ఆలస్యం చేసింది. ఇందులో భాగంగా ఆగస్టులో రూ.1,200 కోట్లు విడుదల చేసిన కేంద్రం, తాజాగా రూ.1,178 కోట్లు విడుదల చేసింది. నిరుటితో పోలిస్తే పన్నుల వాటా ఆశాజనకంగా లేకపోవటం తెలంగాణ ప్రభుత్వాన్ని నిరాశకు గురిచేసింది. గత ఏడాది ప్రతి నెలా రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.1,000 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల మేరకు పన్నుల వాటా జమైంది. జీఎస్‌టీతో ఈ మొత్తం పెరుగుతుందని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వం భంగపడింది.
 
జీఎస్‌టీతో రెండు నెలలు వరుసగా గండి
ఇప్పటికే జీఎస్‌టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జీఎస్టీ తర్వాత తొలి రెండు నెలలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి భారీగా గండి పడింది. జూలైలోనే దాదాపు రూ.700 కోట్ల ఆదాయం తగ్గింది. దీంతో జీఎస్‌టీ అమల్లోకి రాకముందు ఉన్న పరిస్థితిని బేరీజు వేసుకుంటే ఇప్పుడు వస్తున్న ఆదాయం ఆందోళనకరంగానే ఉంది. ఈ ఏడాది జూన్‌లో వ్యాట్, ఎక్సైజ్‌ పన్నుల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.3,100 కోట్ల ఆదాయం సమకూరింది. జూలై 1 నుంచి జీఎస్‌టీ అమలైంది. జూలైలో ఒకే పన్ను విధానంతో వచ్చిన ఆదాయం రూ.2,377 కోట్లుగా లెక్కతేలింది. ఆగస్టులో రూ.2,661.28 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు జమైంది. 2016 ఆగస్టులో వ్యాట్‌ రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.2,822 కోట్లు జమైంది.
 
అంతర్రాష్ట్ర పన్నుపైనే ఆశలు..
అంతర్రాష్ట్ర జీఎస్టీలో రాష్ట్రానికి వచ్చే వాటా తోనే ఆదాయ లోటు తీరుతుందని ప్రభుత్వం ఆశపడుతోంది. జూలైలో రాష్ట్రంలో అంత ర్రాష్ట్ర జీఎస్టీ పద్దు కింద రూ.683 కోట్లు వసూలైంది. ఆగస్టులో ఇది రూ.418 కోట్లకు తగ్గింది. వస్తువులు, సరుకుల అమ్మకాలు, రవాణా ఆధారంగా ఈ పద్దును దేశంలోని వివిధ రాష్ట్రాలకు తమ తమ వాటాలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. అదే తీరుగా ఇతర రాష్ట్రాల్లో వసూలైన అంతర్రాష్ట్ర జీఎస్టీలో తెలంగాణకు వాటా సమకూరు తుంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా వసూలైన రూ.24,021 కోట్ల ఐజీఎస్‌టీ పంపిణీ చేయాల్సి ఉంది. అందులో తెలంగాణకు రూ.600 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు వచ్చే అవకాశముందని వాణిజ్య పన్నుల శాఖతో పాటు ఆర్థిక శాఖ ఆశాభావంతో ఉంది. ప్రతి మూడు నెలలకోసారి ఐజీఎస్‌టీని కేంద్రం రాష్ట్రాలకు సర్దుబాటు చేసే అవకాశముంది. ఐజీఎస్‌టీ వాటా తేలితే జీఎస్‌టీ లాభనష్టాలపై స్పష్టమైన అంచనా వస్తుందని అధికారులు విశ్లేషిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement